భూమా లొంగుబాటు

 

నంద్యాల వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పోలీసులకు లొంగిపోయారు. కర్నూలు జిల్లా ఏఎస్సీ సల్ప్రీత్ సింగ్ ఎదుట భూమా నాగిరెడ్డి లొంగిపోయారు. శుక్రవారం నాడు నంద్యాల పురపాలక సంఘం సమావేశంలో తెలుగుదేశం కౌన్సిలర్ల మీద వైసీపీ కౌన్సిలర్లు దాడి చేసి తీవ్రంగా గాయపరచిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలోనే వున్న భూమా నాగిరెడ్డి ప్రేరేపించడం వల్ల ఈ దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ దాడికి సంబంధించి భూమా నాగిరెడ్డి మీద పోలీసులు హత్యాయత్నం కేసుతోపాటు మరో రెండు కేసులను నమోదు చేశారు. భూమా నాగిరెడ్డిని అరెస్టు చేయడానికి ఆయన ఇంటికి వెళ్ళిన పోలీసులకు ఆయన కనిపించలేదు. నిన్నటి నుంచి ఆయన పరారీలో వుండటంతో పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో భూమా నాగిరెడ్డి శనివారం నాడు ఎఎస్పీ ముందు లొంగిపోయారు. ఇదిలా వుండగా, భూమా నాగిరెడ్డి మీద రౌడీ షీట్ తెరిచేందుకు కర్నూలు జిల్లా పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం నాడు నంద్యాల పురపాలక సంఘంలో జరిగిన సంఘటన మొత్తం వీడియో కెమెరాలలో నిక్షిప్తం అయింది. సమావేశంలో భూమా వ్యవహరించిన తీరు ఆధారంగా ఆయనపై రౌడీషీట్ తెరిచే అవకాశం వుందని సమాచారం.