మహిళలంటే అంత చులకనా.. చిరుపై నెటిజన్ల ఫైర్
posted on Feb 12, 2025 1:21PM

ఓ సినీ ఫంక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి యధాలాపంగా చేసిన సరదా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సాధారణంగా చిరంజీవి వివాదాలుకు దూరంగా ఉంటారు. ఆయన ప్రసంగాలు కూడా ఆచి తూచినట్లు ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా పద్ధతిగా మాట్లాడతారు. అటువంటి చిరంజీవి బ్రహ్మా ఆనందం సినీమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలపై మహిళా సంఘాల నుంచి తీవ్ర ఆక్షేపణ వ్యక్తం అవుతోంది.
మెగా లెగసీ కంటిన్యూ అవ్వడానికి తన కుమారుడు రామ్ చరణ్ ఒక మగపిల్లవాడికి తండ్రి అయితే బాగుంటుంది అని చిరంజీవి అన్నారు. ఈ ఫంక్షన్ లో ఆయన తన మనవరాళ్లందరితో తన ఇళ్లు ఒక లేడీస్ హాస్టల్ లా, తాను ఆ హాస్టల్ వార్డెన్ గా మారిపోయామని వ్యాఖ్యానించారు. ఒక చరణ్ కైనా మగపిల్లవాడు పుడతాడనుకుంటే ఆడపిల్లే పుట్టిందని, దీంతో ఈసారైనా రామ్ చరణ్ తనకి ఒక మనవడిని ఇస్తాడని ఆశిస్తున్నానన్నారు. మెగా వారసత్వాన్ని కొనసాగించాలని ఉందన్నారు. అక్కడితో ఆగకుండా చరణ్ కు మళ్లీ అమ్మాయే పుడుతుందేమోనన్న భయం వేస్తోందని చిరంజీవి అన్నారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలే వివాదాస్పదంగా మారాయి.
నెటిజనులు ఓ రేంజ్ లో చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. మహిళా సంఘాలు కూడా చిరు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి మహిళలంటే అంత చులకనా అని నిలదీస్తున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మెగాస్టార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. మెగాస్టార్ మహిళలాలను చాలా తక్కువ చేసి మాట్లాడారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన మాటల ద్వారా సమజాజంలో ఆడపిల్లలు వద్దు అన్న సందేశాన్ని ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారు.