టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అక్బరుద్దీన్ ఆగ్రహం

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. మిత్రపక్షమైన తమ పార్టీ నాయకులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం సభ్యులను అదుపుచేసే ఉద్దేశంతో వుందని, అందుకని వాళ్ళతోపాటు తమని కూడా అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తమ పార్టీ సభ నుంచి వాకౌట్ చేస్తోందని ప్రకటించారు. ఆ తర్వాత ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు. అలాగే ప్రభుత్వం శాసనసభలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు నేతృత్వంలో స్పీకర్ మధుసూదనాచారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. బీఏసీ సమావేశానికి తెలుగుదేశం తరఫున ఒక్కరికి మాత్రమే అవకాశం ఇవ్వడం దురదృష్టకరమన్నారు. సభలో అధికారపక్షం తమ గొంతు నొక్కుతోందని, విద్యుత్, డీఎల్ఎఫ్ భూముల అంశంపై చర్చలో పాల్గొనకుండా తమను అడ్డుకోవడం అధికార పార్టీకి న్యాయం కాదని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు.