స్వాట్ తో తెలంగాణ సర్కార్ కు ప్రశంసలు
posted on Jun 4, 2025 2:58PM

స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. సింపుల్‌గా స్వాట్. ప్రజాక్షేత్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. వీళ్లు రంగంలోకి దిగితే మొత్తం సీనే మారిపోతుంది. హైదరాబాద్ పోలీసులు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే.. మహిళా పోలీసులతో ఓ కొత్త ఫోర్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. ప్రధానంగా మహిళలు నిరసనలు, ఆందోళనలు చేసినప్పుడు వారిని సురక్షితంగా తరలించేందుకు తయారుచేస్తున్నారు. సాధారణంగా పురుష పోలీసులు మహిళా నిరనసకారులను నియంత్రించే విషయంలో కొన్నిసార్లు వివాదాలు తలెత్తుతున్నాయ్. అందువల్ల.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ కొత్త టీమ్‌ని రెడీ చేస్తున్నారు.
ఈ కొత్త ఫోర్స్‌లోని మహిళా పోలీసులకు.. సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. నిరనసలు, ఆందోళనల సమయంలో.. వారికేదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వీరికి ఇచ్చే స్పెషల్ ట్రైనింగ్ ద్వారా.. క్లిష్ట పరిస్థితుల్లో గుంపులను నియంత్రించడంలో సహాయపడతారు. నిరసనలు, ఆందోళనల సమయంలో.. మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంలో.. వారిని తరలించడంలో చట్టబద్ధమైన, సున్నితమైన విధానాలను అనుసరించడమే ఈ టీమ్ లక్ష్యం. ధర్నా సమయాల్లో మహిళలకు, మహిళా వీఐపీలకు రక్షణ ఇచ్చే విషయంలో.. ఈ మహిళా పోలీసులు ప్రత్యేక శిక్షణ పొందారు. ట్రైనింగ్‌లో వాళ్లు నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ కిట్స్‌ని కూడా ప్రదర్శించారు.
మొదటి దశలో 35 మంది మహిళా పోలీసులతో.. ఈ యాక్షన్ టీమ్‌ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు సీపీ సీవీ ఆనంద్. దీనిని భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. ఆందోళనల సమయంలో మహిళలను ప్రొటెక్ట్ చేయడం, వారిని సేఫ్‌గా తరలించడం కోసం ఈ టీమ్ పనిచేస్తుంది. మొత్తంగా రెండు ప్లాటూన్ టీమ్‌లను సిద్ధం చేస్తామని.. సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ పోలీసులు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. ఇప్పటికే ఉన్న షీ టీమ్స్, విమెన్ సేఫ్టీ వింగ్ లాంటి మహిళా భద్రత కార్యక్రమాలకు మరింత మద్దతుగా నిలవనుంది. ఇది.. మహిళల భద్రత పట్ల హైదరాబాద్ పోలీసులకు ఉన్న కమిట్‌మెంట్‌ని తెలియజేస్తోంది. ఈ కొత్త విమెన్ ఫోర్స్.. మహిళల భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు.. ఇచ్చే ప్రాధాన్యత అందర్నీ ఆకట్టుకుంటుంది.