వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం
posted on Jun 27, 2025 4:19PM

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. పురుషుల సర్జికల్ వార్డు వద్ద పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ బిల్డింగ్‌లో పూర్తిగా దెబ్బతిన్నదని గతంలో కూడా పెచ్చులు ఊడి పెషెంట్‌లు పడగా పలువురు గాయపడ్డారని సిబ్బంది వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఆసుపత్రిలో ఇలాంటి ప్రమాదాలు జరగడం సాధారణం అయిందని, అధికారులు ఎవరూ భవనలు మరమ్మత్తులను పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో చేపట్టిన 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఎంజీఎం ఆస్పత్రిలో దెబ్బతిన్న భవనాల మరమ్మతులు చేయడం అవసరమా అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రతి వర్షాకాలంలో భవనం పెచ్చులు ఊడిపోవడం, ప్రమాదాలు జరగడం, పలువురు గాయపడుతున్నారని విమర్శలొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆస్పత్రి మానిటరింగ్ కమిటీ సభ్యులు కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం ఆస్పత్రిలో పరిశీలన చేస్తున్న సమయంలోనే ఎంజీఎం ఆసుపత్రి సర్జికల్ వార్డులో పెచ్చులూడి పడటం చర్చనీయాంశంగా మారింది.