ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వానా!

వారం రోజులు ఆలస్యం అయితే అయ్యింది కానీ ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. దీంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వారం లోగా రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలలో ప్రవేశించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.   ఈ ఏడాది రుతుపవనాల రాక  ఆలస్యం కావడంతో ఆ ప్రభావం వ్యవసాయం మీద ఉంటుందని రైతులు అంటున్నారు. ఇక ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో రానున్న రెండు రోజులలో అవి కర్నాటక, తమిళనాడులకు చేరుతాయని అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే ఈ లోగానే అంటే మరో మూడు రోజులలో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.   అయితే అంత వరకూ తెలుగు రాష్ట్రాలలో  ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.  

నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, అయితే దక్షిణ చత్తీస్ గఢ్ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడటంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందనీ, ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.