మోదీ మరో మెట్టు పైకి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ  విశ్వాసాలతో, ఆయన పరిపాలనా విధానాలతో ఎవరైనా విభేదించవచ్చుకానీ.. భాతర రాజకీయాల్లో ఆయన స్థానాన్ని మాత్రం ఎవరూ  కాదన లేరు. నిజానికి.. స్వతంత్ర భారత రాజకీయాల్లో, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా  ఆరు వరస విజయాలను సొంతచేసుకున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ. వరసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యంత్రిగా విజయం సాధించిన మోదీ..  భారత ప్రధానిగా వరసగా 2014, 2019, 2024లో  హ్యాట్రిక్ సాధించి  డబుల్’ హ్యాట్రిక్’ సాధించిన ఏకైక నాయకుడిగా చరిత్ర పుటల్లో నిలిచి పోయారు. 

ఇక ఇప్పుడు మోదీ మరో రికార్డు ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇంతవరకు దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానిగా స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరున ఉన్న రికార్డును మోదీ సొంత చేసుకున్నారు. ఇందిరాగాంధీ.. 1966 జనవరి  నుంచి 1977 మార్చి  వరకు 4 వేల 77 రోజులు ప్రధాని పదవిలో కొనసాగారు.  కాగా.. 2014 మే 26 న తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ  శుక్ర వారం (జూలై 25, 2025)తో 4,078 రోజులు పూర్తిచేసుకుని ఇందిరాగాంధీ రికార్డు ను అధిగమించి దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. కాగా.. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు (1947-1964) పదవిలో కొనసాగారు. 

అనుకోకుండా ఎమ్మెల్యే అయినా కాకుండానే..  2001లో నేరుగా ముఖ్యమంత్రిగా గుజరాత్ శాసనసభలో కాలు పెట్టిన మోదీ 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత 2014లో ప్రధానిగా పార్లమెంట్ లో తొలి అడుగు పెట్టారు. మోదీ నాయకత్వంలో   బీజేపీ  2014లో 272 లోక్‌సభ సీట్లతో ఘన విజయం సాధించింది.  2019లో ఈ సంఖ్య 303కు పెరిగింది  ఇది బీజేపీ బలాన్ని స్పష్టం చేసింది.  2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ..  ఎన్డీఏ భాగస్వాముల సహకారంతో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 లో 30 ఏళ్లుగా సాగుతున్న సంకీర్ణ రాజకీయాలకు చుక్కపెట్టిన నేతగా.. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్సేతర  ఏకైక నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu