ఏపీ అప్పులపై కేంద్రం నజర్.. జగన్ సర్కార్ కు చిక్కులు తప్పవా?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకు పోయింది.ఇది అందరికీ తెలిసిన నిజం.అయినా ఎడాపెడా కొత్త అప్పులు చేస్తూనే ఉంది. ఆలాగే, అప్పుల వేటలో  ఏపీ ప్రభుత్వం  తప్పులు చేస్తోంది. చట్టాలను ఉల్లంఘిస్తోంది. ఓ వంక రిజర్వు బ్యాంక్ వద్ద బాండ్ల వేలం ద్వారా వారంవారం తెచ్చిన అప్పులను మాత్రమే పద్దులో చూపించి, ఇతరత్రా కార్పొరేషన్ ద్వారా తెచ్చిన వేలకోట్ల అప్పులను దాచేసినా , రాష్ట్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఎప్పుడోనే  దాటిపోయింది.అయినా దర్జా చట్టాలను ఉల్లంగించి అప్పుల వేట కొనసాగిస్తోంది. 

రాష్ట్ర ప్రభుత్వాల అప్పులను అదుపులో ఉంచి ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా చేయడం కోసం, తద్వారా ద్రవ్య లోటును అదుపు చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం 2003లో ఎఫ్‌ఆర్‌బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) చట్టం చేసింది. ఎఫ్‌బీఎం చట్టాల ప్రకారం, ప్రభుత్వాలు రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే జీఎస్‌డీపీలో 4శాతం రుణాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల కరోనా పరిస్థితులు, వివిధ సంస్కరణల అమలు వంటివి చేయడం వల్ల కొంత మేర వరకూ అదనపు రుణాలు తీసుకోవచ్చు. కానీ అది పూర్తిగా ఒక  శాతం కూడా ఉండదని, అర శాతం.. పావు శాతం వరకే ఉంటుదాని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.అయితే అవును ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం 4 శాతం దాటకూడని,కానీ ఇప్పుడు, రుణాలు 11 శాతం దాటాయని నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసన సభకు తెలిపారు. ఈ మేరకు ఆయన సభలో ప్రకటన చేశారు. అంతేకాదు, “ఏకంగా ఏడు శాతం పెరిగిన రుణ పరిమితి పై కేంద్రం నోటీసులు పంపుతుంది. వివరణ ఇస్తాం..." అంటూ ఆయన ధీమాగా చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు, భువనేశ్వరికి వల్లభనేని వంశీ క్షమాపణలు..

ఆర్థికమంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలు ఆర్థిక నిపుణుల్లో చర్చనీయాంశం అయ్యాయి.  ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఎంతో కాలంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్ననేపధ్యంలో,బుగ్గన చేసిన వ్యాక్యాలు ఆర్థిక నిపుణుల్లో మరిన్ని అనుమానాలకు ఆస్కారం కల్పించాయి. ముక్కున వేలేసుకునేలా చేశాయి.నిజానికి  రాష్ట్ర ప్రభుత్వం ఏ లెక్కల్లోనూ చూపని అప్పులు మరో రూ.82 వేల కోట్ల వరకు ఉంటాయని ఆర్థిక నిపుణులు, అధికారులు అంటున్నారు.ఈ లెక్కన చూస్తే,  ఆర్థిక  పరిస్థితి దివాలా అంచున కాదు, లోతుల్లోకి జారిపోయింది. ఇక కోలుకోవడం కూడా కష్టమనే స్థాయికి చేరింది. అయినా, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వేట మానలేదు. నిజానికి ఇప్పుడు అప్పులు చేయక పొతే,పూట కాదు ఘడియ కూడా గడిచే పరిస్థితి లేదు.  

భారతీయ  రిజర్వు బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం అదుపుతప్పిన ఏపీ ఆర్థిక పరిస్థితిని కట్టడి చేసేందుకు ఉద్రిక్త మవుతున్నాయి. అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇటీవల భారీ షాక్‌ ఇచ్చింది. మొన్నటికి మొన్న ఏపీకి రావాల్సిన రూ.3,470 కోట్లను ఓవర్‌డ్రాఫ్ట్‌ బకాయిల కింద ఆర్బీఐ జమ చేసుకుంది.అలాగే, గత ఆర్థిక సంవత్సరంలో అప్పుల లెక్కలు దాచిపెట్టి  పరిమితికి మించి అప్పులు చేశారని ఈ ఏడాది రుణ పరిమితిలో కేంద్రం కోత విధించింది. అయితే ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేసుకుని అదనపు రుణాలకు పర్మిషన్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో త్వరలో ఇక అప్పులు చేయకుండా కేంద్రం పూర్తి స్థాయిలో కట్టడి చేస్తే ప్రభుత్వం నడవడం కష్టమైపోతుందని ఆర్థిక శాఖ  ధికారులు హెచ్చరిస్తున్నారు.  నెలకు రూ. పది వేల కోట్లు అప్పులు చేస్తే తప్ప.. ఇప్పటి వరకూ చేసిన అప్పులకు వడ్డీలు, జీతాలు ఇతర ఖర్చులకు సరిపోవడం లేదన్న లెక్కలు బయటకు వస్తున్నాయి. 

ఈ నేపధ్యంలో వైసీపీ తిరుగుబాటు ఎంపీ, రఘురామ కృష్ణం రాజు  లోక్  సభలో ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఉల్లంఘిస్తోందని, ఈ కారణంగా దివాలా తీయకుండా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ పరిమితికి మించి ఇప్పటికే ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల రుణాలు తీసుకుందని, ఇప్పుడు మరో రూ.లక్ష కోట్ల అప్పు చేయడానికి ప్రయత్నస్తున్నదని వివరించారు. పరిమితికి మించి రాష్ట్రాలు అప్పులు చేయడం రాజ్యాంగంలోని 293వ అధికరణను ఉల్లంఘించడమేని పేర్కొన్నారు. రుణ పరిమితిని పెంచుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం. చట్ట విరుద్ధంగా చేసిన ఎఫ్‌బీఎం పరిమితుల సవరణను అడ్డుకోవాలని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతే కాదు, రాజ్యంగ విరుద్ధమైన ఈ అంశాన్ని ప్రధానమంత్రి పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమితులను అతిక్రమించి చేస్తున్న అప్పులకు అనుమతిస్తే, రాష్ట్రంతో పాటు బ్యాంకులు కూడా కుప్పకూలడం ఖాయమని, రాష్ట్రం, బ్యాకులు కుప్పకూలకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందని వైసీపీ ఎంపీ పేర్కొన్నారు.

అయితే లోక్ సభలో ఈ పలికింది రఘురామకృష్ణం రాజే అయినా పలికించింది మాత్రం బీజేపీ పెద్దలే అని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయంగా బీజేపీకి దగ్గరవుతున్న రఘురామకృష్ణం రాజు బుజాన తుపాకీ పెట్టి జగన్ రెడ్డి  ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచ్చులు బిగిస్తోందని అంటున్నారు. ఇటీవల ఎంపీ లాడ్స్ నిధులను వైసీపీ ఎంపీలు చర్చిల నిర్మాణానికి వినియోగించిన విషయాన్ని రఘురామరాజు ప్రధాని దృష్టికి తెచ్చిన తర్వాతనే కేంద్రం రాష్ట్రానికి తాఖీదులు ఇచ్చిన విషయాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.  అదే నిజమైతే, జగన్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో పడడమే కాదు, కేంద్రం రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.