ఎవరెస్ట్‌పై పాదం మోపిన నవ్యాంధ్ర తొలి మహిళ..
posted on May 24, 2016 4:27PM

ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించడమంటే మామూలు విషయం కాదు. అందుకు ఎన్నో వ్యయ ప్రయాసల్ని ఎదుర్కొవాలి. వాటన్నింటిని తట్టుకుని ఒక తెలుగు వనిత ఎవరెస్ట్‌ను అధిరోహించింది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెనికి చెందిన నీలిమ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు చిన్ననాటి నుంచి సాహసాలంటే ప్రాణం. ఎప్పటికైనా ఎవరెస్ట్ ఎక్కడమే తన లక్ష్యమని సన్నిహితులతో చెప్పేది. దీనిలో భాగంగా ఎవరెస్ట్ అధిరోహించాలని గత ఏడాది ఏప్రిల్‌లో ప్రయత్నించింది. అయితే నేపాల్‌లో భూకంపం సంభవించడంతో వెనక్కి వచ్చేసింది. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా మళ్లీ తన ప్రయత్నాలను ప్రారంభించి మరోసారి ఎవరెస్ట్ అధిరోహించేందుకు వెళ్లి ఈ సారి విజయం సాధించింది. దీంతో నవ్యాంధ్రప్రదేశ్ నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన తొలి మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కింది.