కింజరాపు రామ్మోహన్ నాయుడికి మోడీ, చంద్రబాబు బర్త్ డే విషెస్
posted on Dec 18, 2025 11:32AM

కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ, తెలుగుదేశం సీనియర్ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా రామ్మోహన్ నాయుడికి బర్త్ డే విషెస్ తెలుపుతూ.. పౌర విమానయాన రంగంలో సంస్కరణల కోసం రామ్మోహన్ నాయుడు విస్తృతంగా కృషి చేస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. రామ్మోహన్ నాయుడు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. రామ్మోహన్ నాయుడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రిగా ఆయన ఏపీలో విమానయానరంగం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నారని కొనియాడారు.
రామ్మోహన్ నాయుడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా రామ్మోహన్ నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఏపీ మంత్రి నారా లోకేశ్ రామ్మోహన్ నాయుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రియ సోదరుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేస్తూ రామ్మోహన్ నాయుడి నిబద్ధత, పనితీరును దగ్గర నుంచి చూశాననీ, భారత విమానయాన రంగాన్ని తీర్చిదిద్దుతున్న తీరు అద్భుతమనీ పేర్కొన్నారు.