ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఇంకా భారీగానే వస్తున్నాయి. రోజుకు 2 వేలకు పైగానే  కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ ఆంక్షలు తొలగించడంతో జనాలు యథేచ్చగా తిరుగుతున్నారు. మాస్కులు లేకుండానే గుంపులు గుంపులుగా వస్తున్నారు. భౌతిక దూరం పాటించాలన్న సోయి కూడా మర్చిపోయారు. త్వరలోనే థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికలు, జనాల అజాగ్రత్తలతో వైద్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 

ఏపీలో వైరస్ కేసులు ఇటీవల తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా సోకింది. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఐసొలేషన్ లోకి వెళ్లి, చికిత్స తీసుకుంటున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తానని ఆయన ప్రకటన విడుదల చేశారు.