తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ?

ఆ ఇద్దరు నాయకులు బీజేపీలో చేరడం లేదు. ఇదే విషయాన్ని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అవును. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరని, ఈటల స్పష్టం చేశారు. అంతే కాదు, వారు బీజేపీలోకి రావడం ఏమో కానీ, వారు నన్నే తమ వెంట రమ్మంటున్నారని సంచలన ప్రకటన చేశారు. 

మరో వంక  తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు,తాము బీజేపీలో చేరడం లేదని ఒక టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంతే కాదు ఈటలనే తమతో పాటు రావాలని కోరామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు, అయితే ఈటలను తమతో ఎక్కడికి రమ్మన్నారు? అందరం కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుందాం,రమ్మని ఈటలను ఆహ్వానించారా లేక అందరం కలిసి కొత్త పార్టీ పెడదాం రమ్మని  ఆహ్వానించారా? అనే విషయంలో జూపల్లి, ఈటల ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ ఆప్షన్ రైట్ ఆఫ్ చేసిన జూపల్లి కాంగ్రెస్  విషయంలో తమ నిర్ణయాని వచ్చే నెలలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

అయితే, అదలా ఉంటే ఆ ఇద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే ప్రచారం  జోరుగా సాగుతోంది. జూన్ 8వ తేదీన జూపల్లి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్తున్నారని మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బిజెపి, కాంగ్రెస్ పోటాపోటీగా ఇరువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ చాలా కాలంగా పార్టీలో చేరికపై నిర్ణయాన్ని ప్రకటించని జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ బాట పట్టడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ లో చేరాలని జూపల్లి మొదట నిర్ణయించినప్పటికీ, తాజాగా జూన్ 8వ తేదీన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా ఖమ్మంలో జూన్ 20వ తేదీ లోపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ ఉండగా ఆ సభ తరువాత పొంగులేటి, ఆయన అనుచరులు కాంగ్రెస్ లో చేరే  నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం.

అయితే అదే సమయంలో మరో వంక పొంగులేటి, జూపల్లితో పాటుగా, ప్రస్తుతం బీజేపీ, కాంగ్రస్, బీఆర్ఎస్ పార్టీలలో ఉన్న; కేసీఆర్ కుటుంబ పాలనను వ్యతిరేకిస్తున్న మరి కొందరు నాయకులతో కలిసి సొంతంగా పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నాయకులు, క్యాడర్ ఉన్నా నాయకుల్లో విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో అనే అనుమనాలు, పొంగులేటి, జూపల్లి వెనకడుగు వేసేలా చేస్తున్నాయని అంటున్నారు. అలాగే సీనియర్ నాయకులకు బీఆర్ఎస్ తో ఉన్న లోపాయి కారి సంబంధాల విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితిలో ఓ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసేందుకు తెర వెనుక సమాలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ  విషయంలో స్పష్టత రానప్పటికీ రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న20 నుంచి 25 మంది నాయకులు ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. ఈ పరిణామాల నేపధ్యంలో, పొంగులేటి, జూపల్లి కదిపిన తేనేతుట్టే రాష్ట్రంలో రాజకీయ పుననేకీకరణకు దారి తీసినా ఆశ్చర్య పోనవసరం లేదని, పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఎన్నికల ముందు చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు అంతిమంగా బీఆర్ఎస్ కు మేలు చేకూర్చేలా ఉన్నాయన్న అభిప్రాయమూ వ్యక్తమౌతోంది.