భారతీయులు దేశం వదిలేస్తున్నారు

చదువు కోసమో, ఉపాధి వ్యాపారాల కోసమో విదేశాలకు వెళ్ళే భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. అమెరికా, యూకే, బ్రిటన్, జర్మనీ ఇలా ఈ దేశం ఆ దేశం అని కాదు, ప్రపంచ పటంలో ఉన్న ఏ దేశం వెళ్లినా భారతీయులు కనిపిస్తారు. ప్రపంచంలో భారతీయులు లేని దేశం లేదంటే  అతిశయోక్తి కాదు. నిజానికి, ఇప్పుడు ప్రతి భారతీయ కుటుంబంలో కనీసం ఒక్కరి వంతున విదేశాల్లో స్థిరపడుతున్నారు.

అమెరికా వంటి కొన్ని దేశాల్లో అయితే రెండు మూడు తరాలుగా అక్కడే స్థిరపడి చుట్టం చూపుగా ఎప్పుడో ఒకసారి స్వదేశానికి వచ్చి వెళుతున్న కుటుంబాలు కోకొల్లలు. నిజమే, ఇప్పుడు కాదు, చాలా కాలంగా, స్వాతంత్రానికి ముందు నుంచి కూడా  విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం భారతీయులు విదేశాలకు వెళుతున్నారు. ఆ సంఖ్య క్రమక్రమగా పెరుగుతోంది. అయితే, గతంలో వెళ్ళిన వారు,వెళ్ళిన పని పూర్తి చేసుకుని వెనక్కి వచ్చి స్వదేశంలో స్థిరపడేందుకు ఇష్ట పడే వారు. జాతిపిత మహత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, ఇంకా ఎందరో స్వాతంత్ర సమరయోధులు విదేశాలలో చదువుకుని, వెనక్కి వచ్చి స్వాతంత్ర పోరటంలో పాల్గొన్నారు.

 అయితే, ఇప్పడు ట్రెండ్ మారింది. ఏటి కేడాది విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య పెరిగి పోతోంది. మరో వంక అలా వెళ్ళిన వారిలో ఎక్కువగా  విదేశాల్లో   స్థిరపడుతున్నారు. అక్కడే ఆస్తులు ఏర్పరచు కుంటున్నారు.అంతే కాదు, భారత పౌరసత్వాన్ని వదులుకుని, ఆయా దేశాల పౌరసత్వాన్ని స్వీకరించేందుకు మొగ్గు చుపుతున్నారు. ఈ నేపధ్యంలో గత కొన్నేళ్లుగా భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.

2019లో 1,44,017 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు, కాగా, 2020లో బహుశా కొవిడ్ కారణంగా కావచ్చును, 85,256 కు తగ్గింది. 2021లో అయితే ఏకంగా 1,63,370 మంది మన దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభలో వెల్లడించారు. అన్ని దేశాలలో ఇదే పరిస్థతి ఉన్నా, ఇప్పటికీ భారతీయుల ఫస్ట్ డెస్టినేషన్ అగ్రరాజ్యం అమెరికానే.  గత మూడేళ్లలో భారత పౌరసత్వాన్ని త్యజించిన వారిలో ఎక్కువ మంది అమెరికా పౌరసత్వాన్ని పొందారని గణాంకాలను బట్టి తెలుస్తోంది.

 అమెరికాలో నివసిస్తోన్న భారతీయుల్లో 2019 లో 61 వేల మందికిపైగా మన దేశ పౌరసత్వాన్ని వదులుకోగా.. 2020లో 30 వేల మందికిపైగా, 2021లో 78,284 మంది భారత పౌరసత్వాన్ని త్యజించారు. అంటే గత ఏడాది భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారిలో దాదాపు 48 శాతం మంది అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా వుంది. గత ఏడాది 23,533 మంది భారతీయులు ఆస్ట్రేలియా పౌరసత్వం పొందారు. 2019లో 21,340 మంది, 2020లో 13,158 చొప్పున భారతీయులు ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని పొందారు.కెనడా పౌరసత్వం పొందడం కోసం కూడా భారతీయులు ఎక్కువగానే ఆసక్తి చూపుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో యునైటెడ్ కింగ్‌డమ్ ఉంది. 2019లో 14,309 మంది భారతీయులు యూకే పౌరసత్వాన్ని పొందగా.. ఆ తర్వాతి రెండేళ్లలో వరుసగా 6489, 14637 మంది చొప్పున యూకే సిటిజన్‌ షిప్ పొందారు. యూకే, ఇటలీ, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. గత ఏడాది 41 మంది భారతీయులు పాకిస్థాన్ పౌరసత్వం తీసుకోవడం గమనార్హం. అంతకు ముందు ఏడాది కూడా ఏడుగురు భారతీయులు పాకిస్థాన్ పౌరసత్వం పొందారు. కాగా, 2015 నుంచి చూస్తే.. 2021 సెపెంబర్ వరకు 8,81,254 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని త్యజించారని కేంద్ర హోం శాఖ 2021 డిసెంబర్లో పార్లమెంట్‌లో వెల్లడించింది..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu