చనిపోయిన భార్య- టీవీలో కనిపించింది
posted on Mar 12, 2016 2:57PM
.png)
మొరాకో దేశంలో నివసించే అబ్రగ్ మొహమ్మద్ భార్య రెండేళ్ల క్రితం ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రిలో చేర్చిన అబ్రగ్, వైద్యానికి అయ్యే ఖర్చులను పోగేసుకుని ఆసుపత్రికి చేరుకునేసరికి, భార్య చనిపోయిందని చెప్పారు వైద్యులు. చెప్పడమే కాదు, అతని భార్యదేనంటూ ఓ శవపేటికను కూడా అందించారు. అబ్రక్ దానిని తన సొంత ఊరికి తీసుకువెళ్లి సమాధి చేసేశాడు కూడా! కానీ ఈమధ్య ఓ టీవీ కార్యక్రమంలో తన భార్య కనిపించడంతో అబ్రగ్‌కి మతిపోయింది. తప్పిపోయినవారిని తిరిగి తమ బంధువుల దగ్గరకు చేర్చే ఆ కార్యక్రమంలో, తాను రెండేళ్ల క్రితం తన భర్త నుంచి దూరమయ్యానంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి భార్యాభర్తలు ఇద్దరూ ఓ చోటకి చేరినప్పటికీ... రెండేళ్ల క్రితం ఏం జరిగి ఉంటుందన్నది మాత్రం ఓ మిస్టరీగా మిగిలిపోయింది. అన్నింటికీ మించి అబ్రగ్ పాతిపెట్టిన శవం ఎవరిదంటూ ఇప్పుడు పరిశోధన మొదలైంది.