మాక్ అసెంబ్లీ.. ఒరిజినల్ అసెంబ్లీకి మించి!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో బుధవారం విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. అచ్చంగా అసెంబ్లీని తలపించేలా వేసిన సెట్ లో జరిగిన ఈ మాక్ అసెంబ్లీ నిజంగానే అసెంబ్లీ సమావేశం జరుగుతోందా? అనిపించేంత అద్భుతంగా జరిగింది. ఈ మాక్ అసెంబ్లీలో ప్రొటెమ్ స్పీకర్, స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలుగా పిల్లలు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆ కారణంగానే జరుగుతున్నది నిజంగా అసెంబ్లీ సెషనేనా అనిపించింది. ఈ మాక్ అసెంబ్లీకి రాష్ట్రంలోని  175 నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి ఒక విద్యార్థి చొప్పున పరీక్షలు నిర్వహించి ఎంపిక చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఈ మాక్ అసెంబ్లీని స్పీకర్ అయ్యన్న పాత్రులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా తిలకించారు.  

అచ్చంగా అసెంబ్లీలాగే ప్రొటెం స్పీకర్ స్పీకర్ కు బాధ్యతలు అప్పగించడం, ఆ తరువాత ప్రశ్నోత్తరాల సమయం, అలాగే బిల్లులు ప్రవేశపెట్టడం, చివరిగా మాక్ అసెంబ్లీలో విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టడం, మార్షల్స్ రంగ ప్రవేశం అన్నీ ఆకట్టుకున్నాయి. పిల్లలు అసెంబ్లీలో తమతమ పాత్ర లను సమర్ధంగా పోషించడం నిజంగా అబ్బురం. ఒక్క క్షణం నిజమైన ఎమ్మెల్యేల కంటే వీరే మెరుగ్గా చేశారా అనిపించిందని స్వయంగా ముఖ్యమంత్రే అన్నారంటే..మాక్ అసెంబ్లీ ఎంత చక్కగా జరిగిందో అవగతమౌతుంది. ఈ మాక్ అసెంబ్లీని రాష్ట్ర వ్యాప్తంగా   45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu