నేతాజీ కుటుంబ సభ్యుల మీద నెహ్రు ప్రభుత్వం గూడఛర్యమా?

 

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆరున్నర దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ ఇంతవరకు దేశాన్ని ఏలిన ప్రభుత్వాలేవీ స్వాత్రంత్ర సమర యోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణంపై మిష్టరీని చేధించి, ఆయన గురించి ప్రజలకు తెలియజేయలేకపోయాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దపడిన ఆ మహనీయుడిని ప్రభుత్వాలు విస్మరించినా యావత్ దేశప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకే దేశంలో ఏ మూలకు వెళ్ళినా ఎక్కడో అక్కడ ఆయన విగ్రహాలు, ఆయన పేరు పెట్టుకొన్న వ్యక్తులు కనబడుతుంటారు. ఆయన పట్ల దేశ ప్రజలకున్నపాటి గౌరవ మర్యాదలు దేశాన్ని ఏలిన ప్రభుత్వాలకి లేకపోవడం చాలా శోచనీయమయిన విషయమే.

 

ఆ మహనీయుడి గొప్పదనాన్ని గుర్తించడానికి కూడా ఇష్టపడని ప్రభుత్వాలు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయన కుటుంబ సభ్యులపై నిఘా పెట్టాయనే వార్తలు గుప్పుమన్నాయి. ఒకటీ రెండు కాదు ఏకంగా ఇరవై ఏళ్ళపాటు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అన్న శరత్‌చంద్రబోస్ కుమారులు శిశిర్ కుమార్ బోస్, అమీయ నాథ్ బోస్‌లపై భారత ప్రభుత్వం నిఘా పెట్టింది. కోల్‌కతాలో వారు నివసించే ఎల్గిన్ రోడ్‌లోని 38/2 ఉడ్‌బర్న్ పార్క్ ఇళ్లపై భారత ఇంటలిజన్స్ వర్గాలు నిరంతరగా నిఘా పెట్టి వారి ప్రతీ కదలికలను, వారికి వచ్చే ఉత్తరాలను, ఫోన్లను, చివరికి వారు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా వెన్నంటి వెళ్లి నిఘా పెట్టింది. ఇదంతా నెహ్రూ హయంలోనే జరిగింది.

 

ఈ విషయం బయటకు ఎలా పొక్కింది అంటే, నేతాజీకి సంబంధించిన కొన్ని కీలక రహస్య పత్రాలు పశ్చిమబెంగాల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ప్రధాన కార్యాలయంలో ఇంతకాలంగా ‘అత్యంత రహస్య పత్రాల విభాగంలో’ ఉండిపోయాయి. కానీ కేంద్ర హోం శాఖ వాటిని ఆ విభాగం నుండి తొలగించటంతో అవన్నీ ఢిల్లీలోని జాతీయ ప్రాచీన దస్తావేజుల భాండాగారం (నేషనల్ ఆర్కైవ్స్)కు చేరాయి. నేతాజీ కుటుంబ సభ్యుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యంపీ సుగతా బోస్ వాటిని సేకరించినప్పుడు నెహ్రూ హయంలో జరిగిన ఈ ఘోర అకృత్యం బయటకు పొక్కింది. స్వాతంత్రం కోసం పోరాడిన సమారా యోధులను ప్రభుత్వాలు గౌరవించకపోయినా ప్రజలు బాధపడలేదు. కానీ వారిని ఈవిధంగా అవమానించడం ఎవరూ జీర్ణించుకోలేరు.