‘జాతీయ అజెండా, ప్రాంతీయ జెండా’ ఇదే కేసేఆర్ యాత్రల అజెండా

మరో రెండు మూడు నెలలు ఆగండి, మీకో సంచలన వార్త చెపుతా .. గురువారం  బెంగుళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మరో సంచలన ప్రకటన ఇది. 

ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “జాతీయస్థాయిలో మార్పు రాబోతోంది.. దాన్ని ఎవరూ ఆపలేరు. రెండు మూడు నెలల తర్వాత మీకు సంచలన వార్త అందుతుంది” అని మీడియాకు చెప్పారు.అయితే ఆ సంచలన ప్రకటన ఏమిటో, ఆయన మనసులో ఏముందో మాత్రం ఆయన బయట పెట్టలేదు. కానీ, ఆయన బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన తర్వాత, కుమార స్వామి అసలు గుట్టు విప్పేశారు. అదేమంటే, వడ్ల గినజలో బియ్యపు గింజ...

కేసీఆర్ చాలా కాలంగా చెపుతున్న ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు ముచ్చటే, ఆ ‘సంచలన’ వార్తని కుమార స్వామి చెప్పారు.  “ప్రాంతీయ పార్టీలన్నీ విబేధాలను పక్కనపెట్టి జాతీయ ప్రయోజనాల రీత్యా ఏకతాటిపైకి వచ్చేస్తాయి, కేసీఆర్‌ చొరవతో భారత భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి” అని కుమార స్వామి చెప్పు కొచ్చారు. అందుకు ఆయన ముహూర్తం కూడా ఖరారు చేశారు. దేశమంతా విజయదశమి జరుపుకొనే రోజుల్లోనే విజయవంతమయ్యే సంచలన ప్రకటన రానుందని కుమారస్వామి అన్నారు. 

అయితే ఇదేమన్నా కొత్త ప్రకటనా అంటే కాదు, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కేసీఆర్ ఇదే చెపుతున్నారు. అంతే కాదు, అయన తాను స్వయంగా  చెప్పిన ఫ్రంట్ ఏర్పాటును ఆయనే, ఫ్రంటూ లేదు టెంటు లేదంటూ ఖండించారు. నిజానికి, జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక గురించి ముఖ్యమంత్రి కేసీఆర్’కు కూడా స్పష్టత లేదని, అయన ప్రకటనలే సూచిస్తున్నాయి.  అదలా ఉంటే గత ఐదారు  నెలలుగా జాతీయ రాజకీయాల పై దృష్టి కేంద్రీకరించైనా కేసీఆర్ , దేశవ్యాప్త రాజకీయ యాత్రలు చేస్తున్నారు, అయితే, ఎందుకనో గానీ, ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఏదో ఒక అపశకునం అనాలో ఇంకేమనాలో కానీ ,అనుకున్న యాత్ర అనుకున్నట్లు సాగడం లేదు.

గత వారం ఢిల్లీ వెళ్ళిన సమయంలో ఆయన అక్కడినుంచి అటే పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక మీదుగా మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి, షిర్డీ వెళ్లి  అన్నా హజారే, షిర్డీ సాయిబాబాలను దర్శించుకుని, 28 తేదీకి గానీ హైదరాబాద్ తిరిగి రారని అన్నారు. కానీ, ఈ యాత్రలో, ఒకటికి రెండు బ్రేకులు పడ్డాయి. ఢిల్లీ టూర్’కు సంబంధించి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండాల్సింది. అటు తర్వాత బెంగళూరు, రాలేగావ్ సిద్ధి, షిర్డీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ, రెండు రోజుల ముందుగా మే 23నే ఆయన  అకస్మాత్తుగా హైదరాబద్ తిరిగి వచ్చారు.

ఇప్పుడు మళ్ళీ గురువారం ( మే 26) ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలోనే, బెంగుళూరు వెళ్లారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బెంగళూరు నుంచి ఆయన శుక్రవారం (మే 27న) మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దికి వెళ్లి, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలవవలసి ఉంది. ఆపై శిరిడీలో సాయిబాబాను దర్శించుకొని హైదరాబాద్ తిరిగిరావాల్సిఉంది. కానీ కేసీఆర్ అనూహ్యంగా బెంగళూరు పర్యటన ముగియగానే నేరుగా హైదరాబాద్ తిరిగొచ్చారు. 

నిజానికి, జాతీయ రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ ప్రయాణం సాఫీగా సాగడం లేదు. ఢిల్లీకి ముందే, తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలు పర్యటించి, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఎన్సీపీ అదినేత పవార్ వంటి సీనియర్ నాయకులను కలిసి  కాంగ్రెస్ యేతర, బీజేపీ యేతర ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించి వచ్చారు.

అయితే, ఆ చర్చలు ఏవీ ఫలించలేదు. కాంగ్రెస్ ’చేయి’ వదిలేది లేదని పవార్ నుంచి స్టాలిన్ వరకు అందరూ స్పష్టం చేయడంతో, కేసీఆర్ స్వరం  మార్చి మరో రూట్’లో వెళుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితిలో కేసీఆర్ ఆశిస్తున్నట్లుగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావడం అయ్యే పనేనా  అంటే, రాజకీయ విశ్లేషకులు, 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు ఏకం కావడం అయ్యే పని కాదనే అంటున్నారు.అయితే, కేసీఆర్’కు ఈవిషయం తెలియదా అంటే, తెలియదాని కాదు, కానీ, లోక్ సభ ఎన్నికలకంటే ముందు వచ్చే అసెంబ్లీ ఎన్నికల గండం గట్టేక్కే ఎత్తుగడలో భాగంగానే ఆయన. 2018లో ప్లే చేసిన ట్రిక్’నే మళ్ళీ మరోమారు ప్లే చేస్తున్నారని, అంటున్నారు. అందుకే కేసీఆర్ ప్రస్తుత రాజకీయాని, ‘జాతీయ అజెండా,  ప్రాంతీయ జెండా’ గా పేర్కొంటున్నారు.