మృగశిరకార్తెతో జర జాగ్రత్త!

రోహిణీలో రొకళ్ళు పగిలితే మృగశిరలో ముంగిళ్ళు తడుస్తాయి అనే మాట అందరూ వినే వుంటారు.  వైశాఖం, జైష్టంలలో వేసవి విసురుల నుండి ఆషాడంలో కురిసే వర్షాలు కొత్త ఉపిరిని ఇస్తాయి. మృగశిర కార్తె తో మొదలయ్యే వర్షాల సందడితో వ్యవసాయదారులు కూడా బిజీ అయిపోతారు. అయితే వ్యవసాయాన్ని మినహాయించి చూస్తే మృగశిర కార్తె కు ఒక ప్రత్యేకత ఉంది. అదే చేపలు.

మృగశిర కార్తె వచ్చిందంటే చేపల కొనుగోళ్ళు ఊపందుకుంటాయి. ప్రతి ఇంట్లో చేపలతో చేసే వంటకాలు ఘుమఘుమలాడుతూ ఉంటాయి. అన్ని మాసాలలో, అన్ని కార్తెలలో లేని ఈ చేపల ఆచారం మృగశిర కార్తెలో ఎందుకొచ్చినట్టూ?

చేప రహస్యం!

ఇదేమీ చేపలో ఉండే రహస్యం కాదు. చేపలు తినడం వెనుక రహస్యం గురించే ఇక్కడ విషయం. అందరూ చెప్పుకునేదాని ప్రకారం వేసవిలో ఉష్ణోగ్రతల మధ్య నుండి ఒక్కసారిగా మృగశిరలోకి ఎంటర్ అవ్వగానే వర్షాలు, గాలులు చల్లని వాతావరణం వల్ల శరీరానికి ఒకానొక అసౌకర్యం ఏర్పడుతుంది. వాతావరణానికి ప్రభావితమై శరీరం జబ్బులకు లోనవుతుంది. అలాంటి పరిస్థితులను అధిగమించాలనే చేపలు తింటారు. సాధారణంగా ఇలాంటి వాతావరణానికి ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు చేపమందు పంపిణీ చేయడం అందరూ చూస్తూనే ఉంటారు. ఇలా మృగశిర కార్తెలో చేపలు తినడం వెనుక కూడా అలాంటి ఆరోగ్యకర కారణమే ఉంది. 

ఇక చేపలలో  కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజ పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి మాత్రమే కాకుండా  లైసిన్, మిథియోనిన్, ఐసాల్యూసిన్ వంటి ఆమ్లోనో ఆమ్లాలు పుష్కలంగా ఇందులో లభిస్తాయి. థయామిన్‌, రైబోప్లవిన్‌, నియాసిన్‌, పెరిడాక్సిన్‌, బయోటిన్‌, పెంటోదినిక్‌ ఆమ్లం, బీ 12 వంటి విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్ఏ , ఈపీఏ వంటివి కంటి చూపు మెరుగ్గా ఉండేలా చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. చేపల్లో ట్రై గ్లిసరైడ్స్‌ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది శరీర రక్త పీడనంపై ముఖ్యంగా గుండెపై మంచి ప్రభావం చూపుతుంది. గుండె జబ్బు, అస్తమా వ్యాధిగ్రస్తులు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే చాలా మంచిది.

నమ్మకమే వ్యాపారం!

కొన్ని నమ్మకాలు వ్యాపారాలను నడిపిస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలు తినాలి అనే నమ్మకమే దీనికి పెద్ద ఉదాహరణ. అలాగని ఇదేమీ మూఢనమ్మకం కాదు ఈ సీజన్ ను అనుసరించి చేపలు తినడం మంచిదే. అయితే ఖచ్చితంగా ప్రారంభం రోజే తినాలనేది కొంచెం అతినమ్మకమే. కానీ ఈ సీజన్ లో వీలును బట్టి చేపలు తినడం అనేది ఉత్తమమైన మార్గం.

మరి శాఖాహారుల సంగతేంటో!

చేపల్ని పట్టేవాళ్ళు, ముట్టేవాళ్ళు, తినేవాళ్ళు సరే. మరి శాఖాహారులు ఉంటారు వాళ్లకు అనారోగ్య సమస్యలు రావా?? వాళ్లకు రోగనిరోధకశక్తిని పెంచుకునే మార్గం ఏంటి అనే ఆలోచన కనుక వస్తే దానికి కూడా పరిష్కారం చూపించారు మన పెద్దలు.

శాకాహారులు బెల్లం, ఇంగువ రెండూ కలిపి దంచి చిన్న గోళీల్లా తయారుచేసి వాటిని తింటారు. బెల్లం స్వతహాగా వేడి చేసి గుణం కలిగి ఉంటుంది. ఇక ఇంగువకు ఆహారాన్ని జీర్ణం చేసే సామర్థ్యము ఎక్కువ. జీర్ణసంబంధ సమస్యలను చక్కగా పరిష్కరిస్తుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల పరిష్కారం దొరికినట్టె, శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.

పురాణ కథ!

ప్రతి విషయానికి ఒక పురాణ కథ ఉండటం గమనిస్తూ ఉంటాం.  ముఖ్యంగా ఆచారం ప్రకారం వచ్చే కొన్ని సందర్భాలకు ఇవి బలాన్ని చేకూర్చుతూ ఉంటాయి. మృగశిరకార్తె కు కూడా అలాంటి ఒక కథ ఉంది. 

పురాణ కథ ప్రకారం మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అనే వృతాసురుడు తనకున్న వరం ప్రభావం వల్ల పశువులను, పంటలను నాశనం వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం, వర్షాలకు అడ్డుపడటం చేసేవాడు. అతనికున్న వరాల వల్ల  అతనిలో అహంకారం ఇంకా ఎక్కువగా ఉండేది. బాగా ఆలోచించిన ఇంద్రుడు సముద్ర అలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి ఆ వృతాసురుడిని చంపేస్తాడు. ఇదీ కథ. అప్పుడు ప్రకృతి మార్పు ప్రభావం ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు వైపు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తెను అందరూ ప్రత్యేకంగా జరుపుకుంటారు.

ఇదీ పురాణ పరంగానూ, ఆరోగ్య పరంగానూ మృగశిరకార్తె వెనుక ఉన్న అసలైన విషయం!!

◆వెంకటేష్ పువ్వాడ.