నిశిత్ ఫ్రెండ్ రవిచంద్రను మరిచిపోయారా..?
posted on May 11, 2017 12:23PM

మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నెల్లూరులోని నారాయణ కళాశాల నుంచి బోడిగాడితోటలోని శ్మశాన వాటిక వరకు నిశిత్ అంతిమయాత్ర చేపట్టారు. ఇకతి నిశిత్ భౌతిక కాయాన్ని చూడటానికి కూడా పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నారాయణ సంస్థల నుండి పలువురు ఉపాధ్యయులు విద్యార్ధులు ఇలా చాలామంది నెల్లూరుకు తరలివచ్చారు. అంతిమయాత్రలో లోకేశ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా నిశిత్ తో పాటు అతని స్నేహితుడు రవిచంద్ర కూడా నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. కానీ రవిచంద్ర గురించి మాత్రం ఎక్కడా ఎలాంటి వార్తలు రాకపోవడం గమనార్హం. రవిచంద్ర వివరాలు కానీ.. ఆయన కుటుంబ సభ్యుల వివరాలు కానీ పెద్దగా ఎక్కడా ఏ వార్తలు కనిపించడం లేదు. ఇక అతని అంత్యక్రియల విషయంలో కూడా సందిగ్ధత వీడలేదు. రవిచంద్ర అంత్యక్రియల ఎప్పుడు జరుగుతాయన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. నిన్ననే మృతదేహం టంగుటూరుకు చేరుకున్నప్పటికీ, రవిచంద్ర సోదరి, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న లేఖ రావడం ఆలస్యమైంది. లేఖ రాక కోసం వేచి చూస్తున్న ఆయన కుటుంబ సభ్యులు ఆమెకు కడసారి చూపును అందించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. లేఖ వచ్చిన తరువాతనే అంతిమ సంస్కారం జరుపుతామని కుటుంబసభ్యులు వెల్లడించారు. మొత్తానికి ఇద్దరూ ఒకేసారి చనిపోయినా.. నిశిత్ ఎంతైనా మంత్రి కుమారుడు కాబట్టి మీడియా కవరేజ్ బాగానే చేసింది. కానీ రవిచంద్రాని మాత్రం మరిచిపోయినట్టు ఉన్నారు.