ఆ శాఖలు మాకొద్దు కర్ణాటకం మళ్లీ మొదలు!

కర్ణాటకలో భారీ మెజారిటీతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్యమంత్రి ఎంపిక మొదలు  అడుగడుగునా బాలారిష్టాలను ఎదుర్కుంటోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంతవరకు ఎదురైన సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటూ వస్తోంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్  తగ్గేదేలే  అంటూ  సీఎల్పీ నేత సిద్దరామయ్యతో పోటీ పోటీ పడినా, అధిష్టానం సిద్దరామయ్యను ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కించింది.  డీకే శివకుమార్ డిప్యూటీతో సరిపెట్టుకున్నారు.

ఆ తర్వాత మాత్రి వర్గం కూర్పు లోనూ సిద్ద రామయ్య, డీకే మరో మారు జబ్బలు చరిచారు. ఫలితంగా పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటులో  కొంత జాప్యం జరిగింది. అయినా, చిరవకు, ‘ఆల్ ఈజ్ వెల్ దట్  ఎండ్స్ వెల్’ అన్నట్లు ఆ ఎపిసోడ్ కూడా సుఖాంతమైంది. ముందు పది మంది, ఆ తర్వాత 24 మంది మొత్తం 34 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి కొంచెం ఆలస్యంగానే అయినా మంత్రులకు శాఖలు కేటాయించారు. దీంతో ఇప్పుడు మళ్ళీ, మరో ముసలం మొదలైంది.ఆశించిన శాఖలు రాని మంత్రులు చిర్రుబుర్రు మంటున్నారు. 

మరో వంక కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించిన ఐదు గ్యారెంటీలకు సంబందించిన శాఖలు దక్కిన మంత్రులు, ఈ శాఖలు మాకొద్దని అంటున్నారు. అంతే కాదు, అవసరం అయితే మంత్రి పదవులకు రాజీనామా చేస్తాం కానీ, ఆ( గ్యారెంటీల అమలు) భాద్యతలను తీసుకునేంది లేదని మొరాయించినట్లు తెలుస్తోంది. బెంగళూరు నగరంలోని బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డికి రవాణ శాఖ కేటాయించారు. గతంలో కూడా రామలింగా రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మహిళలు ఆర్ టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు నష్టాల్లోకి వెలుతున్న రవాణా శాఖను తనకు అప్పగించడంతో రామలింగా రెడ్డి మండిపడుతున్నారని తెలిసింది.

ఇప్పటికే 7 సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిచిన అయన తనంతటి  సీనియర్ కు రవాణా శాఖ ఇస్తారా? మీ శాఖలు మీ దగ్గరే పెట్టుకుని మీరే చూసుకోండి, నేను మంత్రి పదవికి రాజీనా చేస్తానని ఇప్పటికే సీఎం సిద్దరామయ్యకు ఫోన్ చేసి రామలింగా రెడ్డి చెప్పారని మీడియా సమాచారం. అలాగే రామలింగా రెడ్డి బాటలోనే మరో సీనియర్ నాయకుడు,ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి మునియప్ప ఏకంగా ఢిల్లీకి వెళ్లి అధిష్టానం వద్ద తమ గోడు వినిపించుకున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిసి, తన శాఖ మార్చాలని కోరారు. అయితే, రాహుల్ గాంధీ, ఆయన అభ్యర్ధనను నిర్ద్వందంగా తోసి పుచ్చడమే కాకుండా రాజీనామా చేయాలనుకుంటే చేయవచ్చని,లోక్ సభ ఎన్నికల వరకు మంత్రి వర్గంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

అలాగే  గతంలో హోం మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన డాక్టర్ జీ. పరమేశ్వర్ కూడా ఇంటలిజెన్స్ విభాగం ఇవ్వకుండా కేవలం హోమ్ శాఖ మంత్రిగా నియమించి తన పరువు తీశారని  మండిపడుతున్నారని తెలిసింది.ఇస్తే పూర్తిగా హోమ్ శాఖ ఇవ్వాలని, అందులో కోతలు కొయ్యడం సరికాదని పరమేశ్వర్ మండిపడుతున్నారని తెలిసింది. 

అయితే, కర్ణాటక గెలుపుతో లోక్ సభ ఎన్నికలకు నిచ్చెనలు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఎవరి మాట వినే మూడ్ లో లేదని అంటున్నారు. మరో వంక ఐదు గ్యారెంటీల అమలు విషయంలో ఒత్తిడి పెరుగుతున్న నేపధ్యంలో, మరో రెండు రోజులలో జూన్ 1 న జరిగే పూర్తి స్థాయి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య హామీల అమలుకు విధి విధానాలు ఖరారు చేసే కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. అయితే, ఎనికల సందర్భంగా చెప్పిన విధంగా అందరికీ  అన్ని ఉచితాలు అమలు చేస్తారా? నిబంధనలు వర్తిస్తాయి ..అంటారా అనేది చూడవలసి ఉంది.