పారాసిటమాల్, మల్టీ విటమిన్ మరింత కాస్ట్లీ.. భారీగా పెరగనున్న మందుల ధరలు
posted on Mar 26, 2022 12:29PM
జ్వరం వస్తే పారాసిటమాల్. కరోనా వచ్చినా అదే మెడిసిన్. అందులో డోలో 650కి మరింత డిమాండ్. ఇక కొవిడ్ కాలం నుంచి జింక్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వినియోగం భారీగా పెరిగింది. కరోనా లేకున్నా జింకోవిట్, విటమిన్-సి, విటమిన్-డి ట్యాబ్లెట్లు రోజూవారీగా వాడుతున్నారు చాలామంది. యాంటీబాటిక్స్ సైతం చాక్లెట్లలా చప్పరించేస్తున్నారు. ఇవి కాక, బీపీ, షుగర్, అలర్జీ, హార్ట్ ట్యాబ్లెట్స్ వాడేవారు కోకొల్లలు. వీరందరికీ ఇప్పుడో షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు భారీగా పెరగనున్నాయి. ఏకంగా 10 శాతం కంటే ఎక్కువే రేటు పెరగనుంది. అందులో అధిక శాతం అత్యవసర ఔషధాల జాబితాలో ఉన్నవే. మరి, డిమాండ్ పెరిగిందనో, రా మెటీరియల్ షార్టేజో.. కారణం ఏదైనా ఇకపై అనేక మందులు బాగా ఖరీదు కానున్నాయి.
ఓ వైపు నిత్యావసరాలు.. మరోవైపు గ్యాస్, చమురు, కరెంట్ ధరల మోతతో సతమతమవుతున్న సామాన్యుడిపై ఈసారి మందుల భారం కూడా పడనుంది. జ్వరం, ఇన్ఫెక్షన్, బీపీ వంటి వ్యాధులకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలు ఏప్రిల్ నుంచి పెరగనున్నాయి. వీటి ధరలు 10.8శాతం పెరగనున్నట్లు జాతీయ ఔషధాల ధరల సంస్థ-NPPA ఓ ప్రకటనలో వెల్లడించింది.
అత్యవసర ఔషధాల జాబితాలో ఉండే 800 షెడ్యూల్డ్ మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి 10.8శాతం పెరగనున్నాయి. జ్వరం, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలన్నీ పెరుగుతాయి. ఇందులో పారాసెటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడజోల్ వంటి ఔషధాలున్నాయి. విటమిన్స్, మినరల్స్ ధరలు కూడా కాస్ట్లీ కానున్నాయి. కొవిడ్ బాధితులు వాడే మందుల ధరలూ అధికం కానున్నాయి. కొవిడ్ పాండమిక్ కారణంగా తయారీ ఖర్చులు పెరగడంతో ఔషధాల ధరలను పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తుండగా.. ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.