ఉండవల్లి కాదు ఊసరవెల్లి..!
posted on Feb 10, 2025 3:17PM

రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పరిచయం అక్కర్లేని పేరు. స్వయం ప్రకటిత మేధావిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరపరిచితుడు. వైఎస్ కు నమ్మిన బంటుగా ఉండవల్లి రాజకీయాలలో గుర్తింపు పొందారు. ఆయన ఆశీస్సులతో రాజమహేంద్రవరం నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. లోక్ సభ సభ్యుడిగా ఆయన రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏం చేశారో తెలియదు కానీ, రాష్ట్ర విభజన తరువాత రాజకీయ సన్యాసం ప్రకటించి.. తన గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రేయోభిలాషిగా మిగిలిపోయారు.
ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయినా, అవినీతి, అరాచకత్వం రాజ్యమేలినా.. ఉండవల్లి ఉలకలేదు, పలకలేదు. కానీ జగన్ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి సారీ.. ఆయనకు మద్దతుగా మీడియా ముందుకు వచ్చి తనకు మాత్రమే సాధ్యమైన వితండ వాదంతో ఆయన తరఫున మాట్లాడే వారు. ఈ నేపథ్యంలో ఆయన తన వాదనను తానే ఖండించుకుంటూ గతంలో తాను ఔనన్న దానికి కాదంటూ, కాదన్న దానికి ఔనంటూ అపర ఊసరవెల్లిలా మారిపోయారు. సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండీ వాస్తవాలను గుర్తించకుండా జగన్ కు అనుకూలంగా ఆయన చేసిన విశ్లేషణలూ, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలూ అప్పట్లో నవ్వుల పాలయ్యాయి. ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారి జనంలో క్రెడిబులిటీ కోల్పోయారు. తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, జగన్ కు మద్దతుగా నిలవడం కోసం వాస్తవాలను ఆయన వక్రీకరించిన విధానంపై వైసీపీయులు కూడా ఒకింత అసహనానికి లోనైన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి.
మరీ ముఖ్యంగా జగన్ అధికారంలో ఉండగా స్కిల్ కేసు అంటూ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా రోడ్లపైకి వచ్చి నిరసన బాట పడితే.. ఒక్క ఉండవల్లి మాత్రం స్కిల్ కేసు సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం లేకుండా అన్యాయంగా అరెస్టు చేసిన విషయాన్ని దేశం మొత్తం గుర్తించినా, అపర మేధావి ఉండవల్లికి మాత్రం అందులో న్యాయం కనిపించింది. తన రాజకీయ గురువు వైఎస్ జగన్ కు అండగా నిలవడమే తక్షణ కర్తవ్యంగా అనిపించింది. వాస్తవానికి స్కిల్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ చూపకుండా? ఆయనను జనంలో తిరగనీయకూడదన్న ఏకైక లక్ష్యంతో జగన్ సర్కార్ కుట్రపూరితంగా ముందు అరెస్టు చేసి ఆనక తీరిగ్గా ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల కోసం ప్రయత్నాలు ప్రారం భించామని చెప్పుకుంది.
అటువంటి స్కిల్ కేసుపై సీబీఐ విచారణ కావాలంటూ ఉండవల్లి అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ఇలా ఒక్కటనేమిటి.. జగన్ ఐదేళ్ల పాలనలో జగన్ కు వత్తాసు పలకడానికి మాత్రమే ఈ స్వయం ప్రకటిత మేధావి, రాజకీయ సన్యాసం పుచ్చుకున్న యోగి పుంగవుడు మీడియా ముందుకు వచ్చే వారు. అందు కోసం తటస్థుడనన్న ముద్ర వేసుకునే వారు. సరే జనం తీర్పుతో జగన్ అధికారం కోల్పోయారు. అత్యంత అవమానకరమైన ఓటమి వైసీపీకి జనం కట్టబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇక ఓటమి తరువాత వైసీపీ నుంచి ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. చివరాఖరికి పార్టీలో నంబర్ 2, జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడు, ఏ2 అయిన విజయసాయి కూడా వైసీపీని వీడి పోయారు.
దీంతో ఇక ఉండవల్లి రంగంలోకి దిగడానికి సిద్ధమైపోయారు. ఇంక ముసుగులెందుకు అనుకున్నారో ఏమో, రాజకీయ సన్యాసానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వైసీపీలో చేరి యాక్టివ్ పాలిటిక్స్ లోకి దూకేస్తానం టున్నారు. గత రెండు రోజులుగా ఉండవల్లి వైసీపీలో చేరికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే వాస్తవమైతే మేధావి ముసుగు తొలగించుకుని ఉండవల్లి తనలోని జగన్ భక్త హనుమాన్ ను జనానికి చూపించినట్లే. ఉండవల్లి ప్రజా నాయకుడేం కాదు. మీడయా సమావేశాలలో గంటల తరబడి ప్రసంగించగలరేమో కానీ, బహిరంగ సభ పెడితే ఆయన ప్రసంగం వినడానికి పట్టుమని పది మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. అటువంటి ఉండవల్లి వైసీపీ గూటికి చేరితే ఆయన మీడియా సమావేశాలకూ క్రెడిబులిటీ ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన వైసీపీ గూటికి చేరడమంటే.. తెలుగుదేశం కూటమి నెత్తిన పాలు పోసినట్లేనంటున్నారు.