కాంగ్రెస్ తో ఒంటరిపోరాటం చేస్తున్న నరేంద్ర మోడీ
posted on Jul 15, 2013 7:45PM
(10).jpg)
బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా చెప్పబడుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారకమిటీ బాధ్యతలు చెప్పటిన తరువాత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నిద్రలో కూడా మోడీ జపమే చేస్తోంది. అయితే, బీజేపీలో మోడీకి అండగా నిలబడుతున్న వాళ్ళను వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును. కానీ, కాంగ్రెస్ లో మాత్రం ఆయనపై దాడి చేసేవాళ్ళకు లెక్క లేదు.
మోడీ ఇటీవల గుజరాత్ అల్లర్లపై స్పందిస్తూ “కారులో పయనిస్తున్నపుడు ఒక కుక్కపిల్ల కారు చక్రం క్రింద పడిపోతే ఎవరికయినా బాధ కలుగుతుందని” అని అన్నారు. అయన కేవలం తన బాధని వ్యక్తం చేయడానికే ఆవిధంగా ఉదహరించినప్పటికీ, ‘గుజరాత్ అల్లర్లలో చనిపోయిన వారిని కుక్కపిల్లలతో ఆయన పోల్చారని’ ఆయన మాటలకు వక్రభాష్యం చెపుతూ కాంగ్రెస్ చాల రాద్ధాంతం చేసింది. ఆ సమయంలో బీజేపీలో ఆయనకు అండగా నిలచినవారు కొద్ది మందే. కానీ, మోడీ మాత్రం ఏ మాత్రం వెరవకుండా కాంగ్రెస్ పార్టీతో ఒంటరి పోరాటం చేస్తునే ఉన్నారు.
నిన్న ఫెర్గుసన్ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ, “కాంగ్రెసుపార్టీ తనకి సవాళ్లు ఎదురైనప్పుడల్లా లౌకికవాదమనే ముసుగులో దాక్కుంటుందని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి దేశాన్ని కాంగ్రెస్ పార్టీయే పరిపాలిస్తున్నపటికీ, ఇంతవరకు దేశంలో దారిద్ర్యం తాండవిస్తూనే ఉందని, ఒక నాడు ‘గరీబీ హటావో’ మరొకసారి ‘ఆహార భద్రత’ ఇలా రకరకాల పేర్లు పెట్టి ప్రజలకి, ముఖ్యంగా నిరుపేద ప్రజలకి కేవలం చిత్తుకాగితాలు మాత్రమే చేతిలో పెడుతూ వంచిస్తోందని ఆయన విమర్శించారు.
నేటి ద్రవ్యోల్బణానికి, రూపాయి పతనానికి, అధిక ధరలకు అన్నిటికీ ప్రధాన కారణం ప్రధాని మనోమోహన్ సింగే కారకుడని, కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలతో యావత్ దేశం తిరోగమన పధంలో దూసుకుపోతోందని ఆయన ఎద్దేవా చేసారు. కనీసం దేశప్రజలకు భద్రత కల్పించడంలోనూ, చైనాచొరబాట్లను అడ్డుకోవడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతోందని ఆయన విమర్శించారు.
ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దేశాన్ని ‘కాంగ్రెస్ రహితదేశంగా’ చేయడమే అని గట్టిగా చెప్పడంతో సహజంగానే కాంగ్రెస్ మండిపడింది. అసలు నరేంద్ర మోడీ దృష్టిలో లౌకిక వాదం అంటే ఏమిటని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.
ఇక మోడీ సాకుతో యన్డీయే నుండి బయటపడిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మెల్లగా కాంగ్రెస్ కు చేరువయ్యే ప్రయత్నంలో ఇటీవల యుపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార భద్రతా బిల్లును గట్టిగా సమర్ధించారు. పనిలోపనిగా బీజేపీని తీవ్రంగా దుయ్యపట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతల భాష, ఆపార్టీ అసలు రంగును బయట పెడుతోందని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తాము ఎన్డీయే నుంచి విడిపోయి చాలా మంచి నిర్ణయమే తీసుకొన్నామని అనిపిస్తోందని నితీష్‌కుమార్ అన్నారు.
ఈవిధంగా కాంగ్రెస్ మిత్ర పక్షాలతో సహా అందరూ కూడా మోడీపై కత్తులు దూస్తుంటే, కనీసం ఆయనకు బీజేపీలో స్వంత మనుషులు కూడా ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ఆయనను వ్యతిరేఖించే అద్వానీ శిబిరంలో ఉన్న సుష్మా స్వరాజ్, యశ్వంత్ సిన్హా వంటి హేమాహేమీలు అందరూ దూరంగా నిలబడి చోద్యం చూస్తున్నారు.
అయితే, ఇదీ మోడీకి ఒకందుకు మేలే చేస్తుందని చెప్పవచ్చును. ఎన్నికలకి ముందే తన పోరాట పటిమ చాటుకొనే అవకాశం పొండమే కాకుండా, పార్టీలో తనకు అనుకూల వర్గాన్ని ఏర్పరచుకోవడానికి వీలవుతుంది.