కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ
posted on Jun 18, 2025 3:22PM

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ దాదాపు పాతిక నిముషాలు సాగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలను లోకేష్ ఆయనకు వివరించారు. అలాగే కేంద్రం సహాయసహకారాలతో రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను లోకేష్ ఈ సందర్భంగా అమిత్ షాకు వివరించి చెప్పారు. ఇక ఈ నెల 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరౌతున్న సందర్భంగా చేసిన ఏర్పాట్లను వివరించారు.
అలాగే రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారాన్ని కోరారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్ర కు సంబంధించి రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను లోకేష్ అమిత్ షాకు అందజేశారు. ఈ సందర్భంగా సుదీర్ఘఠ పాదయాత్రతో ప్రజలలో చైతన్యాన్ని నింపారంటూ అమిత్ షా లోకేష్ ను అభినందించారు. అలాగే చంద్రబాబు సుదీర్ఘ పాలనా అనుభవం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తుందనీ, ఎపిసర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా పేర్కొన్నారు.