జగన్‌పై టీడీపీ అభిమానుల ఏఐ వీడియో.. ఇలాంటివి వద్దంటూ లోకేష్ హితవు
posted on Nov 26, 2025 1:12PM
.webp)
ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి అసెంబ్లీకి డుమ్మా కొట్టేస్తున్న జగన్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఇవ్వని, అర్హత లేని ప్రతిపక్ష హోదా కోసం జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేయడంపై విమర్శలతో పాటు ట్రోలింగ్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇందులో భాగంగానే జగన్ విపక్ష హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ లను బతిమలాడుకుంటున్నట్లుగా ఓ ఏఐ జనరేటెడ్ వీడియో ప్రస్తుతం సామిజిక మాధ్యమాన్ని షేక్ చేసేస్తోంది. ఆ వీడియోలో చంద్రబాబు, పవన్, లోకేష్ నడుచుకుంటూ వెడుతుంటే .. ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అంటూ రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని జగన్ వారిని వేడుకుంటున్నట్లు ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడా వీడియో తెగ వైరల్ అయ్యింది.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వ్యక్తిగత దాడులు సముచితం కాదు, ఆ వీడియోను తీసేయండంటూ హితవు పలికారు.
.webp)
ఇదే లోకేష్ ను గతంలో వైసీపీయులు నానా రకాలుగా ట్రోల్ చేశారు. లోకేష్ ఆహారం, ఆహార్యం ఇలా ప్రతి విషయంలోనూ ఆయనను ట్రోల్ చేసి, రాజకీయాలలో తొలి అడుగు కూడా పడకుండానే ఆయన నడకను ఆపేయాలని చూశారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని నిలబడిన లోకేష్.. తనపై విమర్శలకు తన పనితీరుతోనే బదులిచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆయన ఒక తిరుగులేని నేత. ఆయన ఇప్పుడు జగన్ పై వ్యక్తిగత విమర్శలు కూడదంటూ తెలుగుదేశం శ్రేణులకు హితవు చెబుతూ మర్యాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
రాజకీయ ప్రత్యర్థులైనా, ప్రజా జీవితంలో గౌరవం, మర్యాదలు తప్పనిసరి అని పేర్కొంటూ.. జగన్ పై ఏఐ జనరేటెడ్ వీడియోను సోషల్ మీడియా నుంచి తీసేయమంటూ పార్టీ శ్రేణులను ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు సహా ఎవరూ ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదన్నారు. ఆంధ్రప్రదేశ్ బలోపేతానికి తోడ్పడే నిర్మాణాత్మక రాజకీయాలపైనే మనం దృష్టి పెట్టాలని హితవు పలికారు. దటీజ్ లోకేష్ అనిపించుకున్నారు.