వారంటే మంత్రి సురేశ్‌కి భ‌యం.. ద‌ళితుల‌పై దాడిపై అందుకేనా మౌనం?

జ‌గ‌న్‌రెడ్డి సీఎం అయ్యాక ఏపీలో ఏ ఒక్క వ‌ర్గమూ ప్ర‌శాంతంగా లేదు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లూ ఏదో ఒక విధంగా బాధితులుగానే మారారు. ద‌ళితుల‌పై దాడులు మునుపెన్న‌డూ లేనంత‌గా జ‌రుగుతున్నాయి. శిరోముండ‌నం చేసినా ప‌ట్టించుకునే పాల‌కులే లేరు. వైసీపీ ప్ర‌భుత్వంలో అంద‌రికంటే ఎక్కువ‌గా అణిచివేయ‌బ‌డుతున్న‌ది ఎస్సీలే అంటారు. తాజాగా, మంత్రి సురేశ్ ఇలాఖాలో ద‌ళితుల‌పై జ‌రిగిన దాడి తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఇంత జ‌రుగుతున్నా.. మంత్రి గారు మాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం, దాడి చేసిన వారిపై త‌గు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. అందుకే, మినిస్ట‌ర్‌ సురేశ్‌పై టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. వైసీపీలోని ఓ వ‌ర్గానికి సురేశ్ భ‌య‌ప‌డుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

సొంత నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులు చేస్తుంటే విద్యాశాఖ మంత్రి సురేశ్‌ ఏం చేస్తున్నారని అచ్చెన్న‌ ప్రశ్నించారు. వైసీపీలోని ఓ వర్గానికి సురేశ్‌ భయపడుతున్నారని ఆరోపించారు. భయపడకపోతే దాడి చేసిన నేతలను సస్పెండ్ చేయాలన్నారు. దళితుల భూములు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వైసీపీ నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.   

ఏపీలో ఎస్సీలను అణచివేయడమే వైసీపీ నైజంగా కనిపిస్తోందని దుయ్య‌బ‌ట్టారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో దళితులపై వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించారు. జగన్ పాలనపై ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారనే అక్క‌సుతోనే దాడులు చేసి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిషత్ ఎన్నికల్లో  వైసీపీ నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణం అవుతారా? ఆ ఆరోప‌ణ‌తో త‌న‌కు ఓటేయ‌లేద‌ని ద‌ళితుడిపై దాడి చేసి కొడ‌తారా? అంటూ మండిప‌డ్డారు.