తెలంగాణ కాంగ్రెస్ లో పీకే ఫియర్.. హై కమాండ్ నిర్ణయంపై టెన్షన్ టెన్షన్
posted on Apr 21, 2022 2:13PM
ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. జాతీయ స్థాయిలో ఈ పేరు కాంగ్రెస్ లో నూతనోత్సాహాన్ని నింపుతుంటే...తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం గుండె బేజారౌతోంది. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ పటిష్టత కోసం రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైకంమాడ్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఊపిరాడనీయడం లేదు.
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా విభేదాలున్నప్పటికీ ఎవరికి వారుగానైనా కష్టపడి పని చేస్తున్న తరుణంలో పీకే కాంగ్రెస్ గూటికి చేరడం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. ఎందుకంటే....తెలంగాణ రాష్ట్ర సమితికీ పీకేనే అవ్వయిజర్. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ లో చేరితే, ఇక్కడి కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏమిటి? ఎందుకంటే...గత కొంత కాలంగా జాతీయ స్థాయిలో బీజేపీని దీటుగా ఎదుర్కోవాలంటే...ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తలనుసిఫారసు చేస్తున్నారు. అంతే కాక జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలన్నీ విభేదాలు విస్మరించి ఒకే గొడుగు కిందకు రావాలని కాళ్లకు బలపం పట్టుకు మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీకే కాంగ్రెస్ లో చేరిక తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. ఒక వేళ పీకే ప్రతిపాదనలు, సిఫారసులను అంగీకరించి కాంగ్రెస్ హై కమాండ్ రాష్ట్రంలో తెరాసతో జట్టు కట్టేందుకు అంగీకరిస్తే పరిస్థితి ఏమిటన్నదే రాష్ట్ర కాంగ్రెస్ నేతల టెన్షన్ కు, కంగారుకు కారణం. ఇంత కాలం ఉప్పు, నిప్పూగా ఉంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ లు వచ్చే ఎన్నికల నాటికి జట్టు కడితే...అది ప్రజలకు పంపే సంకేతాలు పార్టీ ప్రతిష్టకు, ప్రయోజనాలకు భంగకరంగా ఉంటాయన్నది వారి భయం. అంతకు మించి భయానికి కారణమేమిటంటే... గెలుపు గుర్రాలకే టికెట్ల పేరుతో పీకే తన టీమ్ తో చేయించే రహస్య సర్వేల ఫలితం ఉద్దేశ పూర్వకంగా తమకు వ్యతిరేకంగా ఉండేలా పీకే మానిప్యులేట్ చేస్తారన్నదే. అందుకు కారణాలు లేకపోలేదు. పీకే కేసీఆర్ కు రాజకీయ సలహాలు ఇస్తున్నారనగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా పీకేపై విమర్శలు గుప్పించారు. పొలిటికల్ బ్రోకర్ గా ఎద్దేవా చేశారు. వంద మంది పీకేలొచ్చినా రాష్ట్రంలో తెరాస మరోసారి అధికారంలోనికి రావడం అసంభవమంటూ ప్రకటనలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర తెలంగాణ నేతలు తమ భవిష్యత్ ఎలా ఉంటుందన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.
పీకే కాంగ్రెస్ ప్రవేశం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిష్ట మసకబారుతుందన్న ఆందోళనా వారిలో వ్యక్తమౌతున్నది. ఇప్పటికే టీఆర్ఎస్ పీకే సలహాలూ, సూచనలూ తీసుకుంటుండటమే కాకుండా, పీకే బృందంలో రాష్ట్రంలో పరిస్థితులపై సర్వే కూడా చేయించింది. మరో సారి కాంగ్రెస్ తరఫున అదే బృందంలో పీకే సర్వే చేయడమంటే....అది టీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చేదిగా ఉంటుందనీ, ప్రాంతీయ పార్టీలతో చెలిమి అన్నఫార్ములాకు కాంగ్రెస్ అంగీకరిస్తే... ఆ చెలిమిలో భాగంగా కాంగ్రెస్ సీట్ల విషయంలో భారీగా కోత పడటం తథ్యమని ఇక్కడి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ కు ఒకిన్ని ఎక్కువ స్థానాలు ఇస్తే చాలని హైకమాండ్ అంగీకరిస్తుందేమో అన్న అనుమానం కూడా పార్టీ సీనియర్ నేతలన వేధిస్తున్నది. సప్పోజ్ ఫర్ సప్పోజ్ అదే జరిగితే తమ రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది ఇక్కడి నేతల భయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.