కారులో కోటి.. మునుగోడుకు తరలిస్తుండగా పట్టివేత
posted on Oct 18, 2022 6:08AM
ఎన్నికల ఖర్చు విషయంలో మునుగోడు ఉప ఎన్నిక మరో చరిత్ర సృష్టిస్తుందా? అన్న అనుమానాలు ముందు నుంచీ ఉన్నాయి. మనుగోడు మరో చరిత్ర సృష్టిస్తుందా? అన్న శీర్షికన తెలుగువన్ గత నెల 4వ తేదీనే మునుగోడులో డబ్బు ప్రవాహంపై వార్త ప్రచురించింది. ఎన్నికల చరిత్రలో, ఓటర్లను ప్రలోభ పెట్టడంలో ఇప్పటికే కొత్త చరిత్రను సృష్టించిన హుజూరాబాద్ ఉప ఎన్నిక రికార్డును మునుగోడు చెరిపేస్తుందని తెలుగువన్ ముందే అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే హుజూరాబాద్ ను మించి మునుగోడులో డబ్బు మద్యం ప్రవాహాలు జోరందుకున్నాయి.
నియోజక వర్గం పరిధిలో, మద్యం ఏరులై ప్రవహిస్తోంది. నియోజకవర్గానికి సమీప మండలాల్లోనూ మద్యం విక్రయాలు రెట్టింపయ్యాయి. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అని తెలిసినప్పటి నుంచీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి అన్ని పార్టీలూ పోటీలు పడుతూ వస్తున్నాయి. అంతెందుకు ఆగస్టు 1 నుంచి 29వ తేదీ వరకు చండూరు, నాంపల్లి, రామన్నపేట ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో 1,11,279 పెట్టెల మద్యం విక్రయాలు జరిగాయి. ప్రభుత్వానికి రూ.43.19 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఫంక్షన్ హాళ్లను తీసుకుని సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ గ్రామాల్లో పార్టీల ఫిరాయింపు బేరసారాలతో రాత్రివేళ అధిక సంఖ్యలో మద్యం సిట్టింగ్‌లు జరుగుతున్నాయి. దీంతో మద్యం విక్రయాలు మరింత పెరుగుతున్నాయి.

మునుగోడు ఉపఎన్నికలో డబ్బు ప్రవాహం కనిపిస్తోంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బును మునుగోడుకు తరలిస్తున్నారు. మునుగోడులో భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. తాజాగా చల్మడ చెక్ పోస్ట్ దగ్గర సోమవారం (అక్టోబర్ 17)పోలీసులు జరిపిన తనిఖీల్లో ఓ కారులో కోటి రూపాయలకు పైగా నగదు పట్టుబడింది. ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు కారును కూడా సీజ్ చేశారు పోలీసులు. డబ్బు తరలిస్తున్న వాహనం కరీంనగర్ కు చెందిన బీజేపీ నేత సొప్పరి వేణుకి చెందినదిగా గుర్తించారు.
ఆయన భార్య కరీంనగర్ 13వ డివిజన్ కార్పొరేటర్. మునుగోడుకే కోటి రూపాయల నగదు తరలిస్తున్నట్లుగా విచారణలో వేణు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. మాజీ ఎంపీ వివేక్ ఆదేశాలతో విజయవాడకు చెందిన రాము దగ్గరి నుంచి కోటి రూపాయలు తీసుకుని మునుగోడు వెళ్తున్నట్లు వేణు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. సీజ్ చేసిన డబ్బుని ఐటీ అధికారులకు అప్పగించారు పోలీసు. తెరాస, బీజేపీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా పోటీలో ఉన్న నేపధ్యంలో ఓటు రేటు భారీగా పెరుగుతున్నదని, ఓటర్లు లెక్కలు వేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ రూ.10 వేల దాకా ఇస్తున్నదన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అంటే, మూడు పార్టీల నుంచి కలిపి ఓటుకు రూ.30 వేల వరకు అందుతాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చేసే వ్యయం, పంచే సొమ్ము మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు పరిశీలకులు. అయితే, హుజురాబాద్ తో మునుగోడు పోటీ పడుతుందా? హుజూరాబాద్ మలిన చరిత్రను మునుగోడు చెరిపేస్తుందా? ఇంకా ఎక్కువ చేస్తుందా, అంటే, చూడాలి మరి ..అంటున్నారు.