జగన్ హస్తిన పర్యటన అందుకేనా?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటనకు సమాయత్తమౌతున్నారు.  కేంద్రంలోని పెద్ద‌ల‌తో ఆయ‌న భేటీ అవ్వాలని భావిస్తున్నారు. నేడో, రేపో ఆయన హస్తినయానం ఉంటుందని తాడేపల్లి ప్యాలెస్ వర్గాల సమాచారం. ఈ పర్యటనలో ఆయన బీజేపీ పెద్దలతో కూడా భేటీ అవుతారని చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీల నేతలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందంటున్నారు. మధ్యం కుంభకోణం కేసు దర్యాప్తు జోరందుకుని తాడేపల్లి లింకులను బయటపెట్టే దిశగా సాగుతుండటంతో ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే హస్తిన పెద్దల మద్దతు అవసరమని జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే హఠాత్తుగా హస్తిన పర్యటన పెట్టుకుని అక్కడ వారి మద్దతు కూడగట్టాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.   ఔను ప్రస్తుతం మద్యం కుంభకోణం విచారణ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులను సిట్ అరెస్టు చేసింది.  వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తరువాత వైసీపీలో గాభరా కనిపిస్తోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుంటుందన్న ఆందోళనా ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది. ఈ కేసులో జగన్ అరెస్టు ఖాయమన్న ప్రజారం కూడా జోరుగా సాగుతోంది. జగన్ కూడా తన అరెస్టు అనివార్యమన్న నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన సందర్భం, సమయంతో సంబంధం లేకుండా తానేమీ పారిపోవడం లేదనీ, దమ్ముంటే అరెస్టు చేసుకోవచ్చనీ సవాళ్లు విసురుతున్నారు. ఇక మరో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అయితే వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ జగన్ అరెస్టు అవుతారన్న సంకేతాలు ఇచ్చారు.  అరెస్టు ఎటూ ఖాయమైనప్పుడు పొలిటికల్ మైలేజ్ వచ్చేలా దానిని మలచుకోవాలన్న వ్యూహంతోనే జగన్ ఇప్పుడు హస్తిన పర్యటన పెట్టుకున్నారని చెబుతున్నారు.  ఇక అరెస్టు అయినా రాజకీయంగా తనకు, పార్టీకీ లబ్ధి చేకూరేలా ఏం చేయాలన్న విషయంలో జగన్, వైసీపీ నేతలూ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.  ఈ నేపథ్యంలోనే హస్తినలో కేంద్ర పెద్దలు, బీజేపీ, కాంగ్రెస్ కూటమి పార్టీల నేతలను కలిసి తనకు వ్యతిరేకంగా ఏపీలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని చెప్పుకుని మద్దతు కూడగట్టే వ్యూహాన్ని జగన్ ఖారారు చేసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  
జగన్ హస్తిన పర్యటన అందుకేనా? Publish Date: Jul 28, 2025 4:32AM

తొడగొట్టి.. మీసం మెలేసీ.. పరారీ

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ విచారణకు డుమ్మా కొట్టారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఆయన విచారణకు హాజరు కాలేదు. నోటీసుల మేరకు ఆయన నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో శనివారం (జులై 26) ఉదయం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇదే కేసులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే విచారించారు. అంతే కాదు ఇదే కేసులో   వైసీపీ నాయకులు అనురూప రెడ్డి, హరిప్రసాద్, పచ్చిపాల రాధాకృష్ణ కూడా పోలీసుల విచారణకు హాజరయ్యారు.    నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏ2గా కేసు నమోదైన సంగతి తెలిసిందే.  అయితే ఈ కేసులో ఏ1గా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు విచారించారు కానీ అరెస్టు చేయలేదు. విచారణ తరువాత కూడా ప్రసన్నకుమార్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ మీడియా ముందు చెప్పారు. ఏ1నే విచారించి వదిలేశారు కనుక.. అనిల్ కుమార్ యాదవ్ ను విచారణకు  పిలిచి అరెస్టు చేసే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. మరి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు డుమ్మా ఎందుకు కొట్టినట్లు. అంతే కాదు పోలీసులకే కాదు, ఎవరికీ అందు బాటులో లేకుండా అజ్ణాతంలోకి ఎందుకు వెళ్లిపోయారు?   అసలెందుకు అంతగా భయపడుతున్నారు?  అక్రమమైనింగ్ కేసులో తనను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారన్న భయంతోనే అనీల్ కుమార్ యాదవ్ అజ్ణాతంలోకి వెళ్లిపోయారా? ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో మరో మాజీ మంత్రి కాకాణి అరెస్టయ్యారు. అంతే కాదు.. అనిల్ కుమార్ యాదవ్ సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ శ్రీకాంత్ రెడ్డి పోలీసు విచారణలో అనిల్ కుమార్ యాదవ్ పేరు బయటపెట్టారు. శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా అనిల్ కుమార్ యాదవ్ ను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయంటున్నారు.  దీంతో ఆయన ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు భయం లేకున్నా విచారణకు డుమ్మా కొట్టి అజ్ణాతంలోకి వెళ్లిపోయారని పరిశీలకులు అంటున్నారు.   జగన్ హయాంలోముందు వెనుకలు ఆలోచించకుండా ఇష్టారీతిన మాట్లాడి, తొడకొట్టి, మీసం మెలేసి మరీ సవాళ్లు చేసిన అనిల్ కుమార్ యాదవ్.. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ప్రత్యర్థులను దూషించడమే రాజకీయం అన్నట్లుగా వ్యవహరించారు. అయితే వైసీపీ పరాజయం తరువాత నోరెత్తి మాట్లాడటానికే భయపడుతున్నట్లుగా వ్యవహరించారు.  జగన్ హయాంలో ఇదే అనిల్ కుమార్ యాదవ్ స్థాయి, సభ్యత కూడా మరిచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు.  అంతేనా నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీకి కూడా యథేచ్ఛగా పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అనీల్ కుమార్ యాదవ్ అక్రమాలపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేసిందంటే ఆయన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉండేవో అర్దం చేసుకోవచ్చు. ఇప్పుడు అవే అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీ కేసులలో అరెస్టు భయంతో మరోసారి అజ్ణాతంలోకి వెళ్లిపోయారు అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు పరిశీలకులు. 
తొడగొట్టి.. మీసం మెలేసీ.. పరారీ Publish Date: Jul 28, 2025 3:46AM

అడివిలో తప్పిపోయిన విద్యార్థులు.. కాపాడిన పోలీసులు

  ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం మహితాపురం గ్రామ పరిధిలోగల మహితాపురం వాటర్ ఫాల్స్ సందర్శనకు విచ్చేసిన హైదరాబాద్ వాస్తవ్యులైన ఏడుగురు NIT విద్యార్థులు (4గురు అబ్బాయిలు,  3గురు అమ్మాయిలు) దారితప్పి అడివిలో దారితప్పి గల్లంతవగా సమాచారం అందుకున్న వెంకటాపురం సిఐ కుమార్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతి, మరియు వారి సిబ్బంది వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులను సమన్వయం చేసుకొని  తప్పిపోయిన ఏడుగురు విద్యార్థులను ఫారెస్టు సిబ్బందితో కలిసి రెస్క్యూ చేసి వారిని కాపాడారు.. ములుగు జిల్లా అధికార యంత్రాంగం భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలోని వాటర్ ఫాల్స్ సందర్శనను నిషేధించిన నేపథ్యంలో ఎవరికి చెప్పకుండా, ఎవరి అనుమతి లేకుండా నిబంధనలు మీరే వచ్చినటువంటి విద్యార్థుల ను పోలీసులు మందలించి, కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ల బంధువులకు అప్పగించారు. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా వాటర్ ఫాల్స్ సందర్శనకు రాకూడదని అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నిబంధన ఉల్లంఘించిన యెడల వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేశారు.
అడివిలో తప్పిపోయిన విద్యార్థులు.. కాపాడిన పోలీసులు Publish Date: Jul 27, 2025 6:55PM

బాలయ్యకు సాధ్యమైంది..పవనయ్యకు ఎందుకు కాదు?

  బాలకృష్ణ కూడా సినీ పొలిటీషియనే. ఆయనా హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. ఇటు రాజకీయాల్లో ఉంటూనే అటు వరుస సినిమాలు చేస్తున్నారు. బాలకృష్ణ లాస్ట్ హిట్ మూవీస్ ఏంటో చూస్తే.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్. అఖండ 2 ఫీవర్ లో ఉన్నారాయన అభిమానులు. తర్వాత కూడా మరో చిత్రానికి సంబంధించి కథా చర్చలు నడుస్తున్నాయి. హెక్ టిక్ బిజీ షెడ్యూల్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలేంటని చూస్తే నాలుగు సినిమాలు- నాలుగు వరుస సెంచురీలు. అఖండ నుంచి డాకూ వరకూ వంద కోట్లు క్రాస్ చేసిన సినిమాలే. ఇంత పక్కా ప్లానింగ్ ఎలా సాధ్యం? అని చూస్తే బాలకృష్ణ ఇటు సినిమాలు, అటు రాజకీయాలను ఇంత వయసులోనూ సమన్వయం చేసుకోవడంలో ఆరితేరిపోయారనే చెప్పాలి. అదే పవన్ అలాక్కాదు.. పుష్కరకాలంగా రెండు పడవలపై కాళ్లు. వాటిలో రాజకీయాల్లో పడుతూ లేస్తూ ఎలాగోలా నేడు ఆయన తొలిసారి గెలవడం మాత్రమే కాకుండా డిప్యూటీ సీఎం, ఆపై నాలుగు మంత్రిత్వాలు నెరుపుతున్నారు. కాదనడం లేదు. టైం లేదు. బిజీ బీజీ. ఉదయాన్నే ఎక్కిన హెలికాప్టర్ రాత్రి దిగే హెలికాప్టర్ మధ్య విమానయానం.. నానా రకాల హంగామా. ఈ బిజీ పొలిటికల్ షెడ్యూల్లో ఆయన సినిమాలకు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. అదే బాలయ్య అలాక్కాదు. మొన్న మహానాడును కూడా వదులుకుని అఖండ 2 షూట్ కోసం ఫారిన్ టూర్ వెళ్లారు. అంటే కొంత రాజకీయ త్యాగం చేస్తున్నారన్నమాట. మాములుగా అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలోని కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత కడపలో పెట్టిన మహానాడు. ఆ కిక్కే వేరుగా ఉంటుంది. దాన్ని ఆస్వాదించాలని ఎవరికైనా ఉంటుంది. కానీ బాలయ్య బాబు అలాక్కాదు. ఆయన దేనికి ఎప్పుడు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వాలో ఇవ్వడం బాగా తెలుసని అంటారు ఆయన అభిమానులు. ఇదిలా ఉంటే పవన్, బాలయ్య లా ఒక పార్టీ ఎమ్మెల్యే మాత్రమే కాదు. జనసేనకు అన్నీ తానే. ఈ విషయంలో పవన్ కి ఉన్న వర్క్ లోడ్, బాలకృష్ణకు ఉండకపోవచ్చు. అయితే అందుకంటూ కూడా కొంత ప్లానింగ్ అవసరమే. రాజకీయాల్లో ఉంటూ కూడా ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ వంటి హిట్స్ ఇచ్చారు. ఇక బాలకృష్ణ సింహ నుంచి ఊపందుకున్న సెకండ్ ఇన్నింగ్స్ తర్వాతి కాలంలో తన స్థాయికి తగ్గట్టు హిట్లు నమోదు చేస్తూనే వస్తున్నారు. అదే పవన్ విషయంలో ఆయనకొక హిట్టు పడి.. పుష్కర కాలం దాటింది. అంటే 12 ఏళ్లు పూర్తి. అత్తారింటికి దారేది తర్వాత హిట్టే లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుసగా ఆరు ఫ్లాప్ లు. వీటిలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి కొన్ని మెరుపులున్నా.. అవేం అంత పెద్ద మేజర్ హిట్స్ కావు.  పవన్ కన్నా చిన్న చిన్న వాళ్లు.. మరీ ముఖ్యంగా ఆ కాంపౌండ్ లోని అల్లు అర్జున్ పానిండియా స్టార్ గా తన కంటి ముందు ఎదుగుతూ వెళ్తున్నాడు. ఇటీవలి పుష్ప2 కూడా కాస్త డివైడ్ టాక్ వచ్చినా.. అది 2 వేల కోట్ల మేర వసూళ్లు సాగించిన చిత్రంగా టాలీవుడ్ రికార్డులకెక్కింది.  ప్రస్తుతం పవన్ హరి హర వీరమల్లు విషయానికి వస్తే.. ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఫ్లాప్ షోగా భావిస్తున్నారు. ఆచార్య, భోళాశంకర్, మట్కా, గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు.. అంటూ క్రోనాలజీ చెబుతున్నారు. ఇక నిర్మాత ఏఎం రత్నం అయితే ఏం సార్ మీరు హ్యాపీయేనా? అనడిగిన ప్రశ్నకు.. పాపం ఆయన మింగలేక కక్కలేక నానా అవస్తలు పడుతున్న దృశ్యం మెగా ఫ్యాన్స్ ని డైలమాలో పడేస్తోంది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో ఒక ఫ్లాగ్ షిప్ కెప్టెన్సీ నిర్వహిస్తున్న పవన్ నుంచి తాము ఇలాంటి ఫలితాలను ఆశించడం లేదని కుండబద్ధలు కొడుతున్నారు కొందరు.  అంతేనా బాలయ్యను చూసి నేర్చుకోమని కూడా సూచిస్తున్నారు కొందరు. బాలయ్య బాబు మీ అంత బిజీగా లేకున్నా.. ఆయన కూడా సేమ్ టూ సేమ్ ఇటు సినీ కథానాయకుడు, అటు రాజకీయ నాయకుడే. మధ్యలో ఫ్యామిలీ ఎఫైర్స్, ఆపై బసవతారకం ట్రస్ట్, ఇంకా హిందూపూర్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎంతో చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు. సినిమా తీయడం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఆపై కథలను కూడా పర్ఫెక్ట్ గా ఎంపిక చేసుకుంటున్నారు. అలాంటి ఫ్లో మెయిన్ టైన్ చేయాల్సింది పోయి.. మనమేం మాట్లాడినా వర్కవుట్ అవుతోంది కదాని చెప్పి.. ఎలా పడితే అలా సినిమా చూస్తారనడానికి లేదన్న హెచ్చరికలు అందుతున్నాయ్. ఇది పోతే పోయింది ఓజీ, ఉస్తాద్ ఉన్నాయని లైట్ తీస్కోడానికి లేదనీ.. చేస్తే పక్కాగా సినిమాలు చేయడం.. లేదంటే వాటిని పక్కన పెట్టి సీరియస్ పాలిటిక్స్ మీద దృష్టి సారించడం చేయాలన్న సలహా సూచనలు, స్వయానా ఆయన సైనికులు, వీర మహిళల నుంచే అందుతున్నాయ్.. లేకుంటే ఏంటీ రభస? పవన్ సినిమా కోసం ర్యాలీలు తీయడమేంటి? సినిమా చూడమని కూడా బలవంత పెట్టడమేంటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అయితే సినిమా టికెట్ ఫ్రీ పథకం ప్రవేశ పెట్టడంతో సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్ అవుతోంది. ఇదేంటి పవనన్నా.. సినిమా చూడ్డం ఏమీ స్కూలుకెళ్లడం లాంటి నిర్బంధ వ్యవహారం కాదే అని నిలదీస్తున్నారు.. కొందరు అభిమానులు. పవన్ సినిమా హిట్ చేయడం వల్ల లాభాలను ఏకరవు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక వేళ మీరు ఈ సమాజానికి ఏదైనా లబ్ధి చేకూర్చి పెట్టాలంటే నేరుగానే చేయవచ్చు. సినిమా రూపంలో దాన్ని చేయాల్సిన అవసరం లేదన సలహాలు అందుతున్నాయ్. మరి చూడాలి పవన్ ఇటు బాలకృష్ణలాంటి వారి నుంచి ఏదైనా నేర్చుకుంటారా? లేక సినిమాలు పక్కన పెట్టి సీరియస్ పాలిటిక్స్ మీద ఫోకస్ పెడతారా? తేలాల్సి ఉందంటున్నారు సైనికులు.  
బాలయ్యకు సాధ్యమైంది..పవనయ్యకు ఎందుకు కాదు? Publish Date: Jul 27, 2025 6:44PM

బీఆర్‌ఎస్‌ ఏ పార్టీతోనూ కలవదు : కేటీఆర్

  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం ఎవరితో కలిసి ప్రసేక్తే లేదు. తెలంగాణ ఉన్నంతకాలం మా పార్టీ ఉంటుందన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్‌ మాట్లాడారు. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక మన కష్టాలు తీరుతాయి. పలు పార్టీలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్‌.. బీజేపీలో కలుస్తుందని ఏదోదో మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ఎక్కడికి పోదు.. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్‌ఎస్‌ ఉంటది.  ఎవ్వరితో కలిసే కర్మ మనకు లేదు. ప్రభుత్వాన్ని నడపడానికి లంకెబిందేలు, గళ్ల పెట్టెలో పైసలు కాదు..దమ్ముండాలి. ప్రభుత్వాన్ని నడిపెటోడు మొగోడైతే.. నడిపేటోనికి దమ్ముంటే పనైతది.కరోనా సమయంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు నడిపిన మొగోడు కేసీఆర్’ అని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నట్లు అయ్యింది అంటూ ఆయన తెలిపారు. ఆ కష్టకాలంలో కూడా రైతుబంధు ఆగలేదు. 24 గంటల ఉచిత విద్యుత్ ఆగలేదు.. కళ్యాణ లక్ష్మి , కెసిఆర్ కిట్ వంటి పథకాలను ఆపలేదు ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆయన తెలిపారు
బీఆర్‌ఎస్‌ ఏ పార్టీతోనూ కలవదు : కేటీఆర్ Publish Date: Jul 27, 2025 6:25PM

తిరుమలలో అన్నప్రసాదం స్వీకరించిన వెంకయ్య నాయుడు

  తిరుమల శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మాజీ ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడు  టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు తో కలిసి  తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో ముచ్చటించారు. అన్నప్రసాదాలు రుచికరంగా, శుభ్రంగా ఉన్నాయని భక్తులు ఆయన వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలను కూడా ప్రశంసించారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదం ఎంతో శుచిగా, రుచిగా ఉందని తెలిపారు. శ్రీవారి సేవకులుగా భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలందించడం ఆనందదాయకమైన విషయమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు కూరగాయలు, ఇతర వస్తువులను డొనేషన్ ఇవ్వడం ఆనందదాయకమని మాజీ భారత ఉపరాష్ట్రపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.  
తిరుమలలో అన్నప్రసాదం స్వీకరించిన వెంకయ్య నాయుడు Publish Date: Jul 27, 2025 5:50PM

బండి సంజయ్ ఎంట్రీతో మరింత ముదిరిన బీఆర్ఎస్ విలీన వివాదం

  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ల మధ్య మాటల యుద్దం రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. వారి డైలాగ్ వార్‌లోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీతో అగ్గికి మరింత ఆజ్యం పోసినట్లైంది. తెలంగాణ‌లో సీఎం రమేష్ అక్ర‌మంగా కాంట్రాక్టులు ద‌క్కించుకున్నార‌ని.. సీఎం రేవంత్ రెడ్డికి రూ.10 వేల కోట్ల అప్పు ఇప్పించార‌ని.. ఆ సందర్భంగా కుంభ‌కోణం చోటు చేసుకుంద‌ని కేటీఆర్ ఆరోపించారు.  దానిపై సీఎం ర‌మేష్‌.. నిప్పులు చెరిగారు. కేటీఆర్‌కు మ‌తి భ్రమించింద‌న్నారు. ఆయ‌న వాస్త‌వాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నార‌ని మండిపడ్డారు. బీఆర్ ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాన‌ని కేటీఆర్ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని ఈ సంద‌ర్భంగా సీఎం ర‌మేష్ బాంబు పేల్చారు. క‌విత‌ను జైలు నుంచి విడుద‌ల చేయించి.. ఈడీ, సీబీఐ దాడులు జ‌ర‌గ‌కుండా చూస్తే.. బీఆర్ఎస్‌ని బీజేపీలో విలీనం చేస్తామ‌ని కేటీఆర్ త‌న‌కు చెప్పార‌న్నారు. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్‌లను కూడా బయటపెడతానని .. దమ్ముంటే దానిపి చ‌ర్చ‌కు రావాల‌ని సవాల్ విసిరారు.  సీఎం రమేష్ సవాలుపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. చ‌ర్చ‌కు తాను కూడా రెడీనేన‌ని, అయితే..ఈ చ‌ర్చ‌కు సీఎం రేవంత్ రెడ్డి, ర‌మేష్‌లు ఇద్ద‌రూ క‌లిసి రావాల‌ని అన్నారు. ఇలా ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య మాటల యుద్ధం కొన‌సాగుతున్న స‌మ‌యంలో కేంద్ర మంత్రి, బీజేపీ కీల‌క నా య‌కుడు బండి సంజ‌య్ ఎంట్రీ ఇచ్చారు. ర‌మేష్ చెప్పింది.. నూటికి రెండు వంద‌ల పాళ్లు వాస్త‌వ‌మేనన్నారు. బీఆర్ ఎస్ ద‌గుల్బాజీ రాజ‌కీయాలు చేస్తోంద‌ని విరుచుకుపడ్డారు. బీజేపీలో విలీనం చేస్తామ‌ని ఎప్ప‌టి నుంచో చెబుతున్నార‌ని.. ఈ విష‌యాన్ని క‌విత కూడా చెప్పిన విష‌యం గుర్తులేదా? అని కేటీఆర్ ను ప్ర‌శ్నించారు.  ఈ క్ర‌మంలో సీఎం ర‌మేష్‌-కేటీఆర్ చ‌ర్చ‌కు రావాల‌ని.. స‌మ‌యం చెబితే.. వేదిక‌ను తానే ఏర్పాటు చేస్తాన‌ని బండి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ర‌మేష్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కేటీఆర్ స‌మాధానం చెప్పాల‌న్నారు. కాళేశ్వ‌రంలో ఎవ‌రెవ‌రికి కాంట్రాక్టులు ఇచ్చారో.. ఎలా ఇచ్చారో.. కూడా చెప్పాల‌ని నిల‌దీశారు. బీఆర్ ఎస్ కుటుంబ పార్టీ అని.. దానిని బీజేపీలో విలీనం చేసుకునే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. అయితే.. దానిపై కూడా కేటీఆర్ చ‌ర్చ‌కు రావాల్సి ఉంటుంద‌న్నారు. లేక‌పోతే.. ర‌మేష్ చెప్పింది నిజ‌మ‌ని ఒప్పుకొన్న‌ట్టేన‌ని బండి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అంటే బిడ్డా, అల్లుడు, కొడుకు, అయ్య పార్టీ అని బండి సంజయ్ అభివర్ణించారు.  అంతేకాదు, కేటీఆర్‎కు సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ సీఎం రమేష్ సాయంతోనే వచ్చిందన్నారు. కేసీఆర్ మొదట కొడుకుకు టికెట్ ఇవ్వలేదని, సీఎం రమేష్ ఆయన్ని ఒప్పించి టికెట్ దక్కేలా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తమ్మీద కాంట్రాక్టులకు సంబంధించి కేటీఆర్ చేసిన ఆరోపణలతో మొదలైన వివాదం ... చిలికి చిలికి గాలివానలా మారి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.  గతంలోనూ బీఆర్ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కవిత మాట్లాడి కలకలం రేపారు. బీజేపీలో విలీనం కోసం ప్రయత్నాలు జరిగినట్లు వెల్లడించారు. సీఎం రమేష్ సైతం అదే విషయాన్ని ప్రస్తావించడం, కేంద్రమంత్రి బండి సంజయ్ దాన్ని ధృవీకరిస్తున్నట్లు మాట్లాడంతో విలీనం వివాదం మరింత ముదిరినట్లైంది. మరి ఈ ఇష్యూలో బహిరంగ చర్చకు సిద్దమంటున్న బీజేపీ నేతల సవాళ్లపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
బండి సంజయ్ ఎంట్రీతో మరింత ముదిరిన బీఆర్ఎస్ విలీన వివాదం Publish Date: Jul 27, 2025 5:37PM

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌ కేసులో షాకింగ్ విషయాలు

  సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌ కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. తన వద్దకు వచ్చిన దంపతులకు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టలేరని, సరోగసితో పిల్లలు పుడతారని నమ్మించారు. సరోగసితో కోసం వేరే దంపతులకు రూ. 5లక్షలు ఇవ్వాలని చెప్పారు. ఈ కేసులో అసలు సరోగసి జరగలేదు. ఎవరికో పుట్టిన బిడ్డను దంపతులకు అప్పగించారు. బిడ్డకు డీఎన్‌ఏ టెస్ట్ చేయడంతో అసలు విషయం తెలిసిందని  నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు.  ఒక జంట 2024 ఆగస్టులో సంతాన సాఫల్యం కోసం యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను సంప్రదించారని వెల్లడించారు. డా. నమ్రత వారికి సరోగసీ చేయించుకోవాలని సూచించారని తెలిపారు. ఆ క్లినిక్ ద్వారా సరోగసీ తల్లిని ఏర్పాటు చేస్తామని నమ్మించారని అన్నారు. తొమ్మిది నెలల పాటు ఆ జంట క్లినిక్‌కు డబ్బులు చెల్లించారని గుర్తుచేశారు. 2025 జూన్‌లో సరోగసీ తల్లికి విశాఖపట్నంలో అబ్బాయి పుట్టాడని, డెలివరీ ఛార్జీలు చెల్లించి బిడ్డను తీసుకెళ్లాలని వారికి సమాచారం అందించారని చెప్పుకొచ్చారు. బిడ్డను అప్పగించి, తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, తప్పుడు డీఎన్ఏ సృష్టించారని అన్నారు.  ఆ తర్వాత భార్యభర్తల వీర్యం, అండంతో బిడ్డ వారికి పుట్టినట్లుగా నమ్మించారని తెలిపారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌ ఆ జంట నుంచి మొత్తం రూ. 35 లక్షలకు పైగా వసూలు చేసిందని తెలిపారు. తర్వాత, ఆ జంట డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోగా, బిడ్డ డీఎన్‌ఏ వారికి అసలు సరిపోలేదని తేలిందని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. మరోవైపు  సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌ కేసులో షాకింగ్ విషయాలు Publish Date: Jul 27, 2025 5:30PM

జయంతి ఎక్స్‌ప్రెస్ రైల్లో అకస్మాత్తుగా పొగలు

  అన్నమయ్య జిల్లా నందలూరులో జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు కింద భాగం లో పొగలు వచ్చాయి.  కన్యాకుమారి నుండి పూణే మధ్య ఈ జయంతి ఎక్స్ప్రెస్ నడుస్తుంది. ఆదివారం రైలు లోని ఏసీ భోగి లోని కింద భాగంలో పొగలు రావడంతో గమనించిన ప్రయాణికులు గార్డుకు సమాచారం ఇచ్చారు. మొదట హస్తవరం సమీపంలో పొగలు రావడం తర్వాత నందలూరు లో పొగలు రావడం జరిగింది. ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన గార్డు  రైలును నందలూరు రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు.  అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలు నందలూరులో ఆపి తనిఖీలు నిర్వహించారు. అగ్నిమాపాక సిబ్బందికి సమాచారం అందించారు.  రైల్లోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు  రైల్లో  క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన సిబ్బంది రైలు చక్రాల సమీపంలో ఉన్న బ్రేకుల వద్ద నుంచి పొగలు వస్తున్నాయని గమనించి మరమ్మతులు నిర్వహించారు. రైలుకు  ప్రమాదం లేదని చెప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మతుల అనంతరం తిరిగి రైలు ప్రయాణం కొనసాగింది.
జయంతి ఎక్స్‌ప్రెస్ రైల్లో అకస్మాత్తుగా పొగలు Publish Date: Jul 27, 2025 4:22PM

బీసీ హాస్టల్లో అస్వస్థతకు గురైన విద్యార్థులకు హరీష్ రావు పరామర్శ

  బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులను  బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని బాలిక వసతి గృహంలో  ఫుడ్ పాయిజన్ 150 మంది విద్యార్థులు  ఆస్పపత్రిలో చేరారు. హరీశ్ రావు వస్తున్నారని తెలిసి చికిత్స పూర్తవ్వకుండానే విద్యార్థులను డిశ్చార్జి చేశారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఎం రేవంత్ రెడ్డి నుంచి మాటలు కాదు... చేతలు కావాలని స్పష్టం చేశారు."గతంలోనూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగితే, మరోసారి ఇలాంటివి చోటుచేసుకుంటే చర్యలు తీసుకుంటానని సీఎం అన్నారు... మరి ఉయ్యాలవాడ ఘటన ఎలా జరిగింది? ముఖ్యమంత్రి ఆదేశాలు అధికారులు పాటించడం లేదా? ఢిల్లీకి వెళ్లడానికి దొరికిన సమయం, విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు దొరకదా? ఫుడ్ పాయిజనింగ్ అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలి.. మానవ హక్కుల కమిషన్, హైకోర్టు వీటిని సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలి... రేవంత్ రెడ్డీ... మాపై కోపం ఉంటే మమ్మల్ని జైల్లో పెట్టండి... అంతేగానీ విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోకండి" అంటూ హరీశ్ రావు అన్నారు.కొల్లాపూర్ మండలం బండాయిగుట్టకు చెందిన ఒక తల్లి నాగర్‌కర్నూల్ గురుకుల కాలేజీలో చదివే తన బిడ్డ అస్వస్థతకు గురైందని, ఇంటికి తీసుకపోదామని వస్తే..ఈరోజు ఉదయం అన్నంతో పెట్టిన సాంబారులో కూడా పురుగులు వచ్చాయని తెలిపింది నీళ్లు సరిగ్గా లేవు, బాత్రూములు అసహ్యంగా ఉన్నాయని విద్యార్థులు చెప్తున్నారు
బీసీ హాస్టల్లో అస్వస్థతకు గురైన విద్యార్థులకు  హరీష్ రావు పరామర్శ Publish Date: Jul 27, 2025 4:16PM

సింగపూర్‌లో సీబీఎన్ టీమ్ బిజీ బీజీ.. పెట్టుబడుల ఆకర్షణే టార్గెట్

  ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం సింగపూర్‌లో దౌత్య కార్యక్రమాల్లో బిజీగా మారింది. ఈ క్రమంలో తాజాగా భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు పి. నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్‌తో పాటు ఏపీ ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం సింగపూర్‌తో ఆంధ్రప్రదేశ్‌ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన అడుగుగా భావించవచ్చు. హైకమిషనర్ శిల్పక్ అంబులే సింగపూర్‌‎లో ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. సింగపూర్‌ ప్రభుత్వ విధానాలు, గ్రోత్ రేట్, అక్కడి భారతీయుల కార్యకలాపాల గురించి సమగ్రంగా చర్చించారు. సింగపూర్‌లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ ఉండటం ద్వారా వారి సమాజంలో సమతుల్యతను ఎలా సాధిస్తున్నారో కూడా వివరించారు. ఇండియాతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్‌ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నట్లు శిల్పక్ తెలిపారు. సీఎం చంద్రబాబు గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్టులో సింగపూర్‌తో భాగస్వామ్యం గురించి గుర్తు చేస్తూ, కొన్ని కారణాల వల్ల ఆ భాగస్వామ్యం కొనసాగలేదని, ఇప్పుడు ఆ లోటును సరిచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సింగపూర్ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని హైకమిషనర్ వెల్లడించారు. ముఖ్యంగా, సీఎం చంద్రబాబు బ్రాండ్‌కు సింగపూర్‌లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు, పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం వివరించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ఏపీ ముందుకు సాగుతోంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఇప్పటికే పట్టాలెక్కాయని, విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటవుతోందని సీఎం తెలిపారు.  అమరావతిలో ఇండియా క్వాంటం మిషన్‌లో భాగంగా క్వాంటం వ్యాలీ కూడా ఏర్పాటు కానుందని వెల్లడించారు.రాయలసీమ ప్రాంతం డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలకు అనువైన ప్రాంతంగా మారుతుందని సీఎం చెప్పారు. సింగపూర్ నుంచి ఇండియాకు ముఖ్యంగా ఏపీకి పెట్టుబడులు రావాలని, ఈ పెట్టుబడులకు ఏపీ గేట్‌వేగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి వివరించారు.  పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం హైకమిషనర్‌కు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏపీలో ప్రముఖ విద్యా సంస్థలు ఇప్పటికే ఏర్పాటవుతున్నాయని, మరిన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సింగపూర్‌ సహకారంతో విద్య, పరిశ్రమలు, సాంకేతికతలో ఏపీ కొత్త శిఖరాలను అధిరోహించేందుకు సన్నద్ధమవుతోంది.
సింగపూర్‌లో సీబీఎన్ టీమ్ బిజీ బీజీ.. పెట్టుబడుల ఆకర్షణే టార్గెట్ Publish Date: Jul 27, 2025 2:28PM

కేటీఆర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది సీఎం రమేశ్ : బండి సంజయ్

  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు 2009 ఎన్నికల్లో సిరిసిల్ల ఎమ్మెల్యే  టికెట్ ఇప్పించింది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మొదట  సిరిసిల్ల టికెట్ ఇవ్వలేదు. అప్పుడు కేటీఆర్ వెళ్లి సీఎం రమేశ్‌కు చెప్తే ఆయన కేసీఆర్ ఒప్పించి టికెట్ ఇప్పించారు. తర్వాత సీఎం రమేశ్ ఆర్ధిక సాయం చేసి కేటీఆర్‌ని ఎమ్మెల్యేగా గెలిపించారు అని తెలిపారు.  కేటీఆర్‌పై సీఎం రమేశ్‌ చేసిన ఆరోపణలు వాస్తవమే అని బండి సంజయ్‌ అన్నారు. సీఎం రమేశ్‌ సవాల్‌కు కేటీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. వారిద్దరి మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ‘‘కేటీఆర్‌తో చర్చకు సీఎం రమేశ్‌ను నేను తీసుకొస్తా. బహిరంగ చర్చకు తేదీ, సమయం కేటీఆర్‌ చెప్పాలి. బీఆర్‌ఎస్ పార్టీ  అవినీతి పార్టీ అని ఎన్నో సార్లు చెప్పాం. ఆ పార్టీని భారతీయ జనాత పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదు.  ప్రధాని మోదీ నిజామాబాద్‌ సభలో ఇదే చెప్పారు’’ అని బండి సంజయ్‌ అన్నారు. బీఆర్ఎస్ అంటే బిడ్డా, అల్లుడు, కొడుకు, అయ్య పార్టీ అని బండి సంజయ్ అభివర్ణించారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, దాన్ని నడపడం ఆ పార్టీకి సాధ్యం కావడం లేదని కేంద్ర మంత్రి విమర్శించారు. అవినీతికి కొమ్ముకాయడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువల్ని పక్కనపెట్టి కుటుంబ ఆస్తిగా పార్టీని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేటీఆర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది సీఎం రమేశ్ :  బండి సంజయ్ Publish Date: Jul 27, 2025 2:13PM

భారత హైకమిషనర్‌తో చంద్రబాబు బృందం భేటీ

  సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు బృందం  భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యింది. హైకమిషనర్ శిల్పక్ అంబులే సింగపూర్‌‎లో ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. సింగపూర్‌ ప్రభుత్వ విధానాలు, గ్రోత్ రేట్, అక్కడి భారతీయుల కార్యకలాపాల గురించి సమగ్రంగా చర్చించారు.  సింగపూర్‌లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ ఉండటం ద్వారా వారి సమాజంలో సమతుల్యతను ఎలా సాధిస్తున్నారో కూడా వివరించారు. హైకమిషనర్ శిల్పక్ అంబులే సింగపూర్‌‎లో ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. సింగపూర్‌ ప్రభుత్వ విధానాలు, గ్రోత్ రేట్, అక్కడి భారతీయుల కార్యకలాపాల గురించి సమగ్రంగా చర్చించారు. సింగపూర్‌లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ ఉండటం ద్వారా వారి సమాజంలో సమతుల్యతను ఎలా సాధిస్తున్నారో కూడా వివరించారు. ఇండియాతో ముఖ్యంగా ఏపీతో సింగపూర్‌ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నట్లు శిల్పక్ తెలిపారు.  సీఎం చంద్రబాబు గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్టులో సింగపూర్‌తో భాగస్వామ్యం గురించి గుర్తు చేస్తూ, కొన్ని కారణాల వల్ల ఆ భాగస్వామ్యం కొనసాగలేదని, ఇప్పుడు ఆ లోటును సరిచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమై సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి కోరారు. విద్యారంగంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ఆలోచనలను వివరించిన మంత్రి లోకేశ్ వారికి వివరించారు.
భారత హైకమిషనర్‌తో చంద్రబాబు బృందం భేటీ Publish Date: Jul 27, 2025 1:24PM

కొండాపూర్‌లో రేవ్‌ పార్టీ భగ్నం..11 మంది అరెస్ట్

  హైదరాబాద్ కొండాపూర్‌లో రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. శనివారం రాత్రి ఎస్వీ నిలయం అపార్ట్ మెంట్ లో కొంతమంది రేవ్ పార్టీకి ఏర్పాట్లు చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పార్టీని భగ్నం చేశారు. పార్టీ నిర్వాహుకులు సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఏపీకి చెందిన వారేనని సమాచారం.  విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సంపన్న యువకులను పిలిపించి వీకెండ్ లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు.  అపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహించగా.. 2.080 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్‌, 1.91 గ్రాముల డ్రగ్స్ లభించినట్లు తెలిపారు.  వారి నుంచి 6 కార్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా మారుపేర్లతో బ్యాంక్ అకౌంట్‌, మారు ఆధార్ కార్డులతో డబ్బున్న సరాబులను తీసుకువచ్చి రెండు రోజులపాటు ఎంజాయ్ చేయించి తీసుకు వెళ్తుంటారు. ఈ ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరితోపాటు మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
 కొండాపూర్‌లో రేవ్‌ పార్టీ భగ్నం..11 మంది అరెస్ట్ Publish Date: Jul 27, 2025 12:40PM

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

  తిరుమల శ్రీవారి సేవలో నేడు ప్రముఖులు పాల్గోన్నారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ,  మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ ఛీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, కింగ్‌డమ్ మూవీ టీమ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగ వంశీ ఉదయం శ్రీవారిని దర్శంచుకున్నారు. రంగానాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.  ఈ సందర్బంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక, టీటీడీ పవిత్రతను కాపాడేలా, పూర్వ వైభవం వచ్చిందని ప్రజలు చెబుతున్నారని అన్నారు.ఈ క్రమంలో దైవ దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు, అన్నదానం తో పాటు ఇతర అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ తరుణంలో ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుని యువతకు లక్షలాది ఉద్యోగాలు రావాలని, అమరావతి పోలవరం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు.  శ్రీవారి ఆశీస్సులతో గతేడాది రాయలసీమలో రిజర్వాయర్లన్ని నిండి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. హంద్రీనీవా ద్వారా 3850 క్యూసెక్కుల కృష్ణా జలాలను అడివిపల్లి రిజర్వాయర్ నింపి, హంద్రీనీవా కాలువ ద్వారా భవిష్యత్తులో తిరుపతికి తాగు పారిశ్రామిక అవసరాలకు నీటిని అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు Publish Date: Jul 27, 2025 12:04PM

సింగపూర్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సీఎం సింగపూర్ లో పర్యటించనున్నారు. సింగపూర్ కు చేరుకున్న సీఎంకు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తాను బసచేసే హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రుల బృందానికి స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన వారు స్వాగతం పలికారు.  సీఎంకు స్వాగతం పలికేందుకు సంప్రదాయ వస్త్రధారణలో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు తరలి వచ్చారు.. హారతులు పట్టారు. చిన్నారులు కూచిపూడి నృత్యాలతో స్వాగతించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస చేస్తున్న హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సందడి నెలకొంది. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రులు  నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ లు హాజరు కానున్నారు.  
సింగపూర్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు Publish Date: Jul 27, 2025 11:35AM

హరిద్వార్‌లో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి

  యూపీలోని హరిద్వార్ మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట  చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనల్లో  ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యానట్లు తెలుస్తోంది. శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలు భక్తులు రావడంతో క్యూలైన్ లో తోపులాట చోటుచేసుకుందని తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందడంతో ఎమర్జెన్సీ బృందాలు హుటాహుటిన ఆలయానికి చేరుకున్నాయి.  గాయపడిన భక్తులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించాయి.ఈ ఘటనలో గాయపడిన భక్తులలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయిన విషయాన్ని గర్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధ్రువీకరించారు. విషయం తెలిసిన వెంటనే ఆలయం వద్దకు బయలుదేరానని, ఘటనా స్థలాన్ని పరిశీలించాక ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని కమిషనర్ పేర్కొన్నారు  
హరిద్వార్‌లో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి Publish Date: Jul 27, 2025 11:24AM

మద్యం కుంభకోణం కేసు.. ఇప్పుడిక అవినాష్ రెడ్డి వంతు?

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్.. దూకుడు పెంచింది. వరుస అరెస్టుతో ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారిని హడలెత్తిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సిట్ 13 మందిని అరెస్టు చేసింది.  అరెస్టైన వారిలో మిథున్ రెడ్డి మినహా మిగిలిన అందరూ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండగా, మిథున్ రెడ్డి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.   అక్కడితో ఆగని సిట్ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసుతో సంబంధం ఉన్న మరో 12 మందిని అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  ఆ జాబితాలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా ఉండటంతో మిథున్ రెడ్డి తరువాత ఈ కేసులో అరెస్టు కానున్న ప్రముఖ వ్యక్తి అవినాష్ రెడ్డే అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకూ అవినాష్ రెడ్డి పేరు ఎక్కడా వినిపించలేదు. కనినపించలేదు. అలాగే ఇప్పటి వరకూ ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచింది కూడా లేదు. అలాంటిది హఠాత్తుగా అవినాష్ రెడ్డి అరెస్టునకు అనుమతి కోరుతూ సిట్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన జాబితాలో అవినాష్ రెడ్డిని నిందితుడిగా పేర్కొనడంతో ఇహనో, ఇప్పుడో అవినాష్ రెడ్డిని సిట్ అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అవినాష్ రెడ్డితో పాటు సిట్ పేర్కొన్న జాబితాలో  పురుషోత్తం, అనిరుధ్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్, బొల్లారం శివ, సైమన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రెన్ ఉన్నారు.వీరంతా ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించారని, వారిని కూడా అరెస్టు చేసి విచారించాల్సి ఉందని సిట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. వీరిలో కొందరు విదేశాలలో ఉన్నారనీ,   వారిని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సిట్ చర్యలు చేపట్టింది. . ఇప్పటివరకు  ఈ కేసుకు సంబంధించి 13 మందిని సిట్ అరెస్టు చేసింది.  మరో 12 మంది అరెస్టు కోసం   పిటిషన్లు దాఖలు చేసింది. ఈ 12 మందిలో అవినాష్ రెడ్డి పేరు ఉండటంతో ఆయన అరెస్టుకు దాదాపు రంగం సిద్ధమైపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఆ కేసులో బెయిలుపై ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో అవినాష్ రెడ్డి అరెస్టునకు సిట్ రంగం సిద్ధం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  
మద్యం కుంభకోణం కేసు.. ఇప్పుడిక అవినాష్ రెడ్డి వంతు? Publish Date: Jul 27, 2025 10:31AM

కన్యాకుమారి ముంబై ఎక్స్ ప్రెస్ లో మంటలు

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కన్యాకుమారి నుంచి ముంబై వెళుతున్న రైలు అన్నమయ్య జిల్లా చేరుకున్న సమయంలో ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. కన్యాకుమారి- ముంబై ఎక్స్ ప్రెస్ లోని ఓ ఏసీ బోగీలు మంటలు చెలరేగడాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే రైలును నందలూరు స్టేషన్ సమీపంలో నిలిపివేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను అదుపు చేసిన తరువాత రైలు యథా ప్రకారం ప్రయాణాన్ని సాగించింది. సాంకేతిక లోపంతోనే ఈ ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.  
కన్యాకుమారి ముంబై ఎక్స్ ప్రెస్ లో మంటలు Publish Date: Jul 27, 2025 9:52AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలొ శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో తిరుమల కొండ భక్త జన సంద్రంగా మారింది. ఆదివారం (జులై 27) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల  క్యూలైన్ ఎన్ జీ షెడ్స్ వరకూ సాగింది.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది.  అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.  ఇక శనివారం శ్రీవారిని మొత్తం 68 వేల  229 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో  30,559 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 2 లక్షల రూపాయలు వచ్చింది. 
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Publish Date: Jul 27, 2025 9:50AM

ఏపీ బ్రాండ్ ప్రోత్సహించడానికి.. సింగపూర్ వెళుతున్నాం : సీఎం చంద్రబాబు

  సింగపూర్ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీకి పెట్టుబడుల రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ రాత్రికి సింగపూర్ వెళుతున్నామని ఎక్స్ వేదికగా సీఎం తెలిపారు. అభివృద్ధిలో తమకు అత్యంత విలువైన భాగస్వామి, శక్తిమంతమైన తెలుగు సమాజానికి నెలవుగా ఉన్న దేశం సింగపూర్ అని కొనియాడారు. "రేపు సింగపూర్ మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, తెలుగు డయాస్పొరా సభ్యులను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో సింగపూర్ ఒక కీలక భాగస్వామిగా ఉంది.  ఆసియాలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా, దార్శనిక దేశంగా సింగపూర్ వర్థిల్లుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. లోతైన సహకారం దిశగా విలువైన అవకాశాలను అందిస్తుంది. మా విశ్వసనీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, అంతర్జాతీయ వేదికపై బ్రాండ్ ఏపీని ప్రోత్సహించడానికి, నూతన ప్రగతిశీల విధానాలను చాటిచెప్పడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. అంతేకాదు, సమ్మిళిత వృద్ధి దిశగా శాశ్వత సహకారాలను నెలకొల్పేందుకు ఇదొక అవకాశం" అంటూ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.  చంద్రబాబు బృందం సింగపూర్ లో 5 రోజుల పాటు పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, ఇండస్ట్రియలిస్టులతో భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి  సింగపూర్‌కు ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, పి.నారాయణ, ఉన్నతాధికారులు  వెళుతున్నారు. 
ఏపీ బ్రాండ్  ప్రోత్సహించడానికి.. సింగపూర్ వెళుతున్నాం : సీఎం చంద్రబాబు Publish Date: Jul 26, 2025 8:43PM

వేరొక వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్‌.. బయటపెట్టిన డీఎన్‌ఏ టెస్టు

  సికింద్రాబాద్ లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘరానా మోసం జరిగింది. పిల్లల కోసం ఆస్పత్రికి వచ్చిన  మహిళకు భర్త కాకుండా మరో వ్యక్తి నుంచి వీర్యకణాలు సేకరించి, ఐవీఎఫ్‌ పద్ధతిలో ఆస్పత్రి సిబ్బంది పిండాన్ని అభివృద్ధి చేసినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పెళ్లి అయి సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో కఫుల్స్ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు.  ఐవీఎఫ్ విధానంలో మహిళ గర్భం దాల్చింది.  ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలుడు తరుచుగా అనారోగ్యానికి గురవుతుండగా దంపతులు టెస్ట్‌లు చేయించడంతో కాన్యర్స్ ఉన్నట్లు తేలింది. కుటుంబంలో ఎవరికీ కాన్యర్స్ లేకపోవడంతో అసలు విషయం బయటపడింది.  పోలీసుల సూచన మేరకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. అవి కూడా సరిపోలలేదు. దీంతో సంబంధిత సెంటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు  విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.  టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌ డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో సరోగసి కోసం పెద్ద ఎత్తున్న వీర్యం నిల్వ చేసినట్టు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్‌తో పాటు సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  
వేరొక వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్‌.. బయటపెట్టిన డీఎన్‌ఏ టెస్టు Publish Date: Jul 26, 2025 7:44PM

మావోయిస్టు అగ్ర దంపతులు అరెస్ట్

  ఏపీలో మావోయిస్టు అగ్ర దంపతులు  సరెండర్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీలో సుమారు 34 సంవత్సరాలు పైగా పని చేసిన సీనియర్ మావోయిస్టు జోరిగె నాగరాజు అలియాస్ కమలేశ్ ఆయన భార్య మేడక జ్యోతీశ్వరి అలియాస్ అరుణ ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. కమలేశ్, ప్రస్తుతం తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్చార్జ్ పనిచేస్తూ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో SZCM హోదాలో ఉన్నారు.  మావోయిస్టు పార్టీ వైఫల్యాలు మరియు కేంద్ర కమిటీ విధానాలపై విసుగు చెంది, ఈ సిద్ధాంతం ఇక చలామణిలో అవ్వదని గ్రహించి లొంగిపోయినట్లు చెప్పారు. చత్తీస్‌గఢ్ లో వీరు మావోయిస్టు లుగా కీలకంగా వ్యవహరించారు. కమలేష్ పై ఆంధ్రా ప్రదేశ్ లో 20 లక్షల రూపాయల రివార్డు మరియు అరుణ పై 5 లక్షల రూపాయల రివార్డు ఉంది. లొంగిపోయిన దంపతులకు తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున చెక్కులను అందచేశాంఅల్లురి సీతారామరాజు జిల్లాలో ఆపరేషన్ బృందాలు ఆయుధాలు డంప్ స్వాధీనం చేసుకుంది.  వీటిలో మొత్తం 18 ఆయుధాలు ఉన్నాయి - 1 AK-47, 2 BGLలు, 5 SLRలు, 2 INSAS రైఫిళ్లు, 606 లైవ్ రౌండ్లు, 37 కిలోల కార్డెక్స్ వైర్లు,  ఇతర పరికరాలు ఉన్నాయి. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచార ఆధారంగా స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. ఇటీవల కాలంలో ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందని పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్‌లు చేస్తున్నారని డీజీపీ  తెలిపారు. మావోయిస్టు లుగా ఉన్న వారు పునరాలోచన చేయండి హింసాత్మక ఘటనలు తో సాధించేదేమీ లేదు. మన రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. మీ కుటుంబ సభ్యులు  గురించి అయినా ఆలోచనలు చేయండి. మీరు జన జీవన స్రవంతి లోకి వస్తే... ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డీజీపీ తెలిపారు.  
మావోయిస్టు అగ్ర దంపతులు అరెస్ట్ Publish Date: Jul 26, 2025 6:09PM

లిక్కర్ కేసు నిందితుల నివాసాల్లో సోదాలు

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆఫీస్, భారతి సిమెంట్స్ కార్యాలయం, నానక్‌రామ్ గూడలోని చాణక్యకు చెందిన టీగ్రిల్ రెస్టారెంట్‌లో తనిఖీలు చేశారు.  మద్యం కుంభ కోణ నిందితులు ఎక్కడ సమావేశమయ్యారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే స్కామ్‌కు ముందు వీరు ఎన్ని సార్లు భేటీ అయ్యారనే అంశంపై సిట్ దర్యాప్తు చేస్తోంది.  పలు సాంకేతిక ఆధారాలతో ఈ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. పలు రికార్డులను కూడా పరిశీలించారు. తదుపరి చర్యలపై ఉత్కంఠ రేగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారుల వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సైతం జైలుకు పంపారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు.. ఇప్పటికే పలువురు నిందితులను సైతం అరెస్ట్ చేశారు. తాజాగా మరికొందరి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు చేసిన ఈ రైట్స్ ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది
లిక్కర్ కేసు నిందితుల నివాసాల్లో సోదాలు Publish Date: Jul 26, 2025 5:19PM

ఆగస్టు 6న జాగృతి జంబో కమిటీలు : ఎమ్మెల్సీ కవిత

  తెలంగాణ  జాగృతి సంస్థను రాజకీయంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆగస్టు 6న ప్రొ.జయశంకర్  జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జంబో కమిటీలు వేయబోతున్నామని వెల్లడించారు. ఇవాళ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన 'లీడర్' శిక్షణా తరగతులకు హాజరైన కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంబో కమిటీల ఏర్పాటు తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ప్రతిజిల్లాలో నిర్వహిస్తామని తెలిపారు.  ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటారు. ఆ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని సమాజం మంచి కోసం ఉపయోగించుకోవడానికి తెలంగాణ జాగృతి ఒక వేదిక కావాలన్నారు. మన సంప్రదాయాలు, కట్టుబాట్లపై అవగాహన కల్పించుకోవడమే నాయకుడు లక్షణమని తెలిపారు.‘‘ఎప్పుడూ కొత్తగా ఉంటేనే  సంస్థలు బతుకుతాయి. తల్లి గర్భంలో నుంచి ఎవరూ నాయకత్వ లక్షణాలతో పుట్టరు. నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడవుతాడు తప్ప.. మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాలేడని ఆమె అన్నారు. సామాజిక స్పృహ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 11 స్థానంలో ఉందని ఓ సర్వేలో తేలింది.  తోటివారి గోప్యతకు, మర్యాదకు భంగం వాటిల్లకుండా పదునైన విమర్శలు చేయడం నేర్చుకోండి. పక్కవాడిని తిడుతున్నారంటే కంటెంట్ లేనట్లు అర్థం. మహాత్మాగాంధీ ఎప్పుడూ ఎమ్మెల్యేగానో, ఎంపీగానో లేరు. కానీ, ఇప్పటికీ ఆయన్ని గుర్తు చేసుకుంటాం. తెలంగాణ జాగృతి నుంచి గాంధీగిరీకి కొత్త భాష్యం చెప్పాల్సిన అవసరం ఉంది. సాంస్కృతిక నేపథ్యం లేకుండా ఏ జాతీ మనుగడ సాధించలేదు. సాంస్కృతిక నేపథ్యం లేని జాతి.. పునాది లేకుండా కట్టిన బిల్డింగ్‌ లాంటిది.  తెలంగాణ జాతికి అద్భుతమైన నేపథ్యం ఉంది. దానిని పరిరక్షించేందుకే  ‘జాగృతి’ పని చేస్తుంది. నాడు పోలవరం ప్రాజెక్టు కడుతుంటే అడ్డుపడ్డాం, నేడు బనకచర్ల లింక్ ప్రాజెక్టు కడతామంటే చూస్తూ ఊరుకోబోమని కచ్చితంగా ఆపి తీరుతామన్నారు. తెలంగాణ వనరులు, సాంస్కృతి పరిరక్షించడమే ఆలోచనగా జాగృతి పనిచేస్తుందని కవిత వెల్లడించారు.
ఆగస్టు 6న జాగృతి జంబో కమిటీలు : ఎమ్మెల్సీ కవిత Publish Date: Jul 26, 2025 4:55PM

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన

  బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. దీంతో ఏపీలోని కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులువీచే అవకాశం వుంది...వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లోని పశ్చిమబెంగాల్ తీరం, బాంగ్లాదేశ్ ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర చత్తీస్గడ్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. రాగల రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందంది. అలాగే ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు..ఈరోజు,రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  అలాగే తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలు, ముసురు వాతావరణం ఉంటుంది. చినుకులు రోజంతా పడతాయి. ఉత్తర తెలంగాణలో కంటిన్యూగా భారీ వర్షం పడే అవకాశముంది. మధ్య తెలంగాణలో మోస్తరు వర్షం రోజంతా కురుస్తుంది. హైదరాబాద్‌లో జల్లులు కురిసే ఛాన్స్ ఉంది.ఇక ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మాత్రం రోజంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం చాలా చోట్ల పడుతుంది. అయితే.. ఉత్తరాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షం పడొచ్చు. గంటకు 40-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.  బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతున్న నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ శాఖతో సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. విజయవాడలో వరదలు వస్తున్నాయన్న వదంతులను నమ్మవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి.
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన Publish Date: Jul 26, 2025 4:11PM

కార్గిల్ విజయ్ దివస్ – భారత జెండా గర్వంగా ఎగిరిన రోజు..!

ప్రతి సంవత్సరం జూలై 26న మనం కార్గిల్ విజయ్ దివస్ ని ఘనంగా జరుపుకుంటాం. నిజానికి కార్గిల్ విజయ్ దివస్ ను ఒక పండుగలా జరుపుకుంటు ఉంటాం.  అయితే ఇది కేవలం ఒక పండుగ కాదు.. మన భారత సైనికుల  దేశభక్తికి, సాహసానికి, త్యాగానికి గుర్తుగా నిలిచే ఒక మహత్తరమైన రోజు. విజయ్ దివస్.. ఆవిర్భావం.. 1999లో భారత దేశానికి సంబంధించిన జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలోని కార్గిల్ లోయలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు,  ముష్కరులు, భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారు. వారిని వెనక్కు తోసి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో భారత సైన్యం అసాధారణమైన ధైర్యాన్ని, ఓర్పును ప్రదర్శించింది. ఈ యుద్ధాన్ని మనం కార్గిల్ యుద్ధం గా గుర్తించాము. సుమారు 60 రోజుల పాటు సాగిన ఈ యుద్ధం 1999 జూలై 26న భారత విజయం సాధించడంతో ముగిసింది. అందుకే ఆ రోజును “విజయ్ దివస్”గా ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో జరుపుకుంటున్నాం. కార్గిల్ యుద్దం.. ఒక సాహస గాథ.. కార్గిల్  యుద్ధంలో భారత సైనికులు ఎంతో కష్టసాధ్యమైన పర్వత ప్రాంతాల్లో పోరాడారు. కొండలపై దాక్కున్న శత్రువును తలకిందులు చేసి తామే పైచేయి సాధించడం అంటే సాహసానికి పరాకాష్ట.  ఈ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బత్రా, లెఫ్టినెంట్ అనోజ్ థాపా, గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్, నాయిక్ సాయి సానూ లాల్, వంటి ఎందరో వీరులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు. ఎందుకు జరుపుకోవాలి? కార్గిల్ విజయ్ దివస్‌ను మనం జరుపుకోవడానికి ముఖ్య కారణాలు ఇవే: దేశాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పించటం యువతలో దేశభక్తిని ప్రేరేపించటం సైనికుల ధైర్యాన్ని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుని గర్వించటం మనం ఏమి చేయగలం.. మౌనంగా రెండు నిమిషాలు నిలబడి వీరులకు నివాళులర్పించవచ్చు.  పిల్లలకి, స్నేహితులకు కార్గిల్ విజయ్ దివస్ గురించి వివరంగా చెప్పి వారిలో చైతన్యం కలిగించవచ్చు. దేశ భద్రతలో భాగమైన సైనికుల సేవలకు కృతజ్ఞతలు తెలపచ్చు. కార్గిల్ విజయ్ దివస్  అందరికీ ఇచ్చే సందేశం..  స్వేచ్ఛ విలువైనదని, అది ఎప్పటికీ తీసుకోలేనిదాని ఆ రోజు దేశ ప్రజలకు చెప్పకనే చెబుతుంది. మన దేశ సైనికుల ధైర్యం, పట్టుదల కారణంగానే మనం నేడు సురక్షితంగా జీవిస్తున్నాము. ఈరోజు వారిని గుర్తుంచుకోవడం మనందరి బాధ్యత.                                         *రూపశ్రీ.
కార్గిల్ విజయ్ దివస్ – భారత జెండా గర్వంగా ఎగిరిన రోజు..! Publish Date: Jul 26, 2025 3:40PM

అన్నవరం ఆలయంలో సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

  అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో సుబ్బారావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మరో ఐదుగురికి షోకాజు నోటీసులు ఇచ్చారు. పారిశుద్ధ్య సిబ్బందికి చెందిన ఫీఎఫ్ చెల్లింపుల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఈవో ఈ మేరకు చర్యలు చేపట్టారు. గుంటూరుకు చెందిన కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్‌కు చెందిన పారిశుద్ధ్య సిబ్బంది ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్‌ ఏజెన్సీ.. కార్మికుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో నగదు జమ చేయకుండానే చేసినట్లుగా నకిలీ చలాన్లను సృష్టించి ఆలయ అధికారులకు చూపించింది.  అయితే ఆ రికార్డులు పరిశీలించకుండానే ఆలయ అధికారులు ఏజెన్సీకి బిల్లులు  పంపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ నేపథ్యంలోనే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఆలయ పారిశుద్ధ్య పర్యవేక్షకుడు వెంకటేశ్వర రావు, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణలపై ఈవో సస్పెన్షన్ వేటు వేశారు. అప్పటి పర్యవేక్షణ అధికారి సత్య శ్రీనివాస్‌కు ఛార్జిమెమో ఇచ్చారు. టోల్ రుసుం వసూలు చేసే గుత్తేదారు నుంచి రూ. 41 లక్షలు జీఎస్టీ వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు సీ-సెక్షన్ అధికారులకు షోకాజ్ నోటీసులు పంపారు.
అన్నవరం ఆలయంలో సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు Publish Date: Jul 26, 2025 3:35PM

మీకు థైరాయిడ్ ఉందా? జాగ్రత్త ఈ కూరగాయలు తినకూడదు..!

మన మెడలోని థైరాయిడ్ గ్రంథి ఒక చిన్న అవయవం.  కానీ ఇది చాలా ముఖ్యమైన అవయవం. ఇది మన శరీర జీవక్రియ, శక్తి స్థాయిలు,  శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయనప్పుడు చాలా సమస్యలు మొదలవుతాయి.  ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయ్యే హైపోథైరాయిడిజంలో సమస్యలు ఎక్కువ.  మందులతో పాటు, థైరాయిడ్ రోగులకు సరైన ఆహారం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా ఆరోగ్యకరమైనవి అనుకునే కొన్ని  కూరగాయలు థైరాయిడ్ సమస్యలను పెంచుతాయి. థైరాయిడ్ రోగులు ఏ కూరగాయలను తినకూడదు ? తెలుసుకుంటే.. క్యాబైజీ కుటుంబానికి చెందిన కూరగాయలు.. థైరాయిడ్ రోగులు కొన్ని కూరగాయల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీటిని గోయిట్రోజెనిక్ అంటారు. ఇవి థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని అడ్డుకునే సమ్మేళనాలు. థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయడానికి అయోడిన్ చాలా ముఖ్యమైనది. ఇందులో ప్రధానంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ,  బ్రస్సెల్స్ మొలకలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలు ఉంటాయి. ఈ కూరగాయలలో గ్లూకోసినోలేట్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలోని థైరాయిడ్ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి. పచ్చగా వద్దు.. పైన చెప్పుకున్న  కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, థైరాయిడ్ రోగులు వాటిని పచ్చిగా తినకూడదు. పచ్చిగా ఉన్నప్పుడు వాటికి అధిక గైట్రోజెనిక్ లక్షణాలు ఉంటాయి.  వాటిని ఉడికించి తినేటప్పుడు ఈ సమ్మేళనాల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి  థైరాయిడ్  ఉన్నవారు ఈ కూరగాయలను తినాలనుకుంటే, వాటిని ఎల్లప్పుడూ బాగా ఉడికించి,  పరిమిత పరిమాణంలో తినాలి.  వాటిని రసం రూపంలో లేదా పెద్ద పరిమాణంలో పచ్చిగా తీసుకోవడం మానుకోవాలి.  ఎందుకంటే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. నిపుణుల సలహా.. పైన పేర్కొన్న కూరగాయలతో పాటు, సోయా ఉత్పత్తులు కూడా గైట్రోజెనిక్ కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. కాబట్టి థైరాయిడ్ రోగులు వాటిని మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా  ప్రాసెస్ చేసిన ఆహారాలు,  గ్లూటెన్ వినియోగం కూడా కొంతమంది థైరాయిడ్ రోగులకు, ముఖ్యంగా హషిమోటోస్ థైరాయిడిటిస్ ఉన్నవారికి సమస్యాత్మకంగా ఉంటుంది. ఆహారం మాత్రమే థైరాయిడ్‌ను నయం చేయదని, అది మందులతో పాటు మాత్రమే సహాయపడుతుందని అర్థం చేసుకోవడం ముఖ్యం.  థైరాయిడ్ ఉన్నవారు ఎల్లప్పుడు వైద్యుడిని లేదా డైటీషియన్ ను కలిసిన తరువాత మాత్రమే ఆహారం తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకోవడం మంచిది.  ఏదైనా కూరగాయలను పూర్తిగా ఆపడం లేదా  స్వంతంగా ఏదైనా పెద్ద ఆహార మార్పులు చేయడం చేయకూడదు. ఎందుకంటే ఇది ఇతర పోషకాల లోపానికి దారితీస్తుంది.                                 *రూపశ్రీ.  
మీకు థైరాయిడ్ ఉందా? జాగ్రత్త ఈ కూరగాయలు తినకూడదు..! Publish Date: Jul 26, 2025 3:35PM