సమైక్యాంధ్ర కోసం ఆడుతున్నఆ ‘స్టార్ బ్యాట్స్ మ్యాన్’ ఎవరు?

 

కాంగ్రెస్ కు ప్రధమశత్రువు కాంగ్రేసే అని ఒక నానుడి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తనను తానూ ఓడించుకొని ఓడిపోవాల్సిందే తప్ప ఇతరులు ఆ పార్టీని ఓడించలేరని మరో నానుడి కూడా ఉంది. ఈ రెండూ కూడా అక్షరాల నిజమని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిరూపిస్తున్నారు. తెరాస అధినేత రగిల్చిన తెలంగాణా ఉద్యమం కాంగ్రెస్ పార్టీని నిలువునా చీల్చింది. సమైక్యాంధ్ర , తెలంగాణ గ్రూపులుగా విడిపోయి బద్దశత్రుల కంటే ఘోరంగా ఒకరి మీద మరొకరు కత్తులు దూసుకొంటుంటే, ఇక కాగల కార్యం గందర్వులే చేస్తున్నపుడు మధ్యలో తామేందుకు దూరడమని తెదేపా, తెరాసలు దూరంగా నిలబడి చూస్తున్నాయి.

 

సీమంధ్ర నేతలు తమ నోటికాడ కూడుని లాకొంటున్నారని టీ-కాంగ్రెస్ నేతలు మండి పడుతుంటే, పుండు మీద కారం చల్లినట్లు ఆనం వివేకానంద రెడ్డి, లగడపాటి రాజగోపాల్ తదితరులు ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగదని ధృడంగా చెపుతున్నారు.

 

ఈ రోజు లగడపాటి మరో అడుగు ముందుకు వేసి తమ చేతిలో ఇంకా ‘బ్రహ్మాస్త్రం’ ఉందని, కానీ దానిని ప్రయోగించనవసరం లేకుండానే, మైదానంలోకి దిగిన తమ ‘స్టార్ బ్యాట్స్ మ్యాన్’ తెలంగాణాను సమర్ధంగా అడ్డుకోగలరని అన్నారు.

 

తెలంగాణా ప్రజలలో ఇదివరకు ఉన్నంత బలంగా తెలంగాణా సెంటిమెంట్ ఇప్పుడు లేదని, త్వరలో జరిగే పంచాయితీ ఎన్నికలతో మిగిలిన సెంటిమెంట్ కూడా మాయమవుతుందని అన్నారు. తెలంగాణా ఉద్యమం బలంగా సాగుతున్న తరుణంలోనే, గత రెండు ఎన్నికలలో తెలంగాణా ప్రజలు సమైక్యవాదానికే ఓటువేసారని, మళ్ళీ 2014లో జరగనున్న ఎన్నికలలో కూడా ప్రజలు కాంగ్రెస్ కే ఓటేసి గెలిపించడం ఖాయమని ఆయన అన్నారు. కొందరు టీ-కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నట్లు రాష్ట్రం విడిపోతే కాంగ్రెస్ బలపడదని, సమైక్యంగా ఉంటేనే ఎక్కువ లోక్ సభ సీట్లు సాధించుకోవచ్చునని అన్నారు.

 

తెలంగాణ ఇస్తానని కాంగ్రెసు ఎప్పుడూ చెప్పలేదని, రెండో ఎస్సార్సీ కోసం కసరత్తు చేస్తోందని ఆయన అన్నారు. వచ్చే నెలాఖరులోగా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితమయిన నిర్ణయం ప్రకటిస్తుందని ఆయన అన్నారు. శాసనసభలో తెలంగాణా బిల్లు ఆమోదం పొందకుండా, పార్లమెంటులో సాంకేతికంగా ఆమోదం పొందలేదని, తెలంగాణా ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా శాసనసభ ఆమోదం, రాజ్యంగా సవరణ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

 

ఇక లగడపాటి మాట్లాడినవాటిలో మిగిలిన అంశాల సంగతి పక్కనబెడితే, ఆయన చెప్పిన “స్టార్ బ్యాట్స్ మ్యాన్” ఎవరు అని ఆలోచిస్తే నిన్నకోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా దాదాపు గంట సేపు ఏకధాటిగా వాదించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, లేదా తెర వెనుక నుండి మంత్రాంగం నడుపుతున్న బొత్స సత్యనారాయణ లేదా కేవీపీ రామచంద్ర రావు అయి ఉండవచ్చునని అర్ధం అవుతోంది. అదే విధంగా లగడపాటి పేర్కొన్న ‘బ్రహ్మాస్త్రం’ సీమంధ్ర నేతల రాజినామాలేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 

ఒకపక్క కాంగ్రెస్ అధిష్టానం ఈ సమస్య నుండి ఎలాగయినా బయటపడాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటే, పార్టీకి, అధిష్టానానికి తాము విధేయులమని చెప్పుకొంటూనే, మరో పక్క ఈవిధంగా మాట్లాడుతూ పార్టీ అధిష్టానాన్నిఇబ్బంది పెట్టడం కాంగ్రెస్ నేతలకే చెల్లు. వారు ఆవిధంగా మాట్లాడుతున్నపటికీ వారిని నియంత్రించలేకపోవడం కేవలం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యం. వారు ఇదేవిధంగా కత్తులు దూసుకొంటుంటే తప్పకుండా వాళ్ళ పార్టీని వాళ్ళే ఓడించుకొని అధికారం ప్రతిపక్షాలకి అప్పగించడం ఖాయం.