తగ్గేదేలేదంటున్న తాతగారు!

50 ఏళ్ళు దాటిందంటే ఇక వాళ్ళ పని ఖతం, హాయిగా తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, విశ్రాంత జీవితంలోకి మెల్లిగా జారుకుంటారు ప్రతి ఒక్కరూ. అయితే ఒక తాతయ్య మాత్రం తగ్గేదెలేదంటున్నారు. ఇంతకూ ఏ విషయంలో అనే సందేహం వస్తే మనం టోక్యో కబుర్లలోకి వెళ్లిపోవాలి. 

జపాన్ కు చెందిన కెనెచీ హోరీ అనే తాతయ్య వయసు అక్షరాలా 83 సంవత్సరాలు. ఇదేమీ పెద్ద నెంబర్ కాదులే భారతదేశంలో వందేళ్లు దాటిన తాతలు బామ్మలు పుష్కలంగా ఉంటారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మరైతే ఈ హోరీ తాతయ్య ప్రత్యేకత ఏమిటంటా అనే డౌట్ వస్తే తెలుసుకునేయ్యాలి ఇక.

హోరీ తాతయ్య వయసు ప్రస్తుతం 83 సంవత్సరాలు. ఈయన జపాన్ కు చెందినవాడు. సముద్రప్రయాణాలు అంటే ఈయనకు అదొక పిచ్చె అనుకోవచ్చు. ఎప్పుడో 23 సంవత్సరాల వయసులో అంటే 1962లో ఈయన సముద్రాలలో అతిపెద్దది అయిన  జపాన్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వరకు విస్తరించిన పసిఫిక్ మహాసముద్రం ప్రయాణం మొత్తం ఒక్కడే పూర్తి చేశాడు. 23 సంవత్సరాల ఉత్సాహమున్న వయసులో అలాంయి సాహసాలు చేయడం పెద్ద వింతేమీ కాదు అనిపించవచ్చు కానీ ఇప్పుడు  మళ్లీ దాన్ని రిక్రియేట్ చేయడం మాత్రం అద్బుతమే కదా!!

ఇప్పుడేంటి విషయం?

83 సంవత్సరాల వయసులో ఈ హోరీ తాతయ్యకు బోర్ కొట్టిందో ఊరికే ఉండటం నచ్చలేదో మొత్తానికి తన గత ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ శాన్ ఫ్రాన్సిస్కో నుండి కేవలం ఆరు మీటర్ల పొడవు ఉన్న చిన్న పడవలో ప్రయాణం మొదలుపెట్టి జపాన్ తీరంలో ఉన్న కీ జలసంధికి చేరుకున్నాడు. ఇదంతా 69 రోజులపాటు, 8500 కిలోమీటర్ల ప్రయాణం కావడం గమనార్హం. పెరిగే బిపిలు, పడిపోయే ఉష్ణోగ్రతలు, ఎండ, గాలి, వాన వంటి వాటిని భరిస్తూ 83 సంవత్సరాల వయసులో ఇంత సాహసం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం కదా. ప్రపంచంలో ఈ సముద్ర ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు తెచ్చేసుకున్నాడు హోరీ తాతయ్య.

80 వయసు దాటగానే కంటి చూపు మందగించడం, వినికిడి లోపం రావడం, నీరసం, శరీరంలో ఇబ్బందులు వంటి సమస్యలు అటాక్ అయ్యే పరిస్థితులలో ఒక్కడే ఇంత చేయడం నిజంగా తగ్గేదేలే అని అందరికీ చెప్పినట్టు లేదు.

హోరీ తాతయ్య మాత్రం "నా 23 సంవత్సరాల వయసులో నాకు పాస్పోర్ట్ లాంటివి లేకపోయినా కుతూహలం కొద్దీ దొంగగా ప్రయాణం చేసాను. అయినా కూడా అప్పుడు నేను చేసింది సాహసం కాబట్టి అందరూ నన్ను క్షమించేసి నా సాహాసాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమీ లేవు.ప్రయాణంలో కూడా కుటుంబసభ్యులతో కాంటాక్ట్ లో ఉన్నాను ఫోన్ ద్వారా అని చెప్పారు.

ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే హోరీ తాతయ్య 1974 సంవత్సరంలో సముద్రమార్గ ప్రయాణంలో ఏకంగా ప్రపంచాన్నే చుట్టేసాడు. అందుకే హోరీ తాతయ్య సూపరో సూపర్!!

◆వెంకటేష్ పువ్వాడ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu