గ్రామాల్లో ముదునూరి, చినిమిల్లి - ఇంట్లో కొత్తపల్లి
posted on Mar 24, 2012 11:54AM
నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానపార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసున్న ముదునూరి ప్రసాదరాజు, తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేస్తున్న డాక్టర్ చినిమిల్లి ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి అయిన కొత్తపల్లి సుబ్బారాయుడు మాత్రం ఏమీ పట్టనట్లుగా ఇంట్లోనే కూర్చుని వ్యూహాలు రచిస్తున్నారు. ఆయన ఇంట్లోనే ఉంటూ కార్యకర్తలను, నాయకులను కలుసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మండల కార్యదర్శి బొల్లంపల్లి వెంకట నారాయణను కాంగ్రెస్ గూటికి రప్పించడంలో కొత్తపల్లి సుబ్బారాయుడు ఇప్పటికే సఫలమయ్యారు. మరికొందరు నేతలకు కూడా ఆయన గేలం వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుండటంతో కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు. తమ నేతను కూడా వెంటనే ప్రచారం ప్రారంభించమని ఒత్తిడి తెస్తున్నారు. ఉగాది తరువాత కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రచారం ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.