ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు.. 3న ఫలితాలు
posted on Feb 28, 2025 5:49AM

తెలుగు రాష్ట్రాలలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానాలకూ, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికీ, అలాగే తెలంగాణలో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్ధానానికీ, కరీంనగర్, నల్లొండ్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకూ గురువారం (ఫిబ్రవరి 28) పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గ్రాడ్యుడేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ఓ మోస్తరుగా జరిగింది. అదే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలలో మాత్రం భారీగా జరిగింది. బుధవారం (ఫిబ్రవరి 27) శివరాత్రి కావడంతో జాగారం ప్రభావం కారణంగా ఉదయం పోలింగ్ మందకొడిగా ప్రారంభమైనప్పటికీ తరువాత క్రమంగా పుంజుకుంది.ఇక మార్చి 3న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.
కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మల్సీ స్థానానికి 69.57 శాతం పోలింగ్ జరగగా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 69.50 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలలో 92.40 శాతం పోలింగ్ నమోదైంది.
ఇక తెలంగాణలో కరీంగన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో పోలింగ్ శాతం 63.4శాతం నమోదు కాగా కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ శాతం 83.24శాతంగా నమోదైంది. నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో పోలింగ్ శాతం 93.55 శాతంగా నమోదైంది. మొత్తంగా స్వల్ప సంఘటనలు వినా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.