విశాఖలో మావోయిస్టుల కదలికలు... రాజధానిగా సేఫ్ కాదంటోన్న పోలీసులు..!
posted on Dec 30, 2019 10:16AM
.jpg)
అమరావతి రైతుల ఆందోళనలు... విపక్షాల విమర్శలతో మూడు రాజధానుల ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసినా... జగన్ ప్రభుత్వం తాను అనుకున్న గడువులోపు మొత్తం తతంగాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. అయితే, రాజధానిని విశాఖకు తరలించాలన్న నిర్ణయంపై అమరావతి రైతుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో రాష్ట్రప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. పక్కా ప్లాన్ తో తాను అనుకున్న గడువులోపు రాజధాని తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటోంది.
అయితే, రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయంపై పోలీస్ అధికారులు వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లాలో మావోయిస్టులు కదలికలు ఎక్కువగా ఉన్నాయని, భద్రత దృష్ట్యా వైజాగ్ లో రాజధాని పెట్టడం మంచిది కాదంటున్నారు. ఎన్నికలకు ముందు అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావును, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమాను మావోయిస్టులు కాల్చిచంపిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాగే, ఇటీవల డీజీపీ విడుదల చేసిన వార్షిక నివేదికలోనూ మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉందని తేలిందని, అలాంటి ప్రాంతంలో రాజధాని పెట్టడమంటే... ప్రముఖులను రిస్క్ లోకి నెట్టడమేనంటున్నారు.
అయితే, రాజధానిపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీలోకి డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కూడా తీసుకోవడంపై పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖలో రాజధాని ఏర్పాటును కొందరు పోలీస్ ఉన్నతాధికారులు వ్యతిరేకిస్తుండటంతో.... పోలీస్ బాస్ తోనే... ఎస్ అనిపించుకోవడానికే గౌతమ్ సవాంగ్ ను హైపవర్ కమిటీలోకి తీసుకున్నారనే మాట వినిపిస్తోంది. రాజధానిగా విశాఖ అనువైన ప్రాంతమని పోలీస్ బాస్ చెబితే ఇంకెవరికీ అభ్యంతరాలు ఉండవనేది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. మొత్తానికి అడ్డంకులేమీ లేకుండా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు పక్కా ప్లాన్ ప్రకారం జగన్ ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు.