చంద్రబాబు, భువనేశ్వరికి వల్లభనేని వంశీ క్షమాపణలు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. కొంతకాలంగా వైసీపీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై తాను పొరబాటున వ్యాఖ్యలు చేశానని, తీవ్ర భావోద్వేగాల నడుమ ఒక మాట తప్పుగా దొర్లిందని అంగీకరించారు. అందుకు తాను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని, ఆత్మసాక్షిగా క్షమాపణలు తెలుపుకుంటున్నానని వల్లభనేని వంశీ వెల్లడించారు.

తాను భువనేశ్వరిని అక్కా అని పిలుస్తానని వివరించారు వంశీ. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని, తన నుంచి మరోసారి ఇలాంటి పొరబాటు వ్యాఖ్యలు రావని స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. కులం నుంచి వెలివేస్తారన్న కారణంతో తాను క్షమాపణలు చెప్పడం లేదని, ఆత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకున్నానని వల్లభనేని వంశీ ఉద్ఘాటించారు.ఓ మీడియా ఛానెల్ డిస్కషన్ లో వల్లభనేని చంద్రబాబు, భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. 

ఇటీవల మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్, అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర రాజకీయ దుమారం రేగింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారంటూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నానితో పాటు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భద్రత పెంచింది. 

లేపేస్తే 50 లక్షలు.. క‌మ్మ కులంలో చీడ‌పురుగులు.. ప‌రిటాల బ‌తికుంటేనా..

తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలో జరిగిన కమ్మ కులస్తుల వనసమారాధనలో స్థానిక కౌన్సిలర్ మల్లాది వాసు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబును హత్య చేయాలంటూ కామెంట్ చేశారు, కులంలో ఉన్న చీడపురుగులు కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి చీడపురుగులను భౌతికంగా నిర్మూలించాల్సిన అవసరముందన్నారు. ఇప్పటి నుంచే అలాంటి ఆపరేషన్ మొదలు పెట్టాల్సిన అవసరముంది. ఈ పనికి ఎవరన్నా ముందుకు వస్తే వారికి రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు.