జగన్ పై ‘చంద్ర’ నిప్పులు.. జగన్ ను ఇంటికి పంపే సమయం వచ్చేసింది!

మహానాడు ముగింపు సభలో చంద్రబాబు భావోద్వేగంతో ప్రసంగించారు. జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. మూడేళ్ల జగన్ పాలనలో వైఫల్యాలను వివరించారు. ప్రజలూ కార్యకర్తలే తనకు హైకమాండ్ అని పునరుద్ఘాటించారు. జగన్ పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం సంతోషంగా లేదనీ, ఏ వర్గానికీ మేలు జరగలేదనీ, రాష్ట్ర ప్రజలందరూ అసహనంతో, అభద్రతతో ఉన్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సర్వ వ్యవస్థలూ నిర్వీరం చేసిన జగన్ కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేసిందన్నారు. జగన్ ను ఇంటికి పంపే సమయం వచ్చేసిందంటూ  మహానాడు బహిరంగ సభ వేదికగా చంద్రబాబు ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.

తెలుగుదేశం వైపు జనాలు ఉంటే, వైసీపీకి బస్సులే మిగిలాయని సెటైర్లు వేశారు. సభలో జనం ఉత్సాహం చూస్తుంటే.. ఇప్పటికిప్పుడే జగన్ ను గద్దె దించేయాలన్నంత ఊపులో ఉన్నట్లు కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. ఇంత మంది జనం వస్తే బందోబస్తుకు ఒక్క పోలీసు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు అదుపు తప్పారనీ,వారిని తెలుగుదేశం సరిచేస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. మహానాడుకు వచ్చిన జనసందోహాన్ని చూసి జగన్ కు పిచ్చెక్కడం ఖాయమన్నారు.

వైసీపీ సభలు వెలవెల బోతుంటే, తెలుగుదేశం సభలు కళకళలాడటమే రాష్ట్రంలో జగన్ పాలనకు చివరి రోజులు వచ్చాయనడానికి తార్కానమని పేర్కొన్నారు. ఒంగోలులో రెండు రోజుల పాటు జరిగిన తెలుగుదేశం మహానాడుకు జనం పసుపు సంద్రంగా మారి పొటెత్తారు. బహిరంగ సభకు ఐదు లక్షల మందికి పైగా హాజరయ్యారన్నది ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక.  ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా, అన్నిటినీ అధిగమించి తెలుగుదేశం శ్రేణులు ఒంగోలుకు చేరుకున్నారు.

దూర ప్రాంతాల నుంచి కూడా మోటార్ సైకిళ్లు, కార్లు, లారీలు, ట్రాక్టర్లు ఇలా ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో ఒంగోలు బాట పట్టారు. రాష్ట్రం నలుమూల నుంచీ ఒంగోలు వైపు బయలు దేరిన వాహనాల ర్యాలీలో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. శుక్ర, శని వారాలు ఒంగోలులో మహానాడు జరిగింది. గురువారం నుంచే ఏపీ రహదారులపై పసుపు వనాల ప్రవాహం మొదలైంది.

మహానాడు ముగింపు సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు జగన్ పై చంద్ర నిప్పులు చెరిగారు. ఈ మూడేళ్లలో జగన్ సర్కార్ తప్పిదాలన్నిటికీ ఒక్కటొక్కటిగా పేర్కొంటూ ఇదా పాలన అంటూ విమర్శలు గుప్పించారు. సినిమా ప్రదర్శనకు నీ అనుమతి కావాలా? రేపు అధికారంలోకి వచ్చాకా, నీ పేపర్ కు నేను అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది కబడ్దార్ అని హెచ్చరించారు. బాలకృష్ణ సినిమాకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని చంద్రబాబు గుర్తు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే జనం ఊరుకోరని చంద్రబాబు హెచ్చరించారు. ముందు గడపగడపకూ  వైసీపీ అన్నారు. జనం తిరగబడతారన్న భయంతో ప్రభుత్వ అధికారుల అండ, పోలీసు బందోబస్తుతో నిర్వహించుకోవచ్చని గడప గడపకూ ప్రభుత్వం అన్నారు. అయినా ప్రజల నిరసన సెగలను తట్టుకోలేక ఆ కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. సామాజిక న్యాయ భేరి అంటూ మంత్రల బస్సు యాత్రలు పెట్టుకున్నారు. ఇంకేం చేస్తారు గాలి యాత్రలు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు.

జగన్ సర్కార్ బాదుడే బాదుడుపై చంద్రబాబు విమర్శలకు జనం నుంచి భారీ స్పందన వచ్చింది. విద్యుత్ చార్జీలు పెరిగాయా లేదా? కరెంటు కోతలు రాష్ట్రాన్ని అంధకారంగా మిగిల్చేశాయా లేదా?, కూరగాయల ధరలు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి ఉందా? అంటూ చంద్రబాబు వేసిన ప్రశ్నలకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రశ్నిస్తే కేసులు పెట్టారు, తెలుగుదేశం భయపడలేదు అన్నారు. ఈ మూడేళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలను ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిందనీ, అన్నిటినీ తట్టుకుని, ఎదిరించి నిలబడిన సత్తా తెలుగుదేశం పార్టీదని చంద్రబాబు అన్నారు.  జగన్ పథకాలన్నీ బూటకమన్నారు. అమ్మ ఒడి అంటూ ఆ సొమ్ములన్నీ నాన్న బుడ్డితో లాగేశారని విమర్శించారు.తెలుగుదేశం హయాంలో సంక్షేమం కోసం 50శాతం నిధులు ఖర్చు చేస్తే, వైసీపీ హయాంలో వాటన్నిటినీ రద్దు చేసి సంక్షోభం మిగిల్చిందని దుయ్య బట్టారు. అన్న క్యాంటిన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.

చంద్రన్న బీమా ఎందుకు ఆపేశారని నిలదీశారు. సంక్షేమం లేకుండా, పథకాలు అమలు చేయకుండా రాష్ట్ంలో అప్పులు 8 లక్షల కోట్లకు చేరుకున్నాయన్నారు. ఈ అప్పులన్నీ జగన్ తీరుస్తాడా అంటూ నిప్పులు చెరిగారు. మద్యపాన నిషేధం అంటూ.. మద్యం బ్రాండ విషయంలో కూడా జగన్ మాయ చేశాడనీ, రాష్ట్రంలో జే బ్రాండ్ తప్ప మరో బ్రాండ్ మద్యం దొరకని పరిస్థితి తీసుకువచ్చారు. అదీ చవకరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయించి సొమ్ములు దోచుకున్నారని దుయ్యబట్టారు.
మద్యం సీసాకు ప్రభుత్వం కంపెనీకి తొమ్మది రూపాయలు చెల్లించేది...ఇప్పుడు ఇరవై ఒక్క రూపాయాలు చెల్లిస్తున్నారు.
 అది కూడా నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నారు. ఏ షాప్ లోను బిల్లు ఇవ్వడం లేదు. ఆన్లైన్ పేమెంట్  తీసుకోవడం లేదు. మద్యం అమ్మకాల ద్వారా జగన్ ఏడాదికి 5 వేల కోట్లు సొంత ఖాతాలో వేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుక 6 వేలు 7 వేలు ఎందుకు అయ్యింది.

మూడేళ్లలో సిఎం జగన్ అక్రమార్జన 1 లక్షా 75వేల కోట్ల రూపాయలు.    జగన్ పాలనతో అన్ని శాఖలు నాశనం అయ్యాయి.
సర్వ వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయి. ధాన్యం డబ్బు రైతులకు ఎందుకు రాలేదు. అంటూ చంద్రబాబు సంధించిన విమర్శనాస్త్రాలకు జనం నుంచి భారీ స్పందన వచ్చింది.  వైసిపిని బంగాళా ఖాతంలో కలిపెయ్యాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. జగన్ దావోస్ పర్యటనపైనా చంద్రబాబు నిప్పులు చెరిగారు.గతంలో నేను ఒప్పందం   అదానీ, గ్రీన్ కో వాళ్లతో దావోస్ లో జగన్ కొత్తగా ఒప్పందం చేసుకున్నారు.      అదానీ, గ్రీన్ కో కోసం దావోస్ వరకు వెళ్లాలా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే మూడేళ్ల జగన్ పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు.