అమ్మాయిల మిస్టరీ సూసైడ్.. పోలీసులకు సవాలే! ఎందుకంటే..
posted on Feb 2, 2022 11:18AM
ఇద్దరు అమ్మాయిలు. పూజిత, కల్యాణి. వయసు 19. కడపలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వారి సూసైడ్ ఘటన ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఆ విషయం మాకు తెలీనే తెలీదు అంటున్నారు ఇంట్లో వాళ్లు. అదేంటి ఇంట్లో వాళ్లకి తెలీకుండా అంత క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఎలా ఏర్పడిందనేది ఓ క్వశ్చన్. అదిసరే.. ఇంతకీ వారెందుకు ఎందుకు సూసైడ్ చేసుకున్నారనేందుకు సరైన కారణలే కనిపించడం లేదు. ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మరి, కాలేజీలో? ఆత్మహత్యకు ముందు సరదాగా సెల్ఫీ దిగారు. అప్పటి వరకూ నవ్వుతూ, తుళ్లుతూనే ఉన్నారు. సడెన్‌గా పట్టపగలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకో అంతుచిక్కడం లేదు. వాళ్లది అసలు కడప జిల్లా కానేకాదు. అనంత జిల్లా. అయినా, ఇక్కడి వరకూ వచ్చి ఎందుకు సూసైడ్ చేసుకున్నట్టు? ఇదే సమయంలో అనంతపురంలో మరో ముగ్గురు అమ్మాయిలూ అదృశ్యమయ్యారు. అయితే, ఆ తర్వాత ఆ ముగ్గురి ఆచూకీ తెలిసింది. వీరిద్దరి ఆత్మహత్యకు.. ఆ ముగ్గురి మిస్సింగ్‌కు లింకుందా? ఇంతటి కన్ఫ్యూజన్ ఉంది కాబట్టే.. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.
కడప రైల్వేస్టేషన్ పరిధి భాకరాపేట సమీపంలో సోమవారం రైలు పట్టాలపై పడి పూజిత(19), కల్యాణి(19) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనేది మిస్టరీగా మారింది. చదువుల్లో రాణిస్తున్నారు. ప్రేమ వ్యవహారాలు లేవు. కడపకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరైనా వీరిని భయపెట్టారా?.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ కాల్‌డేటా వివరాలు తెలిస్తే ఆత్మహత్యల మిస్టరీ చిక్కుముడి వీడుతుందని పోలీసులు చెబుతున్నారు. సోమవారం అనంతపురంలో మరో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. ఆ ముగ్గురి ఆచూకీ తెలిసింది. వారితో వీరికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.
విద్యాదీవెనకు సంబంధించి పని ఉందని కల్యాణి తాడిపత్రి నుంచి సొంతూరైన యాడికి మండలం కమలపాడు సచివాలయానికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. పూజిత కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వచ్చింది. వీరిద్దరూ తాడిపత్రిలో సోమవారం ఉదయం 9.42 గంటలకు కర్ణాటక బస్సు ఎక్కి కడపలో దిగారు. కడప బస్టాండులో దిగిన తరువాత ఇరువురు సంతోషంగా సెల్ఫీ తీసుకున్నారు. తరువాత రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. 1.30 గంటలకు రైల్వేస్టేషన్‌లో సంచరించినట్లు సీసీ పుటేజీల ద్వారా తెలిసింది. రాజంపేట వైపు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ పని చేస్తున్న సిబ్బంది ఇటు రాకూడదని చెప్పడంతో అక్కడ నుంచి ఆటోలో ఎర్రముక్కపల్లె రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. పట్టాలపై నడుచుకుంటూ వస్తుండడం గూడ్స్ రైలు డ్రైవర్ చూసి వేగాన్ని తగ్గించడంతో వారు పట్టాలు దిగారు. తరువాత గూడ్స్ రైలు దగ్గరికి రాగానే ఇద్దరూ ఒక్కసారిగా రైలు పట్టాలపై పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కల్యాణి అక్కడికక్కడే మృతి చెందగా, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పూజిత మృతి చెందింది.
వీరిద్దరి మృతికి కారణాలు అంతుచిక్కడం లేదు. సొంతూరికి వెళ్లాల్సిన కల్యాణి కడపకు ఎందుకు వచ్చిందో తెలియదని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ‘పూజిత గత రెండు నెలల నుంచి ఒంటరితనానికి గురవుతుండేది. ఇంటి దగ్గర ఎలాంటి గొడవలు లేవు. కాలేజ్‌లో ఏవైనా సమస్యలు ఉన్నాయేమో తెలియదు. కల్యాణి, పూజిత స్నేహితులనే విషయం ఇప్పటి వరకు మాకు తెలియదు’ అని పూజిత సోదరుడు అంటున్నాడు. ‘ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియరాలేదు. తమ సిబ్బందిని తాడిపత్రికి పంపించి వీరు చదివే కళాశాలలో విచారణ చేయిస్తున్నాం. ఫోన్ కాల్‌డేటా వివరాలు సేకరిస్తున్నాం’ అని కడప రైల్వే ఎస్సై రారాజు చెబుతున్నారు. ఇంత మిస్టరీ ఉన్న ఈ కేసులు కడప పోలీసులు ఛేజిస్తారా? లేక, ఈ కేసు కూడా సీబీఐకి ఇవ్వాల్సి వస్తుందా?