సబితపై శంకరరావు కంప్లైంట్

హైదరాబాద్: చేనేత,జౌళీ శాఖ మంత్రి శంకరరావు బుధవారం హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిపై గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల శంకరరావుపై ఎన్టీఆర్ నగర్‌లో దాడి జరిగిన విషయం తెలిసిందే.ఓ భూవివాదం కేసులో జహంగీర్‌కు అండగా వెళ్తే హోంమంత్రి అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని గవర్నర్‌కు తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో కలిసి శంకరరావు  రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. తాను దళితుడినని, తనను అవమానించేరీతిలో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టి అవమానించారని ఫిర్యాదు చేశారు.ఈ విషయంలో హోంమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి శంకరరావుపై దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం ఎల్బీ నగర్‌లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. తాను అవినీతిపై పోరాటం చేస్తున్నందునే దాడి జరిగిందని, అయినప్పటికీ తన పోరాటం ఆపేది లేదని శంకరరావు చెప్పారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu