సర్కార్ వ్యతిరేక ఓటు చీలదుగాక చీలదు.. జనసేనాని పునరుద్ఘాటన
posted on Mar 31, 2023 12:22AM
ఓ వంక ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వినిపిస్తున్న వేళ.. అధికార వైసీపీని ఓటమి భయం వెంటాడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగా అనివార్యంగా ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి కుంగదీసింది. మరో వంక, తెలుగు దేశం,జనసేన పొత్తు భయపెడుతోంది. అందుకే, ఏదో విధంగా ఇంచుమించుగా ఖరారైన టీడీపీ, జనసేన పొత్తును తుంచేందుకు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందుకోసం ఓ వంక ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్న జగన్ రెడ్డి, మరోవంక జనసేన, టీడీపీ క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేసేందుకు,వదంతులు పుట్టిస్తున్నారు. అబద్ధాల హరిశ్చంద్రులు అనదగ్గ, మంత్రులు, మాజీ మంత్రులను వదిలి, టీడీపీ, జనసేన నాయకుల మధ్య విబేధాలు సృష్టించేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపద్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరోమారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని, స్పష్టం చేశారు. అలాగే వైసీపీ ట్రాప్‌లో పడొద్దని జనసైనికుల్ని అప్రమత్తం చేశారు. పొత్తుల విషయంలో జనసైనికులు డైవర్ట్ కావొద్దని.. సోషల్ మీడియాతో పాటూ బయట జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే, జనసేన లక్షమని అందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేలా పొత్తులు ఉంటాయని మరోమారు విస్పష్టంగా చెప్పారు. నిజానికి గతంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలినవ్వం అని చెప్పారు. అందుకే వైఎస్సార్‌సీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా జనసేన పార్టీతో పాటు విపక్ష నేతల పేర్లతో తప్పుడు ప్రకటనలతో గందరగోళం మొదలైందని. ఇదంతా వైసీపీ పొలిటికల్ గేమ్ గా పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని.. తప్పుడు ప్రకటనలు, సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని జనసైనికులకు సూచించారని అంటున్నారు.
కాగా, పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వచ్చే ఎన్నికల్లో నిర్ణయాలు తీసుకుంటారని.. అందుకు తగ్గట్లే వ్యూహాలను రూపొందిస్తారని పార్టీ నాయకులు అంటున్నారు. పొత్తులపై ఆయా రాజకీయ వేదికలపై చర్చించి నిర్ణయం ఉంటుంది అంటున్నారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని వైఎస్సార్‌సీపీ సవాల్ చేస్తోంది. జనసే పార్టీ కూడా అదే రేంజ్‌లో వారికి కౌంటర్ ఇస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా వైఎస్సార్‌సీపీ ఏం జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నారో అది తనుకు తెలుసు అని వ్యాఖ్యానించారు. కానీ వారు వద్దనుకుంటున్నదే జరుగుతుందని, వైసీపీ వ్యతిరేక ఓటు వృథా కానివ్వనీ ఇవటీవల జరిగిన ఆవిర్భావ సభలో మరోసారి తేల్చి చెప్పారు.
రాష్ట్రం కోసం మంచి నిర్ణయం తీసుకుంటాననీ.. జనసైనికులు తనను నమ్మాలన్నారు. మచిలీపట్నం సభలోనే అన్ని అంశాలపై దాదాపు క్లారిటీ ఇచ్చారు. అయితే కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జనసేన పేరుతో ఓ ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేనల మధ్య పొత్తుపై రెచ్చగొట్టేలా నాయకులు చేయని వ్యాఖ్యలు చేసినట్లుగా బాగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు లేదని.. జనసేనకు ఇచ్చే సీట్లు ఇవేనంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు, నాగబాబు మధ్య వార్ నడుస్తోందని కొన్ని ఛానల్స్ పేరుతో హడావిడి చేస్తున్నారు. ఈ ప్రకటనలు నిజమని కొందరు జనసైనికులు భావిస్తున్నారు. దీంతో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని జనసేన పార్టీ స్పష్టం చేసింది