చిన్నబోయిన చినజీయర్.. స్వామీ లేకుండానే యాదాద్రి ఆలయ ఉద్ఘాటన..
posted on Mar 28, 2022 12:08PM
పిలుస్తే వెళ్తాం. లేదంటే చూసి ఆనందిస్తాం. చినజీయర్‌స్వామి ఇంతకు ముందే చెప్పేశారు. అనుకున్నట్టే ఆయన పిలవలేదు. ఈయన వెళ్లలేదు. చిన్నజీయర్ లేకుండానే యాదాద్రి ఆలయ ఉద్ఘాటన వైభవంగా జరిగిపోయింది. టీవీల్లో చూసి భక్తులు మురిసిపోయారు. జీయర్‌స్వామి సైతం సాధారణ భక్తుడి మాదిరే టీవీలో చూసి తరించాల్సిన దుస్థితి వచ్చింది. గతాన్ని తలుచుకుని పాపం చినజీయర్ మనసులో బాధపడుతుండొచ్చు. ఆయన చినబోయి ఉండొచ్చు. కేసీఆర్ పగ అలాంటిది మరి.
పరిస్థితులు ఇంతకు ముందులా ఉండిఉంటే.. గత వారంరోజూలు తెలంగాణలో పండుగ, సందడి నెలకొనేది. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ నుంచి దేశవ్యాప్తంగా పలువురు ప్రభుత్వాధినేతలు, రాజకీయ ప్రముఖులు, స్వామీజీలు, సన్యాసులు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు.. అబ్బో న భూతో అన్నట్టు యాదాద్రి ఆలయ పునఃప్రారంభ వేడుకలు జరిగి ఉండేవి. కానీ, ఇలా జరగలేదు. ఆగమ శాస్త్రం ప్రకారం పద్దతిగా చేయాల్సిన యాగాలు, పూజలు మాత్రం చేస్తున్నారు. రాజకీయ ఆర్భాటం గానీ, స్వామీజీల కోలాహలం కానీ లేనేలేదు. ఏదో మమః అన్నట్టు ప్రక్రియ పూర్తి చేశారు. చివరి రోజు సీఎం కేసీఆర్ హాజరవడం ఒక్కటే కాస్త అటెన్షన్ తీసుకొచ్చింది.
అన్ని వందల, వేల కోట్లు ఖర్చు పెట్టి.. ఈ తరంలో పాలకులెవరూ చేయని, చేయలేని కార్యం చేసి చూపించి.. యాదాద్రిని మహాద్భుతంగా తీర్చి దిద్ది.. అంతా చేసి.. ఇంత సింపుల్‌గా ముగించేయడం భక్తులకే నిరాశగా ఉంది. సీఎం కేసీఆర్‌కు సైతం ఎంతగానో లోటు ఉండే ఉంటుంది. మరెందుకు ఇంతటి పంతం? పట్టుదల? చినజీయర్‌పై కక్ష గట్టి.. తన ప్రభుత్వం నిర్మించిన యాదాద్రి ప్రాభవాన్ని ఇలా తగ్గించడం ఆయనకేమైన సబబా? అంటున్నారు.
యాదాద్రి అంటే ఇన్నాళ్లూ అందరికీ గుర్తుకొచ్చేది రెండే రెండు పేర్లు. ఒకటి సీఎం కేసీఆర్. ఇంకోటి చినజీయర్ స్వామి. అసలు యాదగిరిగుట్టకు యాదాద్రి అని పేరు పెట్టిందే ఆ జీయర్ స్వామి. ఇక, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణానికి మొదటి నుంచీ సూచనలు, సలహాలు ఇచ్చింది చినజీయరే. డబ్బు ఖర్చు చేసింది ప్రభుత్వమే అయినా.. ఆలయాన్ని పునరుద్దరించాలని భావించింది కేసీఆరే అయినా.. అది ఎప్పుడు, ఎలా చేయాలనే దిశానిర్దేశ్యం అంతా జీయర్‌దే. స్వామి కనుసన్నల్లోనే యాదాద్రి ఇలా రూపు మార్చుకుంది. కర్త, క్రియ కేసీఆర్ అయితే.. కర్మ మాత్రం చినజీయర్ స్వామి అంటారు. అదే ఇప్పుడు ఆయనకు ఖర్మగా కూడా మారిందంటారు. యాదాద్రికి అంత చేసిన ఆ స్వామిజీ లేకుండానే.. ఇప్పుడు ఆలయ ఉద్ఘాటన జరిగిపోయింది. చినజీయర్‌ను పూర్తిగా పక్కనపెట్టేసి సీఎం కేసీఆర్ పంతం నెగ్గించుకున్నారు. స్వామికి వంగివంగి దండాలు పెట్టిన కేసీఆరే.. ఇప్పుడు ఆ స్వామి కాళ్లుపట్టి లాగేసే పని చేస్తున్నారనే విమర్శ ఉంది.
ప్రజాస్వామ్య దేశంలో ఒక స్వామీజీని టార్గెట్ చేసిన పాలకుడు బహుషా కేసీఆర్ ఒక్కరేనేమో. అందలం ఎక్కించిన ఆయనే.. ఇప్పుడు అథఃపాతాళానికి తొక్కేస్తున్నారు. రామానుజ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తన కేసీఆర్ ప్రాధాన్యత తగ్గించడం, శిలాఫలకం మీద ఆయన పేరు వేయకపోవడం, మోదీ, అమిత్‌షాలను తెగ పొగిడేయడం.. చినజీయర్‌పై ముఖ్యమంత్రి ఆగ్రహానికి కారణం. ఆ స్వామి బీజేపీ స్వామీగా మారిపోయారనే అక్కస్సుతోనే ఇంతగా కక్ష సాధిస్తున్నారని అంతా అంటున్నారు. చినజీయర్ సైతం తగ్గేదేలే అంటూ.. పిలుస్తే వెళ్తాం లేదంటే లేదు అంటూ కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనేలా మాట్లాడటంతో.. ఆయన లేకుండానే యాదాద్రి పునఃప్రారంభం జరిగిపోయింది. కేవలం ఒక స్వామీజీపై కోపంతో.. ఎంతో వైభవంగా, యావత్ దేశాన్ని ఆకర్షించే విధంగా సాగాల్సిన ఈ మహా క్రతువు చాలా సింపుల్‌గా అదేదో కేసీఆర్ ఇంటి కార్యక్రమంలా జరిగిపోయిందని అంటున్నారు. ఇంతా చేసి కేసీఆర్ ఏం సాధించినట్టు? స్వామీజీని సైడ్ చేసి ఏం లాభపడినట్టు?