వానలు వచ్చేస్తున్నాయి

ఒక శుభవార్త ... సూర్యభగవానుడు  శాంతిస్తున్నాడు. రోళ్ళు పగల గొట్టే రోహిణి కార్తే  ఎండల్లో మలమల మాడిపోతున్న, మనకు, భారత వాతావరణశాఖ (ఐఎండి) ఒక చల్లని కబురు మోసుకొచ్చింది. నైరుతి ఋతుపవనాలు ఈ వారం కేరళను తాకనున్నాయని ఐఎండి  తెలిపింది. రాబోయే ఒకటి రెండు రోజుల్లో కేరళ మీదుగా దేశంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని పేర్కొంది. మే 30న కేరళకు చేరుకోవచ్చని వెల్లడించింది. 
నిజానికి, ఇంకా ముందే మే 27 నాటికే  ఋతుపవనాలు కేరళ ప్రధాన భూభాగాన్ని తాకనున్నాయని గతంలో ఐఎండి తెలిపింది. అయితే ఐఎండి లెక్క కొద్దిగా తప్పింది.. ఋతుపవనాల రాక మూడు రోజులు వెనక్కి వెళ్ళింది. అయితే ఈసారి లెక్క తప్పదని, ఐఎండి అధికారులు విశ్వాసం వ్యక్తపరుస్తుననారు. సాధారణంగా జూన్ 1న నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. ఇక అక్కడి ఋతుపవనాలు ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాయి.

అదలా ఉంటే, వాతావరణ శాఖ మరో చల్లని కబురు కూడా చెప్పింది, పశ్చిమ, నైరుతి గాలుల ద్రోణి ప్రభావంతో రానున్న రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ సిక్కింలో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ వర్షాల ప్రభావంతో ఈసారి ఋతుపవనాలు వేగంగా విస్తరిస్తాయని  వాతావరణ శాఖ  తెలిపింది. 

ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం.. మే 30, 31వ తేదీల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 1న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో మే 29 నుంచి జూన్ 1 వరకు వానలు కురుస్తాయి. ఈఏ సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు కూడా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరూ ముందుగా చెప్పలేరన్న సామెత ఉండనే వుంది. చూద్దాం.