మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్
posted on Nov 8, 2015 1:57PM

బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహాకూటమి ఘన విజయంతో జేడీయూ నాయకుడు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రి కానున్నారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని లాలూ ప్రసాద్ యాదవ్ మీద విజయం సాధించిన ఆయన ఇప్పుడు లాలూ ప్రసాద్‌తో పొత్తు పెట్టుకుని బీజేపీ మీద విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి జేడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీని ఓడించే ఉద్దేశంతోనే బద్ధ శత్రువులైన ఈ మూడు పార్టీలూ కలసి పోటీ చేసి విజయం సాధించాయి. నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రాన్ని దాదాపు పది సంవత్సరాల పాటు పాలించారు. 2000 సంవత్సరం మార్చి 3వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు కేవలం ఏడు రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా వుండి, రబ్రీదేవికి అధికారం ఇచ్చి తప్పుకున్నారు. అనంతరం 2005 నవంబర్ 24 నుంచి 2010 నవంబర్ 24 వరకు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2010 ఎన్నికలలో కూడా నితీష్ విజయం సాధించారు. 2010 నవంబర్ 26 నుంచి 2014 మే 17 వరకు ముఖ్యమంత్రిగా వున్నారు. అయితే 2014 ఎన్నికలలో బీజేపీ విజయం పట్ల నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని జితన్ రామ్ మాంఝీకి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు. అయితే మాంఝీ వ్యవహార శైలి కారణంగా ఆయన్ని దించేసి మళ్ళీ నితీష్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 2015లో కూడా ఆయన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు.