భయపెడుతున్న 'థానే'

విశాఖ : పెనుతుఫాన్‌గా మారిన 'థానే' చెన్నైకు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని శుక్రవారం ఉదయం చెన్నై- నాగపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో పన్నెండు గంటల్లో ఇది బలపడి తీరం దాటాక బలహీనపడే అవకాశముంది. తమిళనాడుతోపాటు మన రాష్ట్రంలోని దక్షిణకోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉత్తరకోస్తాలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అన్ని పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలో పలు బోట్లు సముద్రంలో చిక్కుకు పోయాయి. కొన్ని బోట్లు సురక్షితంగా ఉండగా, మరికొన్ని బోట్లను సముద్రంలో వంద నాటికల్ మైళ్ల దూరంలో అధికారులు గుర్తించారు. వీరిని రక్షించడానికి కోస్టుగార్డు అధికారులు రంగంలోకి దిగారు. గుంటూరులో ఓ బోటులో నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా నిడమర్రులో 25 మీటర్లు, అంతర్వేదిలో 30 మీటర్ల చొప్పున సముద్రం ముందుకు వచ్చింది. తీరప్రాంతాల్లో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో తుఫాను సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాకినాడ - ఉప్పాడ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.
 

కాగా, రాష్ట్రంలో భయాందోళనలు కలిగిస్తున్న థానే తుఫానుపై ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ స్పందించారు. సిఎస్‌కు ఫోన్ చేసి అప్రమత్తతగా ఉండాలని హెచ్చరించారు. ఆయా జిల్లా కలెక్టర్లకు కావాల్సినన్ని అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు. మత్సకారులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, తుఫాను కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu