జగనన్న వదిలిన బాణం ఆయనకే గుచ్చుకోబోతుందా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డికి రోజుకొక దెబ్బ తగులుతోంది. అయినవారు..ఆత్మీయులనుకున్నవారు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు. భూమా నాగిరెడ్డి మొదలుకుని సీనియర్లందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. పార్టీలో కీలక కాపు నేత జ్యోతుల నెహ్రూ కూడా జగన్ వైఖరిని తప్పు బడుతూ టీడీపీలోకి వచ్చేసారు. బొబ్బిలి రాజవంశీయులు సుజయ కృష్ణ రంగారావు కూడా పార్టీని వీడారు. అంతేనా? మోస్ట్ సీనియర్ పొలిటిషీయన్..పార్టీలో కురువృద్ధుడైన మైసూరారెడ్డి కూడా వైసీపీని వీడుతూ జగన్‌ తీరును ప్రెస్‌మీట్ పెట్టి మరి కడిగిపారేశారు. కనీస మానవీయ కోణం లేని వ్యక్తిగా ఆయన జగన్‌ను అభివర్ణించారు. ఎంతసేపూ డబ్బు, అధికారం తప్ప జగన్‌లో మరొకటి తాను చూడలేదన్నారు. అలాంటి వ్యక్తి నడుపుతున్న పార్టీలో ఉండటం కన్నా ఆ పార్టీని వీడిపోవడమే మంచిదని మైసూరా ఆవేదన వ్యక్తం చేశారు.

 

అలా మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వదిలి టీడీపీలోకి వచ్చేశారు. ఇప్పుడు మరో 10 మంది ఎమ్మెల్యేల వరకు సైకిలెక్కేందుకు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌కు మరో షాక్ తగలబోతోందని, ఆయన సోదరి షర్మిల కూడా పార్టీ మారబోతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్‌పై సొంత ఎమ్మెల్యేలకే కాదు, ఆఖరికి సోదరి షర్మిలకు కూడా నమ్మకం లేదని ఆమె కూడా పార్టీ మారడం ఖాయమని పల్లె బాంబు పేల్చారు.

 

2014 ఎన్నికల సమయం నుంచి జగన్‌పై తల్లి, చెల్లి అసంతృప్తితో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక జగన్ జైలుకి వెళ్లి పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు షర్మిల తన పాదయాత్రల ద్వారా పార్టీని నిలబెట్టారు. పార్టీ కోసం ఎంతో చేసిన షర్మిల తర్వాత సాధారణ ఎన్నికల్లో కడప లేదా ఖమ్మం ఎంపీ టిక్కెట్టు వస్తుందని ఆశించారు. అయితే ఆమెకు జగన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తర్వాత షర్మిల రాజ్యసభ సీటు ఆశించినా అక్కడా నిరాశ తప్పలేదు. ఆ మధ్య కాలంలో షర్మిల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనే వాదన లేకపోలేదు. ఈ విషయాన్ని వైసీపీ నేతలే తమ అంతరంగీక సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఈ బాణానికి అన్న వైఖరి నచ్చలేదని..అందుకే దూరంగా జరిగిపోయారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చూద్దాం...పల్లె చెప్పింది నిజమవుతుందో..లేదో. ఇప్పటికే అందరూ తనను వదిలి వెళుతున్నా పట్టించుకోని జగన్ ఇప్పడు చెల్లి విషయంలో కూడా తప్పు చేస్తే ఎవరూ లేని ఒంటరివాడుగా మిగిలిపోతాడు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu