విజయనగరంలో వైసీపీ సామాజిక న్యాయభేరి రద్దు.. నెపం వర్షం మీద తోసేస్తున్న మంత్రులు

విజయనగరం జిల్లాలో జరగాల్సిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర రద్దైంది. మంత్రి బొత్ ఇలాకాలోనే సామాజిక న్యాయ భేరి వైఫల్యం ఆ పార్టీని తీవ్ర నిరాశలో ముంచేసింది. సామాజిక న్యాయ భేరి విజయనగరంలో రద్దు కావడానికి వర్షం కారణమంటూ నేతలు నెపం వర్షం మీదకు తోసేస్తున్నారు. విజయనగరంలో భారీ వర్షం కురిసింది నిజమే.

కానీ వర్షం ఆగిపోయిన తరువాత 17 మంది మంత్రులూ వేదిక మీదకు వెళ్లినా కూడా వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరూ లేకపోవడంతో గత్యంతరం లేక సభను రద్దు చేసుకుని మంత్రులు బస్సులో విశాఖ వెళ్లిపోయారు. 

మంత్రుల బస్సు విజయనగరంలోనికి ప్రవేశించే సమయానికి భారీ వర్షం కురుస్తోంది. దీంతో వైసీపీ కష్టపడి సమీకరించిన జనం ఇళ్లకు వెళ్లి పోయారు. సభా స్థలి వద్దకు మంత్రులు చేరుకునే సమయానికి కూడా వర్షం కురుస్తూనే ఉండటంతో మంత్రులు బస్సులోనే ఉండిపోయారు. తరువాత వర్షం తెరిపిచ్చినప్పటికీ, మంత్రులు వేదిక మీదకు చేరుకున్న తరువాత కూడా సభ స్థలి ఖాళీగానే దర్శనమివ్వడంతో నిరాశ చెందిన మంత్రులు సభను రద్దు చేశారు.  తొలి రోజే సభకు స్పందన కరవవ్వడం చూస్తుంటే ఈ యాత్ర ముందు ముందు ఎలా సాగుతుందా అన్నా అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

కాగా  మొత్తంగా వైసీపీ చేపట్టిన బస్సు యాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పాలన మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ మూడేళ్లలో తమ ప్రభుత్వం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించే లక్ష్యంతో తలపెట్టిన ఈ యాత్రను కేవలం బహిరంగ సభలకే పరిమితం చేశారు.

అంతే కానీ బస్సులో సామాజికంగా వెనుకబడిన వర్గాల వారి కాలనీలకు, వాడలలోకి వెళ్లాలి కానీ, వారిని బహిరంగ సభలకు సమీకరించడం అంటే గడపగడపకూ అనుభవంతో ఏదో రకంగా ఈ కార్యక్రమాన్ని మమ అనిపించేయడానికే నిర్ణయించుకున్నారని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఎస్సీ వాడలకు దూరంగా  బస్సు యాత్ర జరుగుతున్న తీరు పట్ల ప్రజలలో కూడా ఆసక్తి కరవైంది.