ఏపీ రాజకీయాల్లో కొత్త డైమెన్షన్!

రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి.  అందుకే,   రాజకీయాలు నిశ్చలన చిత్రాలు కాదు, పాలిటిక్స్ ఈజ్ డైనమిక్  అనే నానుడి ఏర్పడింది. నిజం. ఎమ్మెల్సీ ఎన్నికల వరకు  ఏపీ రాజకీయాలు ఎటు  వెళుతున్నాయి, అనే విషయంలో చాలామందికి చాలా సందేహాలున్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి  వచ్చింది మొదలు, మీటల మీదనే దృష్టి పెట్టి పేద ప్రజల ఓట్లను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. అప్పులు చేసి మరీ ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామనే బిల్డప్  ఇచ్చారు. 

అయితే, మీటలు నొక్కి ప్రజల ఖాతాల్లో పైసలు వేసినా ప్రజలను ఆకట్టుకోలేక పోయారు. సంక్షేమ ప్రయోజనాలు పొందుతున్న వర్గాల ప్రజల్లోనూ సర్కార్ విధానాల పట్ల వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఓ వంక మీటలు నొక్కుతూ మరో వంక  పన్నుల మోత, చార్జీల వాతలతో ప్రజలపై మోయలేని భారం వేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వంతో ప్రజలు విసిగెత్తి పోయారు. ఇసుక పాలసీ, మద్యం పాలసీ వంటి తలాతోకా లేని విధానాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న జగన్ సర్కార్ పై  ప్రజలు మండిపడుతున్నారు. ఇదేమి పాలనా ఇదెక్కడి పాలన  ఒక చేత్తో ఇచ్చి  చెత్త పన్ను వంటి చెత్త ఆలోచనలతో రెండు చేతులా దోచుకుంటున్న జగన్ రెడ్డికి  రెండో ఛాన్స్ ఇచ్చేది లేదనే నిర్ణయాని కొచ్చారు.

అయితే. ఇంతవరకు అందుకు ఒక స్పష్టమైన రుజువు, ఆధారం దొరకలేదు. కానీ  ఇప్పడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం పట్ల  ముఖ్యంగా  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అహంకార పోకడల పట్ల ప్రజాగ్రహం స్పష్టమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం సారథ్యంలోనే వైసీపీ వ్యతిరేక కూటమి ఏర్పడుతుందనే స్పష్టత వచ్చందని అంటున్నారు. ఎమ్యెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఏకైక ప్రత్యాన్మయంగా టీడీపీ ఏమర్జ్  అయిన నేపథ్యంలో, పొత్తుల విషయంలో కూడా క్లారిటీ వస్తోందని పరిశీలకులు అంటున్నారు. నిజానికి  రాష్ట్రంలో రాజకీయ పొత్తులకు సంబంధించి చాలా కాలంగా చాలా చాలా చర్చలు,  వ్యూహాగానాలు సాగుతున్నా ఇంతవరకు ఒక స్పష్టత అయితే రాలేదు. ఈ నేపథ్యంలో  మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు పితాని సత్యనారాయణ కొత్త చర్చకు తెర తీశారు.

పొత్తులపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం జరగలేదని చర్చలు మాత్రమే జరుగుతున్నాయన్నారు. ఏదైనా పార్టీ తమతో కలుస్తానంటేనే పొత్తులపై అధిష్ఠాన నిర్ణయం తీసుకుంటుందన్నారు.అంతే కాదు  నిజం అయినా కాకున్నా ఇంతవరకు జనసేన, బీజేపీ కూటమితో  పొత్తుకు టీడీపీ తహతహా లాడుతోందనే ప్రచారం జరిగింది. అయితే  పితాని  బీజేపీ పార్టీ పొత్తుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని, వైసీపీ తో విడిపోతేనే ఆ పార్టీతో పొత్తు గురించి ఆలోచిస్తామని  బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టారు.
 అదే సమయంలో పితాని  టీడీపీ క్యాడర్ కు కూడా హిత బోధ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో సంబరాలు చేసుకుంటే సరిపోదు కష్టపడితేనే గెలుపు సాధ్యం అవుతుందన్నారు.

ఆత్మ విమర్శ చేసుకుని చేసిన తప్పులు, సవరించుకుంటేనే విజయం వరిస్తుందని పితాని పేర్కొన్నారు. ప్రత్యేకించి తాడేపల్లిగూడెంలో టీడీపీ ఇంచార్జ్ వలవల బాబ్జీ గెలుపు కోసం క్యాడర్ ఇప్పటినుంచే కష్ట పడాలని సూచించారు. అధికార పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. జగన్ మరలా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. జగన్ కు ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ అయ్యిందన్నారు. ఏమైనా  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఏపీ రాజకీయాల్లో కొత్త డైమెన్షన్  తీసుకొచ్చాయి. ఇది మాత్రం నిజం.