దర్శకుడు ఆర్జీవీ సెల్ ఫోన్ స్వాధీనం
posted on Aug 12, 2025 3:17PM

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఆయన సినిమాలు సంచలనం. అద్భుత టేకింగ్ తో తనదైన మేకింగ్ స్టైల్ తో అలనాడు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడూ సంచలనాలు సృష్టిస్తున్నారు. అయితే సినిమాల ద్వారా కాదు.. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, పోస్టుల ద్వారా. అటువంటి పోస్టులకు సంబంధించి ఇప్పుడు కేసులు, విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వ్యూహం' సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్, నారా లోకేశ్ మార్ఫింగ్ ఫొటోలు షేర్ చేసి, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత నవంబర్ లో మద్దిపాడు పీఎస్ లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఆ కేసులో అరెస్టు కాకుండా రామ్ గోపాల్ వర్మకు బెయిలు అయితే మంజూరైంది కానీ, పోలీసు విచా రణకు వారు పిలిచినప్పుడల్లా వెళ్లాలన్న షరతు విధిస్తూ కోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటికే ఒక సారి పోలీసు విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మ.. పోలీసుల నోటీసుల మేరకు మంగళవారం (ఆగస్టు 12) మరోసారి ప్రకాశం జిల్లా ఓ:గోలు తాలూకా పోలీసు స్టేషన్ లో హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు రామ్ గోపాల్ వర్మ పోన్ ను సీజ్ చేశారు. వాస్తవానికి గతంలో ఆయన విచారణకు హాజరైన సందర్భంలోనే ఆయన పోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవలసింది. అయితే అప్పట్లో ఆయన విచారణకు ఫోన్ తీసుకురాకపోవడం వల్ల పోలీసులు ఆయన ఫోన్ ను సీజ్ చేయలేకపోయారు.
అయితే ఈ సారి ఫోన్ తీసుకురావాలని నోటీసులలోనే పేర్కొన్న పోలీసులు ఆయన నుంి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులోని సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఉండగా జగన్ హయాంలో రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్ సహా తెలుగుదేశం, జనసేన నేతలపై అనుచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ పొటోలతో నిత్యం వార్తలలో నిలిచారు. ఇప్పుడు ఆ పోస్టింగులకు సంబంధించిన కేసులలోనే పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు.