క్రికెట్ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు
posted on Jul 20, 2022 1:53PM
సాగినంతకాలం తానే రాజనుకుంటాడు.. సాగకపోతే ఊరక చతికిల పడతాడు..ఇదెక్కడో విన్నమాటలా ఉంది గదా.. పోనీ భగవద్గీతలోదే అనుకుందాం.. కింగ్ కోహ్లీకి ఇపుడు భగవద్గీత వినడం అవసరమని అతని వీరాభిమానులు అంటున్నారు. కానీ గవాస్కర్ వంటి సీనియర్లు అలా అనడం లేదు. ఒక్క ఇరవై నిమిషాలు సమయం ఇస్తే.. కోహ్లీకి మళ్లీ సెంచరీ కొట్టే సత్తాకి మార్గం బోధిస్తానన్నాడు.
కోహ్లీ.. క్రికెట్‌లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తర్వాత క్రికెట్ అభిమానుల హృదయాల్లో నిలిచిన సూపర్ డూపర్ స్టార్. మామూలుగానే సచిన్‌తో ప్రతీ క్రికెట్ స్టార్‌నీ పోల్చడం దేశంలో ఆనవాయితీ. కానీ ఆట తీరులో కాస్తంతయినా వ్యత్యాసం ఉంటుందన్నది గ్రహించాలి. కానీ కోహ్లీ క్రీజులోకి రాగానే ప్రేక్షకు డికి మరో సచిన్ వచ్చేడనే భావన బలంగా నాటుకుపోయింది. అందువల్ల కోహ్లీ తనకు తాను ఏమను కుంటాడనేది వేరే సంగతి ప్రేక్షకులు, క్రికెట్ పిచ్చాళ్ల దృష్టిలో అతను సచిన్ లానే పరుగుల వరద సృష్టించాల్సిందే. అది రూలు .. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్!!
కానీ, కాలక్రమంలో అనేక సీరీస్‌లు ఆడిన తర్వాత బ్యాటింగ్ పదును కాస్తంత తగ్గుతుందన్నది గవాస్కర్ కాలం నుంచి ఉన్నది, గమనిస్తున్నదీను. దానికి గవాస్కర్ వంటివరూ అంగీకరిస్తున్నారు. ఫామ్ దెబ్బతిన గానే హఠాత్తుగా సూపర్ స్టార్, గాడ్.. అనే పీఠాన్నుంచి అమాంతం తోసేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ క్రికెట్ వీరాభిమానులకు అదేం పట్టదు. పరుగుల వరద సృష్టించలేనపుడు గవాస్కర్ అయినా, సచిన్ అయినా.. ఇపుడు కోహ్లీ అయినా ఒక్కటే. తప్పదు వారి భావోద్వేగం అలాంటిది మరి.
కోహ్లీ 2019 నవంబర్ నుంచి ఒక్క అంతర్జాతీయ సెంచరీ చేయలేదు. దానిక్కారణం అతను ఆఫ్‌స్టంప్ లైన్ తో ఇబ్బంది పడుతున్నాడని స్ఫురద్రూపి అయిన గవాస్కర్ ఇట్టే పట్టేశాడు. ఎంతయినా బ్యాటర్ సంగతి మరో బ్యాటర్‌కే తెలుస్తుంది. గవాస్కర్ అంతర్జాతీయ అనుభవంతో పాటు అతి ప్రమాదకర బౌలర్ల ను ఎదుర్కొన్న ధీరుడుగా పేరు గడించిన పొట్టివాడు, గట్టివాడు! కోహ్లీ సెంచరీ కాదు అర్ధ సెంచరీ దాట డానికి నానా యిబ్బందీ పడుతున్నాడని అనేకానేక వంకర కామెంట్లు అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ప్లేయర్ అన్నవాడికి ఎపుడో ఒకప్పుడు ఇలాంటి లీన్ పాచ్ రావడం చాలా సహజం. దీనికి కోహ్లీ మరీ గుమ్మడి లా బాధపడిపోనక్కర్లేదు. కాస్తంత విశ్రాంతి తీసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ లా విజృంభించే అవకాశాలూ లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కోహ్లీ వైపు మొగ్గుచూపి, అతగాడిది మరీ దిగులుపడి పోయేంత పరిస్థితేమీ కాదన్నాడు. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అధిగమించడానికి తాను మందు వేస్తానని అన్నాడు. కామెంట్ల కంటే అతని ఆటతీరులో వచ్చిన చిన్నపాటి లోపాల్ని సరిది ద్దుకునేందుకు వీలు కల్పించే మార్గాల్ని తోటి ప్లేయర్లు, సీనియర్లు కల్పించాలని గవాస్కర్ భావం కావచ్చు. సాధారణంగా బొంబాయి వాళ్లనే నెత్తినెక్కించుకునే గవాస్కర్‌కు హఠాత్తుగా కోహ్లీ మీద అపార ప్రేమ, అభిమానం పొంగ డానికి కారణం బొంబాయి కుర్రాడు శర్మ ఫామ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.
క్రికెట్ రాజకీయాలు బయట రాజకీయాలకు ఆట్టే తేడా లేదు. కాబోతే బిసిసిఐ మేధావుల రాజకీయాల ప్రభావం తర్వాతనే వెలుగులోకి వస్తుంది. అప్పటికి జరగాల్సిన అన్యాయం ప్లేయర్లకు జరుగుతుంది. ఇది పాతికేళ్లుగా సాగుతున్నదే. గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి వారికీ బొంబాయి మేధావుల రాజకీయ సెగ తగిలింది. ఎవరు అద్భుతంగా రాణిస్తున్నా, ఎవరు సచిన్‌ను, శర్మనో మించిపోతున్నా వెంటనే బొంబాయికి చెందిన కామెంటేటర్లు, మాజీ ప్లేయర్లు తమ గూగ్లీలతో దాడి చేయడం చాలా సహజం. వారికి బొంబాయి, శివాజీ పార్కు ప్లేయర్ల కంటే లోకంలో మరే ప్లేయరూ అసలు ప్లేయరే కాదు.
ధోనీ విజృంభిస్తు న్న సమయంలో ఈ గవాస్కర్లంతా నోరు మూసుకోవాల్సి వచ్చింది. ధోనీ ఆటలో స్పీడు, ఆలోచనల అమలు, విజయాలను బేరీజు వేసుకుంటే ఏ బొంబాయి ప్లేయరూ అతని ముందు దిగతుడుపే కావడంతో ఎవ్వరూ అతన్ని కాదనలేకపోయారు. ధోనీ అంటే విజయం అనే ప్రశంసలతో అతని హవా సాగనిచ్చేరు. ఇపుడు కోహ్లీ మీద అంత తొందరగా ఏమీ అనలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే కేవలం ఆటలో చిన్నపాటి పొరపాట్లను సద్దితే సరిపోతుంది, అది నా వల్లే అవుతుందని గవాస్కర్ తన వద్దకు పిలిచాడు. మరి వెళ్లాలా, వద్దా అన్నది కోహ్లీ ఆలోచించుకోవాలి.