దావూద్ ఇబ్రహీంపై కంటే జగన్ పైనే ఎక్కువ క్రిమినల్ కేసులు!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోలాహ‌లం తార స్థాయికి చేరింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు  వేగంగా మారుతున్నాయి. గ‌త ఐదేళ్ల జ‌గ‌న్  పాల‌న‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు ఓటు ద్వారా జగన్ సర్కార్ కు బుద్ధి చెప్పేందుకు రెడీ అయిపోయారు.  ఇదే విషయాన్ని ప‌లు  స‌ర్వేలు  వెల్ల‌డించాయి. 2 024 ఎన్నిక‌ల్లో తెలుగుదేం కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని, జ‌గ‌న్  పార్టీకి ఘోర పరాజయం తప్పదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌తంలో కోడిక‌త్తి డ్రామా త‌ర‌హా ప్ర‌యోగాల‌కు జ‌గ‌న్ మ‌ళ్లీ తెర‌పైకి తేబోతున్న‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.   మూడు రోజుల కిందట జ‌గ‌న్‌పై జరిగిన గులక రాయి దాడి ఘ‌ట‌న ఇందులో భాగ‌మేన‌ని కూట‌మి నేత‌లు ఆరోపిస్తున్నారు.  గ‌త ఎన్నికల ముందు జరిగిన  కోడి క‌త్తి, వివేకానంద రెడ్డి హ‌త్య‌  జగన్ పై సానుభూతి వెల్లువెత్తి ఆయన పార్టీ  భారీ మెజార్టీతో అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. తాజాగా అదే త‌ర‌హా ప్ర‌యోగాల‌తో ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంది మ‌రోసారి అధికార పీఠం దక్కించుకునేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతున్నది.  

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్రిమిన‌ల్ మైండ్ తో మ‌ళ్లీ వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పైకి న‌వ్వుతూ క‌నిపించినా.. ప్ర‌తీ విష‌యాన్ని క్రిమిన‌ల్ మైండ్ తో ఆలోచిస్తారని, ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా గ‌త ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేనని అంటున్నారు. దీనికితోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల అఫిడ‌విడ్ ను చూస్తే ఆయ‌న నేర సామ్రాజ్యం క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంద‌ని అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా పులివెందుల ఎమ్మెల్యేగా  ఏప్రిల్ 22న సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన నామినేషన్ వేయడానికి ముందే ఆయన నేరారోపణలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2019 ఎన్నిక‌ల్లో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ ను రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి, మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు త‌న‌ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఎన్నిక‌ల‌ అఫిడవిట్ ప్రకారం సీఎం జ‌గ‌న్‌పై మొత్తం 146   కేసులు ఉన్నాయి.   38 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.  వీటిలో 21 కేసులు 2011 సంవత్సరానికి చెందినవి. 13 ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి విచారణ లేకుండా అన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే దేశంలోనే డాన్ గా పేరు పొంది విదేశాల‌కు పారిపోయిన దావూద్ ఇబ్ర‌హీం పైనకూడా జ‌గ‌న్ పై ఉన్న‌న్ని క్రిమినల్ లేవని అంటున్నారు.  దావూద్ ఇబ్రహీం విదేశాల‌కు పారిపోకుండా రాజకీయాల్లో చేరిఉంటే, అతను ఖచ్చితంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడనీ. అధికార అండతో కేసులు విచారణ వరకూ రాకుండా పెండింగ్ లో ఉంచుకోగలిగేవారనీ నాగేశ్వరరావు పోస్టుపై నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు  జగన్ మోహన్ రెడ్డి తనపై నమోదై ఉన్న ఏ కేసూ విచారణకు రాకుండా మేనేజ్ చేస్తున్న విధానం చూస్తే అలాగే అనిపిస్తోందని అంటున్నారు. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో మొత్తం 2011 మంది అభ్యర్థులు పోటీ చేయగా..వారిలో 334 మంది అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపర్చారు. ఇక 222 మంది అభ్యర్థులు తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు మొత్తం 96 మంది ఎన్నికల్లో విజయం సాధించారు. అంటే క్రిమినల్ కేసులున్న 55శాతం మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇక తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో 55 మంది అభ్యర్థులు చట్టసభల్లోకి అడుగు పెట్టగలిగారు. ఓ సంస్థ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొంటున్న 55 మంది ఎమ్మెల్యేల్లో అధికారిక వైసీపీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. ఇక తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్న వారిలో సీఎం జగన్ ముందు వరుసలో ఉన్నారు. క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రభుత్వాన్ని నడపడం అనే అంశంపై పార్లమెంటులో చర్చ పెట్టాలని గ‌తంలో నేత‌లు డిమాండ్ చేశారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల వేళ గత ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి  సమర్పించిన ఎన్నికల అఫిడవిడ్  సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.