శ్రీవారి సొమ్ము కొట్టేసే స్కెచ్?  స్పెసిఫైడ్‌ అథారిటీపై రఘురామ సంచలనం.. 

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి గడువు  జూన్ 20తో ముగిసింది. కొత్త పాలకమండలిని నియమించని ప్రభుత్వం..  స్పెసిఫైడ్‌ అథారిటీని నియమించింది. ఈవో, అదనపు ఈవోలతో ఆ అథారిటీని ఏర్పాటు చేసింది. కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే వరకు టీడీపీ వ్యవహారాలన్ని స్పెసిఫైడ్‌ అథారిటీనే చూస్తుందని ప్రకటించింది. అయితే ప్రభుత్వం నియమించిన  స్పెసిఫైడ్‌ అథారిటీపై అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. 

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఎంపీ రఘురామ నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో మరో  లేఖ రాశారు. తిరుమలలో స్పెసిఫైడ్‌ అథారిటీ పేరుతో కొత్త వివాదానికి తెరతీశారని అందులో ఆరోపించారు. చట్టాన్ని అపహాస్యం చేసేలా 126 జీవో తెచ్చారన్నారు ఎంపీ రఘురామ. పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటుపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికే జీవో అంటూ ఆందోళన వ్యక్తమవుతోందని రఘురామ చెప్పారు. హిందూ ధర్మాన్ని ఆచరించే పలువురి నమ్మకాలను గాయపరుస్తున్నారని తెలిపారు.

ఇద్దరు సభ్యులతో అథారిటీ ఏర్పాటు చేస్తే నిర్ణయాలపై చర్చకు వీలుండదన్నారు నర్సాపురం ఎంపీ. ట్రస్టు బోర్డు అధికారాలను అథారిటీకి బదిలీ చేసినట్లు అర్థమవుతోందని చెప్పారు. కొత్త స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటుపై ఎవరికీ నమ్మకం కలగట్లేదన్నారు. శ్రీవారి సొమ్ము దారి తప్పిస్తారేమోనన్న ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. అథారిటీ ఆర్థిక విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని తీసేయాలన్నారు. కొత్త బోర్డు ఏర్పడ్డాకే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. కాలయాపన చేయకుండా నూతన బోర్డు ఏర్పాటు చేయాలని తన లేఖలో సీఎం జగన్ ను కోరారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu